Take a fresh look at your lifestyle.

విరసం స్థాపన – లక్ష్యం

ప్రజల దీర్ఘకాలిక పోరాటాలను సమర్థించడం సభ్యత్వానికి గీటురాయిగా పెట్టుకున్న సంబంధం కార్యక్షేత్రం రచన. ప్రజా ఉద్యమాలను, పోరాట రూపాలను సమర్థించడం అంటే రచన చేయడం. కాబట్టి విప్లవ రచనకు, విరసానికి ఉండే పరిధి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. సాహిత్య రచనను ఆయుధంగా స్వీకరించిన విప్లవ రచయితలకు ప్రజా జీవిత సర్వస్వమే పరిధి. అంత విశాలమైన కార్యక్షేత్రాన్ని విరసం ప్రకటించుకుంది. మార్క్సిజాన్ని శాస్త్రంగా, శస్త్రంగా అందించి ప్రజా జీవిత సర్వస్వమంతా కార్యరంగంగా భావించడం వల్లనే సాహిత్య రచనా రంగంలో విరసం కృషి మూడు తరాలుగా విస్తరిస్తోంది.

Establishment the goal
1970 అక్టోబర్‌లో ఖమ్మంలొ విరసం తొలి మహాసభల సందర్భంగా..

ఆధునిక తెలుగు సాహిత్యం చరిత్రలో దృక్పథం చర్చ ఉన్నదే. వేర్వేరు దృక్పథాలు తలపడుతూ వచ్చాయి. ఆ దృక్పథాల వెలుగులో శక్తివంతమైన సాహిత్యం వచ్చింది.అయితే ప్రగతిశీల శిబిరంలో దృక్పథ బలహీనత కూడా ఉన్నది. ఇది అనేక రకాలు. దృక్పథమంటే ఏమిటో తెలియకపోవడం దగ్గరి నుంచి అనేక దృక్పథాల కలయిక దాకా ఇది కొనసాగుతుండేది. మార్క్సిస్టుల్లోనే దృక్పథ అస్పష్టత, వేర్వేరు దృక్పథాల్లో మంచిని గుర్తించే ఉదారత ఉండేవి. వాటన్నిటీ మధ్య సమన్వయం సాధించడమే మార్క్సిజమనే అమాయకత్వం కూడా ఉండేది. వీటిలో సంప్రదాయ ఛాయలు, మార్కిస్టేతర భావవాద, ఉదారవాద ధోరణులు, చివరికి రివిజనిస్టు వైఖరులు ఉండేవి. భారతీయ భాషా సాహిత్యాల్లో దృక్పథ, భావజాల ప్రాధాన్యత ఎక్కువగా ఉండే తెలుగులోనే ఇంత గందరగోళం ఉండేది. ఇది కేవలం సాహిత్య, మేధో రంగాల్లోనే అనుకుంటే పొరపాటు. ప్రగతిశీల, వామపక్ష ఉద్యమంలోనే ఈ బలహీనత ఉండింది. కమ్యూనిస్టు పార్టీ చాలా సమరశీల పోరాటాలు చేసినా పార్టీ కేంద్ర నాయకత్వంలోనే ఈ ధోరణులు ఉన్నాయి. భారతీయ తాత్విక సంప్రదాయాల దగ్గరి నుంచి యాంత్రిక, జడతర్కం దాకా అన్నీ మార్క్సిజం పేరుతో చెలామణిలోకి వచ్చాయి.వీటన్నిటికంటే అతి పెద్ద వెలితి పార్టీ అవగాహనలోనే ఉంది. కమ్యూనిస్టు పార్టీకి విధిగా ఉండాల్సిన రాజ్యాధికార వ్యూహం లేనే లేదు.

బ్రిటీష్‌ ‌వ్యతిరేక జాతీయవాద దృక్పథానికి కమ్యూనిస్టు పార్టీ పరిమితం అయింది. వలస వ్యతిరేక చారిత్రక యుగంలో జాతీయవాద ఛాయలు ప్రబలే అవకాశం ఉంటుంది. అయితే భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాట దృక్పథం దాన్నుంచి కాపాడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన రోజుల్లో కొద్దికాలం రాజ్యాధికార స్ప•హ ఉండింది. అయితే అది యావత్తు పార్టీ అవగాహనగా మారలేదు. ఆ తర్వాత సాయుధ పోరాటాన్ని విరమించింది. పార్లమెంటరీ మార్గానికి వెళ్లిపోయింది. ఈ రాజకీయ నేపథ్యంలో పార్టీ అవలక్షణాలను చూడాలి. ఇవి సహజంగానే సాహిత్య, మేథో రంగాల్లో కనిపించాయి. నక్సల్బరీ ఉద్యమం సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం అనే లక్ష్యంలో బయల్దేరింది. రివిజనిస్టు దృక్పథం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని బయటపడేసింది. విప్లవ దృక్పథాన్ని అందించింది. ఈ నేపథ్యంలో విప్లవ సాహిత్యోద్యమాన్ని చూడాలి. కమ్యూనిస్టు ఉద్యమం సంతరించుకున్న వర్గపోరాట దృక్పథం వల్లనే మొత్తం తెలుగు సాహిత్య రంగంలో దృక్పథ చర్చ బయల్దేరింది.

ఈ మొత్తానికి విప్లవ రచయితల సంఘం నాయకత్వం వహించింది. ఇప్పటికీ ప్రగతిశీల, విప్లవ సాహిత్య శిబిరంలో దృక్పథపరమైన నాయకత్వం విరసానిదే. సాహిత్య కళా రంగాలకు ఉండే ప్రత్యేకతే ఇది. దృక్పథం విషయంలో స్పష్టత లేకుండా ఎన్ని ‘మంచి’ పనులు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ లోపాన్ని విరసం సవరించింది. ఈ యాభై ఏళ్లుగా సాహిత్యరంగంలో దృక్పథ రాహిత్యం, దృక్పథ లోపం తలెత్తినప్పుడల్లా విరసం తన పాత్ర నిర్వహిస్తోంది. విరసం అవిర్భావంతో మొదలైన రాజకీయ, సిద్ధాంత సంవాదం మొత్తం తెలుగు సాహిత్య మేథో రంగాలనే కుదిపి వేసింది. సాహిత్య రంగంలో పేరుకుపోయిన నానా రకాల దృక్పథాలన్నీ దిగ్గున లేచి కూచున్నాయి. యథాతథ స్థితి చెల్లాచెదరవుతుందని కంగారు పడి కత్తులు దూశారు. రివిజనిజమా? విప్లవమా? అనే సంవాదం కమ్యూనిస్టు శిబిరంలో తీవ్రంగా నడిచింది. ఈ క్రమంలో విప్లవ సాహిత్యోద్యమం అప్పటి దాకా ఉన్న నానా రకాల ప్రగతి వ్యతిరేక భావజాల వ్యవస్థలను ధ్వంసం చేసింది. స్థిరపడి ఉన్న అన్ని రకాల ప్రమాణాలను నేలమట్టం చేసింది. వీటన్నిటిని ఆశ్రయించి ఊపిరి తీస్తున్న దృక్పథ బలహీనతలు, సంప్రదాయ ధోరణులు, దృక్పథ రాహిత్య వాదనలు, అన్నిటినీ కలుపుకపోయే సమన్వయ సూత్రీకరణలు చెల్లాచెదరైపోయాయి. తెలుగు సాహిత్య, కళా, మేధో రంగాల్లో దృక్పథ స్పష్టతకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో విరసం చేసిన అతి ముఖ్యమైన పని ఏమిటి? అనే ప్రశ్నకు వివరాల్లోకి వెళ్లకుండా టకీమని దృక్పథ స్పష్టతను తీసుకొచ్చి సరికొత్త పునాదిపై తెలుగు సాహిత్య చరిత్రను పునర్నిర్మించింది అని ఒకే ఒక సమాధానం చెప్పవచ్చు.
దీనికి 1970 జులై 4 ఒక గుర్తు.

1. నేపథ్యం:
సాహిత్యరంగంలో దృక్పథ స్పష్టతకు పెద్ద పెనుగులాట జరిగింది. తీవ్ర సంఘర్షణ నడిచింది. విప్లవ దృక్పథం రూపొందడం వెనుక ఈ చరిత్ర ఉన్నది. అందులో నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల తక్షణ ప్రధానం. అది గుణాత్మక మార్పును సూచిస్తుంది. నక్సల్బరీకి ముందు తెలుగు సాహిత్య రంగం అనుభవించిన స్థితిని ఏ ఒక్క రూపానికో కుదించలేం. ఏ ఒక్క పాయగానో నిర్ధారించలేం. సంక్షుభిత సమాజపు మన:స్థితి, దాని గతిశీలత ఎన్నెన్నో తీరులనో ఆశ్రయించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ ద్రోహం చేశాక సామాజిక సాహిత్య సాంస్క•తిక రంగాలన్నీ నిస్సారంగా తయారయ్యాయి. పోరాట చైతన్యం కొడిగట్టింది. నిరాశాపూరిత వాతావరణం ఏర్పడింది. ఇది సాహిత్యరంగంలో కూడా పొడసూపింది. ఈ స్థితిని బద్దలు కొట్టిన ఘనత దిగంబర కవులదే. ఆ కాలంలోని నిస్సత్తువ దాపున పేలడానికి సిద్ధంగా ఉన్న శక్తి వాళ్ల కవిత్వంలో ధిక్కారంగా వ్యక్తమైంది. దీనికంటే ముందు 1964 మే నెలలో విడుదలైన రాత్రి కవితా సంకలనంలో విరసం పూర్వరంగ స్థితి వ్యక్తమవుతుంది. రాత్రి అనడంలోనే అప్పటి నిరాశామయ స్తబ్దతను సూచిస్తున్నది.

ఇందులోని పదిహేను మంది కవు)కూ గాడాంధకారం అలుముకున్నదనే వరకు ఏకీభావం ఉన్నది. అలాగే ఈ చీకటి తొలగిపోతుందనే ఆశా దృష్టి కొందరిలో ఉన్నది. ఇట్లా వేర్వేరు దృక్పథాలతో, వైఖరులతో రాత్రిని అర్థం చేసుకున్నారు. ఈ చీకటి వెలుగుల స్థితిని కవిత్వంలో చిత్రించినందు వల్లనే రాత్రి కవితా సంపుటిని విరసం ఆవిర్భావానికి కర్టెన్‌ ‌రైజర్‌గా కొందరు భావిస్తారు. సమాజం ఒక స్థితి నుంచి మరో స్థితిలోకి మారడానికి పడుతున్న సంఘర్షణ అంతా ఇట్లా సాహిత్యంలో వ్యక్తావ్యక్తంగా ప్రతిఫలించింది. అతి సమీపంగా, సుదూరంగా వ్యక్తమైంది. ఉన్న స్థితి మీద అసహనంగా, ఆగ్రహంగా బైటపడింది. దారి ఎటో తెలియని అన్వేషణగా సాగింది. దారి వెతుక్కుంటున్న చైతన్యంగా రూపుదాల్చింది. ఇక వెలుగు లేదు, గాడాంధకారమే అనే నిరాశ నుంచి సామాజిక సంఘర్షణలోంచి చిరు ఆశగా వెలుగు పరుచుకున్నది. ఇంకో పక్కన రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీలోని రివిజనిజాన్ని బద్ధలు కొడుతూ కా. చారుమజుందార్‌ ‌నాయకత్వంలో జరిగిన సన్నాహాలు ఒక పెద్ద పోలరైజేషన్‌కు దారి తీసింది. ఆయన రాసిన ఎనిమిది డాక్యుమెంట్లు యువ కమ్యూనిస్టులను విప్లవం దిశగా ఊర్రూతలుగించాయి. నక్సల్బరీ గ్రామంలో జరిగిన తిరుగుబాటుకు విప్లవకారులు ఆయన నాయకత్వంలో సాయుధ రూపాన్ని ఇచ్చారు.

నక్సల్బరీ పోరాటం ఈ దేశ విముక్తిపంథాగా వేలాది మంది యువతను విప్లవంలోకి ఆకర్షించింది. అప్పటికే కమ్యూనిస్టులుగా పేరు మోసిన ఎందరో కామ్రేడ్స్ ‌రివిజనిస్టు నిర్మాణాలను వదిలి విప్లవ మార్గంలోకి వచ్చారు. 1964 నుంచి 1967 దాకా సాగిన పూర్వరంగంలో నక్సల్బరీ ప్రజ్వలన జరిగింది. 1969 ఏప్రిల్‌ 22‌న సిపీఐ ఎంఎల్‌ ఏర్పడింది. ఇదొక గుణాత్మక పరిణామం. పశ్చిమ బెంగాల్‌ ‌కేంద్రంగా జరిగిన ఈ పరిణామాలు దేశమంతా అలుముకుపోయాయి. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. 1967 అక్టోబర్‌ 31‌న ఆదివాసీ కామ్రేడ్స్ ‌కోరన్న, మంగన్నలు అమరులయ్యారు. శ్రీకాకుళం పార్టీ సాయుధ పోరాటానికి సిద్ధమైంది. 1968 నవంబర్‌ 25‌న సాయుధ పోరాట ప్రకటన ఇచ్చింది. ఇవన్నీ సాహిత్యరంగంలో ఒక దారిని చూపిస్తున్నాయి.

2. ప్రణాళిక-చర్చ:
ఈ సందర్భంలోనే విరసం ఆవిర్భావానికి తక్షణ ప్రేరణగా 1970 ఫిబ్రవరిలో శ్రీశ్రీ షష్టి పూర్తి సభ జరిగింది. అంతక ముందు శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటంలో పెన్నూ గన్నూ పట్టి పోరాడిన సుబ్బారావు పాణిగ్రాహి 1969 డిసెంబర్‌ 22‌న బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఆయనతో స్ఫూర్తి పొందిన విద్యార్థులు విశాఖ శ్రీశ్రీ షష్టి పూర్తి సభలో రచయితలారా మీరెటువైపు అనే ప్రశ్న సంధిస్తూ ఒక కరపత్రాన్ని పంచారు. రచయితలు శ్రీకాకుళంలో అమరుడైన పాణిగ్రాహి వారసత్వాన్ని స్వీకరిస్తారా? అని అందులో నిలదీశారు. ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటం పక్షాన నిలబడతారా? లేదా అని చారిత్రక సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. ఆ సభలో ఉన్న రచయితలు ఈ కరపత్రంతో రెండు బృందాలుగా విడిపోయారు. శ్రీకాకుళం పక్షాన నిలబడటానికి సిద్ధమైన రచయితలు తమ కర్తవ్యం గురించిన ఆలోచనల్లో పడ్డారు. ఇది హైదరాబాదులో 1970 జులై 4,5 తేదీల్లో సెవెన్‌స్టార్‌ ‌సిండికేట్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సదస్సు దాకా నడిచింది. ఆ సదస్సు గురించి కొకు, కెవిఆర్‌ అప్పటికే తన వైఖరి ప్రకటించారు.జూలై 3వతేదీ సదస్సు ముందు రోజు శ్రీశ్రీతో సమాలోచనలతో ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక విరసం ఆవిర్భవిస్తున్నట్లు ప్రకటన జరిగింది.

విరసం ఆవిర్భవించిన 1970 జులై 4 వెనుక ఇంత సుదీర్ఘమైన నేపథ్యం ఉన్నది. అది సామాజిక సాహిత్య జమిలి నేపథ్యం. సాయుధ పోరాటం తప్ప వేరే మార్గం లేదనే స్పష్టతను విప్లవ శక్తులు సంతరించుకోవడం వల్లనే తెలుగు సాహిత్యంలో దృక్పథ స్పష్టత వచ్చింది. ఇది విరసం రూపంలో వచ్చింది. ప్రజా దృక్పథానికి ప్రతినిధిగా విరసం బయల్దేరింది. ఈ మొత్తానికి వెనుక రాజకీయ ఉద్యమ నేపథ్యం లేకపోతే ఇవేవీ లేవు. ఇవేవీ జరిగేవి కావు. రచనా రంగంలో దిగ్గజాలైనప్పటికీ కొందరు ప్రముఖ రచయితలు వ్యక్తులుగా తీసుకోగల నిర్ణయం కాదిది. తమ ఆగ్రహ గొంతుకతో లోకం దద్దరిల్లిపోయేలా కవిత్వాన్ని వినిపిస్తుండిన యువ కవి బృందాలు సాధించగలిగే విజయం కాదిది. చారిత్రక శక్తుల సంఘర్షణ ఒక అవసరంగానే విప్లవాన్ని ముందుకు తెచ్చింది. దానికి సాయుధ వర్గపోరా•ం తప్ప వేరే దారి లేదనే నిశ్చితాభిప్రాయాన్ని నేల గర్భంలోంచి ఆకాశం దాకా వినిపించేలా, కనిపించేలా ప్రకటితమైంది. ఇదంతా విరసం దృక్పథంలో, లక్ష్య ప్రకటనలో స్పష్టమైంది.ఈనాటి దోపిడీ వ్యవస్థతో రాజీలేని వైఖరి నిజాయితీ గల ప్రతి రచయితకు తప్పనిసరి. నిజాన్ని నిర్భయంగా వెల్లడించడంలో రచయితలు భయ సంకోచాలను విడిచి ప్రజలకు బాసట కావాలి. తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలి. సాంస్క•తిక వికాసానికి అంకితమైన ఈ ‘విప్లవ రచయితల సంఘం’ సాహిత్యాన్ని జాతి జీవితంలో ప్రధానాంశం చేయబూనింది,ఈ లక్ష్యం, దృక్పథంతో పాటు విరసం తన నిబద్ధతను కూడా ఇందులో చాటుకున్నది. ఎన్నో ఉదార్తమైన ఆశయాలు, లక్ష్యాలు ప్రకటించుకున్న సాహిత్య సంస్థలు మనకున్నాయి.

కానీ ప్రజల దీర్ఘకాలిక విముక్తి పోరాటాలు – అవి ఏ రూపంలో ఉన్నా వాటిని బలపరచడమే సభ్యత్వానికి అర్హతగా ఒక్క విరసమే ప్రకటించుకున్నది. అలాంటి రచయితలతో ఇది ఏర్పడుతున్నది అని చెప్పడంలోనే దాని ప్రత్యేకత ఉన్నది. అద్భుతమైన జీవన చిత్రణ చేయగలిగే రచయితలు ఎందరో ఉండవచ్చు. వాళ్లు గొప్ప ఆశయాలు, ఆకాంక్షలు ప్రకటించుకోవచ్చు. కానీ విరసం ఈ ప్రణాళికలో ప్రజల ఆకాంక్షలు, ఆరాటాలు, పోరాటాలు ప్రకటించింది. ఆ పోరాటాలను మనం గుర్తించాలి, అందుకోవాలి, బలపరచాలి. ఈ పని చేయడానికే విరసం ఏర్పడుతున్నదనే స్పష్టత ఉన్నది.ఈ క్రమంలో విరసం లక్ష్యం, దృక్పథం మరింత స్పష్టమయ్యాయి. అనివార్యమైన కాలం వొత్తిళ్ల మధ్య, ఒక పెద్ద సమీకరణలో భాగంగా ఆ పదిహేను మంది రచయితలు ఆవిర్భావ ప్రకటన చేశారు. అందులో ఎంత మాత్రం హడావిడి లేదు. తొందరపాటు లేదు. అదే సంవత్సరం అక్టోబర్‌ 8, 9 ‌తేదీల్లో ఖమ్మంలో తొలి మహాసభల నాటికి దృక్పథం, లక్ష్యం మరింత విస్తరించాయి.స్పష్టత వచ్చింది. విప్లవ రచయితల సంఘం లక్ష్యం, దృక్పథం రెండూ ఇంత విస్తరించాయి.ప్రజల దీర్ఘకాలిక విమోచన పోరాటాలను గుర్తించి బలపరిచే రచయితలే సభ్యులని, ఏ రూపంలో జరుగుతున్న ప్రజా పోరాటాలనైనా సమర్థించడమే లక్ష్యమని ఆవిర్భావ ప్రకటన చేసిన సంస్థ మూడు నెలల్లో ఇంత స్పష్టత పొందింది.

నక్సల్బరీ పంథాను స్వీకరిస్తున్నట్లు ఆవిర్భావ ప్రకటన చేసిన రచయితలు తాము విప్లవానికి సాహిత్య సాంస్క•తిక సాంఘిక రంగాలను సమాయత్తం చేయవలసి ఉంటుందని నిర్ణయించుకున్నారు. దానికంటే ప్రజల దీర్ఘకాలిక విమోచన పోరాటాల వెంట నడవవలసిన రచయితలు ఒక నిర్మాణంగా సంఘటితం అయ్యారు. ఒక సంస్థగా ఎంచుకోవలసిన లక్ష్యాల పట్ల ఏమరపాటు ఉండకూడదు. లక్ష్యాలు ఏమిటో తెలుసుకోవడం అంటే దానికి తగిన దృక్పథాన్ని సంతరించుకోవడమే. లేదా మార్క్సిస్టులుగా ప్రాపంచిక దృక్పథం విషయంలో ఉండే స్పష్టత, గాఢత, లోతు, లక్ష్యశుద్ధిని పెంచుతాయి. లక్ష్యంగా దృక్పథం ఇలా పరస్పర సంబంధాల్లో ఉంటాయి.ఈ పనులన్నీ చేయాలంటే సాహిత్యానికి ప్రజా జీవితానికి ఉండే సంబంధం తెలిసి ఉండాలి. దేనికంటే పైన చెప్పిన లక్ష్యం చేరుకోడానికి విప్లవ రచయితల సంఘానికి ప్రధాన ఆచరణ రచనే. విప్లవమనే ఆశయానికి, లేదా లక్ష్యానికి సాహిత్యాన్ని అంకితం చేయాలి. ప్రజల దీర్ఘకాలిక పోరాటాలను సమర్థించడం సభ్యత్వానికి గీటురాయిగా పెట్టుకున్న సంబంధం కార్యక్షేత్రం రచన. ప్రజా ఉద్యమాలను, పోరాట రూపాలను సమర్థించడం అంటే రచన చేయడం. కాబట్టి విప్లవ రచనకు, విరసానికి ఉండే పరిధి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. సాహిత్య రచనను ఆయుధంగా స్వీకరించిన విప్లవ రచయితలకు ప్రజా జీవిత సర్వస్వమే పరిధి. అంత విశాలమైన కార్యక్షేత్రాన్ని విరసం ప్రకటించుకుంది. మార్క్సిజాన్ని శాస్త్రంగా, శస్త్రంగా అందించి ప్రజా జీవిత సర్వస్వమంతా కార్యరంగంగా భావించడం వల్లనే సాహిత్య రచనా రంగంలో విరసం కృషి మూడు తరాలుగా విస్తరిస్తోంది.
– పాణి

Tags:

Leave A Reply

Your email address will not be published.