Take a fresh look at your lifestyle.

హరహర మహాదేవ..శంభో శంకర..

శివనామస్మరణతో మార్మోగిన శైవాలయాలు
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాలయాలన్నీ హరహర మహాదేవ..అంటూ శివనామస్మరణతో మార్మోగిపోయాయి. శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ, కాలేశ్వరం, హన్మకొండ వేయిస్థంబాల గుడి, రామప్ప, ఛాయా సోమేశ్వరాలయం, ఏడుపాయల వనదుర్గామాత తదితర క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్‌ ‌ఛాయాసోమేశ్వరాలయం, పిల్లలమర్రి, వాడపల్లి శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగాయి. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు భారీగా పోటెత్తారు. సాయంత్రం స్వామి వారి కల్యాణమండపంలో మహాలింగార్చన నిర్వహించారు. రాత్రి 11:35 గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు… రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో శైక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం నుంచే అభిషేకాలు చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్‌ ‌వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్మీనర్సింహాస్వామి, ఐనవోలు మల్లిఖార్జునస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

కాళేశ్వరం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి. కొవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా పక్కాగా చర్యలు తీసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారిని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply