- దోషులకు కఠిన శిక్షల కోసం ప్రత్యేక ప్రణాళిక
- 1000 మందితో నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు
- డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇకపై డ్రగ్స్ అనే పదం వినిపించొద్దనీ, కేసులో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా కఠిన శిక్షలు పడేలా చూడాలనీ దీని అమలు కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం 1000 మందితో నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్సెల్, కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగంను వ్యవస్థీకృత నేరాలుగా పరిగణించి సమూలంగా నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా శుక్రవారం స్టేట్ పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డ్రగ్స్ నియంత్రణ చర్యలపై రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎస్పీలు, సీపీలు, ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. డ్రగ్స్ నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణ, వాటి నివారణకు సంబంధించిన విధి విధానాలను ఈ సమీక్షా సమావేశంలో చర్చించి కార్యాచరణను రూపొందించనున్నారు.