ఉప రాష్ట్రపతి, సిజేఐకి సౌత్ ఇండియా బార్ కౌన్సిల్స్ విజ్ఞప్తి
దక్షిణాదిలో చైన్నై కేంద్రంగా సుప్రీమ్ కోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్(పిఆర్బి) ఏర్పాటు చేయాలని సౌతిండియా బార్ కౌన్సిల్, ఉపరాష్ట్రపతిని, సీజేఐను కోరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, సౌతిండియా బార్ కౌన్సిల్ కమిటీ కన్వీనర్ నర్సింహా రెడ్డి నేతృత్వంలో ఓ బృందంగా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిసింది. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి నర్సింహా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దక్షిణాదిలో సుప్రీమ్ కోర్టు బెంచ్ ఏర్పాటు కోసం తెలంగాణ, ఏపి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్లు కమిటీగా ఫామ్ అయినట్లు తెలిపారు. దక్షిణాదిలో అత్యున్నత బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎన్నో ఏండ్లుగా ఉందన్నారు. లిటిగెంట్ ఢిల్లీ దాకా రావడం అనేది ఖర్చుతో కూడుకున్న అంశం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, లక్షల సంఖ్యలో పెరిగిపోయిన కేసుల పరిష్కారానికి దక్షిణాదిలో సుప్రీమ్ కోర్టు బెంచ్ ఏర్పాటు అత్యవసరమన్నారు. ఈ అంశంపై అన్ని బార్ కౌన్సిల్లు కూడా తీర్మానం చేశాయని గుర్తు చేశారు. ప్రస్తుతం సీజేఐ ఎన్వీ రమణకు కూడా ఈ విషయంపై పూర్తి స్థాయి అవగాహన ఉందన్నారు.
అందువల్ల దక్షిణాదిలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు ఇది సరైన సమయంగా భావించి ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. నార్త్‌లో ఢిల్లీ, సౌత్‌లో చైన్నై, ఈస్ట్‌లో కోల్ కతా, వెస్ట్‌లో ముంబై కేంద్రాలుగా పర్మినెంట్ రీజినల్ బెంచ్‌లు అవసరమన్నారు. అయితే, కానిస్టిట్యూషనల్ బెంచ్ మాత్రం ఢిల్లీలోనే ఉంటుందన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో గత 30 ఏండ్లుగా లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సిజేఐ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కేసులను పరిష్కరించాలంటే మరో 15 ఏండ్ల సమయం పడుతుందని చెప్పారు.
కేసుల పరిష్కరణకు నాలుగు బెంచ్‌లు విధిగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. తమ విజ్ఞప్తులపై వైస్ ప్రెసిడెంట్, సిజేఐ సానుకూలంగా స్పందించారన్నారని నర్సింహా రావు తెలిపారు. ఈ అంశంపై త్వరలో రాష్ట్రపతి, న్యాయ శాఖ మంత్రిని కలవనున్నట్లు వారు వెల్లడించారు. ఉప రాష్ట్రపతి, సీజేఐను కలిసిన వారిలో తమిళనాడు బార్ కౌన్సిల్ చైర్మన్ పిఎస్ అమల్ రాజ్, ఏపి బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంట రామారావు, కర్ణాటక బార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీనివాస్ బాబు, కేరళ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కెఎన్ అనిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ బి కొండా రెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు రామచందర్ రావులు ఉన్నారు.