Take a fresh look at your lifestyle.

దేశంలో సమానత్వం ఓ మిథ్య

“భారత దేశం వెలిగిపోతోందన్న  రంగుల చిత్రాన్ని విదేశీ పెట్టుబడిదారుల ముందు ఉంచేందుకు ప్రధాని మోడీ ఎంతో శ్రమించారు. దేశంలో కార్పొరేట్‌, ‌కార్మిక చట్టాలు కొత్తవి అమలులోకి వచ్చాయనీ, అవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. అయితే, దేశంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉందో వివరించలేదు. హత్రాస్‌ ‌వంటి సంఘటనలన్నింటినీ చాపచుట్టేశారు. అయితే, యావత్‌ ‌ప్రపంచానికీ ఇలాంటి సంఘటనలు భారత్‌లో  వరుసగా జరుగుతున్నాయన్న సంగతి తెలుసు.  టైమ్‌ ‌మ్యాగజైన్‌ ‌ప్రదానమంత్రిపైనే సంపాదకీయం రాసింది. హత్రాస్‌ ‌మోడీ పాలనకు అద్దం పడుతోందని రాసింది.”

భారత దేశంలో సమానత్వం అనేది మిథ్య. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఇటీవల జరిగిన అత్యాచార సంఘటన ప్రత్యక్ష నిదర్శనం.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాత్రం భారత్‌లో అంతా బాగుందని ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కలల బేహారి. హత్రాస్‌లో జరిగిన లైంగిక దాడి సంఘటన మొట్టమొదటిది కాదు. మన దేశంలో దళిత మహిళలపై అత్యాచారాలు చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. వారి ఆత్మగౌరవాన్ని, ప్రతిపత్తిని కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దళిత మహిళలపై అత్యాచారం చేసి వారిని అగ్రవర్ణాలకు చెందిన పురుషులు హత్య చేసి చెట్లకు వేళ్ళాడ దీసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇతర వెనకబడిన తరగతుల(ఒబీసీల)కు చెందిన నాయకుడు  ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు అడ్డు అదుపులేకుండా జరుగుతూనే ఉన్నాయి. హత్రాస్‌ ‌సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడాలని దేశ ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటన యోగి ఆదిత్యనాథ్‌ ‌పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అగ్రవర్ణాల యువకులే ఇందుకు బాధ్యలని ఆరోపణలు వచ్చాయి. అయితే, ప్రధానమంత్రి మోడీ మాత్రం మౌనం పాటిస్తూ  ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇదే ఒక్కటే కాదు, ఇలాంటి సామాజికాంశాలపై ఆయన పెదవి విప్పడం లేదు. అయితే, కాశ్మీర్‌ ‌సమస్యపైనా, తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ పైనా, ఆయన వారసులపైనా, ముస్లిం సోదరీమణులపైనా, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ముస్లిం సోదరీమణులను ముమ్మారు తలాక్‌ ఆచారం నుంచి విముక్తి కలిగించానని చెప్పుకుంటూ ఉంటారు.

గత  వారం  భారత్‌లో పెట్టుబడులపై కెనడాలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రసంగిస్తూ  భారత్‌ ఉజ్వల భవిష్యత్‌ ఉన్న ప్రజాస్వామ్య దేశమనీ, రాజకీయ సుస్థిరతకు నెలవు అనీ, పెట్టుబడులకు స్వర్గధామమని ప్రకటించారు. వాణిజ్యరంగాన్ని ప్రోత్సహించే విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని ప్రకటించారు. భారత్‌లో ప్రతిభకూ, నైపుణ్యానికీ కొదవలేదని కూడా విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. జిడిపిలో 23.9 శాతం విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఆయన ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. భారత దేశం వెలిగిపోతోందన్న  రంగుల చిత్రాన్ని విదేశీ పెట్టుబడిదారుల ముందు ఉంచేందుకు ప్రధాని మోడీ ఎంతో శ్రమించారు. దేశంలో కార్పొరేట్‌, ‌కార్మిక చట్టాలు కొత్తవి అమలులోకి వచ్చాయనీ, అవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. అయితే, దేశంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉందో వివరించలేదు. హత్రాస్‌ ‌వంటి సంఘటనలన్నింటినీ చాపచుట్టేశారు. అయితే, యావత్‌ ‌ప్రపంచానికీ ఇలాంటి సంఘటనలు భారత్‌లో  వరుసగా జరుగుతున్నాయన్న సంగతి తెలుసు.  టైమ్‌ ‌మ్యాగజైన్‌ ‌ప్రదానమంత్రిపైనే సంపాదకీయం రాసింది. హత్రాస్‌ ‌మోడీ పాలనకు అద్దం పడుతోందని రాసింది.

ఎవరి ప్రధాని
ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థనూ విడిగా చూడలేం. దేశం యొక్క పరిస్థితులను సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి అంచనా వేయడం జరుగుతుంది.   పొలిటికల్‌ ఎకానమీపై యూరోపియన్‌ ‌జనరల్‌లో సుప్రసిద్ధ పరిశీలకులు మత్తియాస్‌ ‌బస్‌, ‌కార్టెన్‌ ‌హెఫెకర్‌లు ఒక వ్యాసం రాశారు. అంతర్గత ఘర్షణ,  జాతి పరమైన ఉద్రిక్తతలు, శాంతి భద్రతలు, అవినీతి, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, అధికారగణం తీరుతెన్నులు…ఇవీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని నిర్దేశిస్తాయని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

హత్రాస్‌ ‌వంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి మోడీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం, కనీసం బాధిత మహిళలను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని యోగి ఆదిత్యనాథ్‌ ‌హామీ ఇస్తే చాలదు. ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడాలి. హత్రాస్‌ ‌ఘటనలో నిందితులు ఠాకూర్‌ అనే అగ్రవర్ణానికి చెందిన వారు. దళిత మహిళకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వోటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దళితులపై దాడుల ఘటన ఇదొక్కటే కాదు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌వంటి నాయకులు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంతో కాలం దళితులపై దాడులను సహించబోమని హెచ్చరించారు.
వాయుసేన ఆధునీకరణ, ప్రధానమంత్రికి ఒకే టైపు విమానాలు, పార్లమెంటు కొత్త భవనాలు, విగ్రహాల కోసం కోటానుకోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ, దళితుల అభ్యున్నతికి తగినన్ని నిధులు కేటాయించడం లేదు. దేశంలో సామాజిక న్యాయం లేదనడానికి ఇదే నిదర్శనం. యావత్‌ ‌ప్రపంచం అన్నీ గమనిస్తోంది.
– ‘ది ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply