Take a fresh look at your lifestyle.

మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ

“ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వ్యాధులకు మించి కాలుష్యం జనాల ప్రాణాలను కబళిస్తోంది. మనదేశంలో గత ఏడాది 12.4 లక్షలమంది కేవలం వాయు కాలుష్యం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలుపోగొట్టుకున్నారు. దేశంలో సంభవిస్తున్న అకాల మరణాల్లో దాదాపు 26 శాతం మరణాలు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి . అత్యధిక స్థాయిలో కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్‌ ‌కు చెందిన నగరాలే ఎక్కువ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.”

ఆధునికత అనేది మనిషి అభివృద్ధికి తోడ్పడాలి కానీ అది వినాశానికి దారీతీయకూడదు. ఆధునిక మానవుడు తన ఉనికికి ఆధారమైన పర్యావరణ సమతు ల్యతను దెబ్బతీస్తున్నాడు. ఆర్థికా భివృద్ధి కొరకుప్రకృతి వనరులను కొల్లగొట్టి సంపద సృష్టించాలని తాపత్ర యపడు తున్నాడు. పునరుత్పత్తికి వీలుకాని ప్రకృతి వనరులను మితిమీరి వాడుతున్నాడు. అడవులను నరికి వేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యం మరింత పెంచడం, గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువులతో వాతావరణాన్ని, భూగోళాన్ని వేడెక్కించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు.దీంతో పర్యావరణ సమతుల్యత లోపించి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఏర్పడింది. పర్యావరణ కాలుష్యం అనేది సకల జీవ రాశుల సమస్యగా మారింది. శతాబ్దాలుగా మనిషి సాగించిన ప్రకృతి వనరుల విధ్వంసం అత్యంత ప్రమాదకరంగా భూతాపం పెరుగుదలకు, వాతావరణ మార్పులకు కారణభూతమై ప్రాణాంతక ఉత్పాతాలను సృష్టిస్తుంది. వీటన్నింటి నుంచి భూమిపై ఉన్న సమస్త జీవకోటికి మేలు చేయడమే ‘‘పర్యావరణ పరిరక్షణ’’.ఒకవైపు భారీ వర్షాలు తుఫాన్లు వరదలు మరోవైపు కరువు కాటకాలు ఇలాంటి పరస్పర విరుద్ధ వాతావరణ మార్పులు భూగోళంపై చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు భూతాపం పెరుగుదల ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

భూతాపం పెరుగుదల హిందూ కుష్‌ ,‌హిమాలయ పర్వత (హెచ్‌ ‌కె హెచ్‌) ‌ప్రాంతంలోని హిమనీ నదులను హరించే ప్రమాదం పొంచి ఉంది .2100 నాటికి ఈ ప్రాంతంలోని 64% హిమనీ నదులను మానవాళి కోల్పోయే మహా విషాదం కనుచూపు మేరలో ఉన్నట్టు వాతావరణ మార్పు పై అంతర్‌ ‌ప్రభుత్వ నిపుణులసంఘం (ఐపిసిసి ) ప్రత్యేక నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే మాయమవుతున్న మంచు హెచ్‌ ‌కె హెచ్‌ ‌సహా అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడుల పై తీవ్రప్రభావాన్ని చూపుతున్న విషయాన్ని ఐపిసిసి నివేదిక ప్రస్తావించింది. హెచ్‌ ‌కె హెచ్‌ ‌పర్వత శ్రేణులు, అత్యంత ఎత్తైన టిబెట్‌ ‌పీఠభూమి ప్రపంచంలోనే అత్యధిక జల సంపదకు ఆలవాలంగా ఉన్నాయి .ఇరిగేషన్‌ ‌వ్యవస్థల ద్వారా ఈ ప్రాంతం ప్రత్యక్షంగా 12 కోట్ల ప్రజలకు ప్రాణాధారంగా ఉంది .ఇక భారత్‌, ‌చైనా నేపాల్‌, ‌పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ,ఆఫ్ఘనిస్తాన్లలోని నదీ పరివాహక ప్రాంతాల్లో 130 కోట్ల ప్రజలకు ఇది పరోక్షంగా సాయపడుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తరచు వరదల ముప్పు సింధు, గంగ బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్రంగా ఉండవచ్చు. సముద్ర మట్టాలు కేవలం 50 సెంటీమీటర్ల పెరిగితే రేవు పట్టణాల్లోని 15 కోట్ల ప్రజలకు వరద ముంపు ప్రమాదం తప్పదని పేర్కొంది. ముంబై, కోల్కత్తా ,చెన్నై లాంటి మహానగరాలకు ఈ ముప్పు ఎక్కువ. వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే 75% పగడపు దిబ్బలు, సముద్ర అంతర్భాగంలోని అరుదైన జీవ జాతులు ప్రమాదంలోపడ్డాయి. అర డిగ్రీ భూతాపం పెరిగితే 90 శాతం మేర పగడపు దిబ్బలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్‌ ‌ల్యాండ్‌ ,అం‌టార్కిటిక్‌ ‌ప్రాంతంలో మంచు కొండలు కరిగి పెను నష్టం సంభవిస్తుంది. తాజాగా దేశం ఎదుర్కొంటున్న ఎడారి మిడతల దండయాత్ర కూడా వాతావరణ మార్పుల ప్రభావమే. హిందూ మహా సముద్రంలో డైపోల్‌ ఏర్పడం కారణంగా అరేబియా మరియు తూర్పు ఆఫ్రికా ఎడారి ప్రాంతాలలో తేమ పెరిగి మిడతల వృద్ధికి దోహద పడింది. వాతావరణ మార్పుల సమస్యను అధిగమించ డానికి వర్ధమాన దేశాలకు 2020 నుంచి ఎటా 100 బిలియన్‌ ‌డాలర్ల నిధిని అభివృద్ధి చెందిన దేశాలు సమకూర్చాలి. శతాబ్దం చివరి నాటికి భూతాపం పెరుగుదల రెండు డిగ్రీలు అంతకన్నా తక్కువకు పరిమితం చేయాలన్నది ప్యారిస్‌ ఒప్పంద లక్ష్యానికి అన్ని దేశాలు కట్టుబడి తద్వారా ప్రజల ఆహార ,ఆరోగ్య భద్రతలకు పెద్ద పీట వేయాలి.

ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వ్యాధులకు మించి కాలుష్యం జనాల ప్రాణాలను కబళిస్తోంది. మనదేశంలో గత ఏడాది 12.4 లక్షలమంది కేవలం వాయు కాలుష్యం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశంలో సంభవిస్తున్న అకాల మరణాల్లో దాదాపు 26 శాతం మరణాలు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి . అత్యధిక స్థాయిలో కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్‌ ‌కు చెందిన నగరాలే ఎక్కువ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత దారుణంగా మారిందంటే అక్కడి జనాలు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్‌ ‌బార్లను ఆశ్రయించాల్సి వచ్చింది. మరోవైపు పంట వ్యర్ధాలను తగలబెట్టడం ద్వారా ఏర్పడిన కాలుష్యంపై ఢిల్లీ కంటే నరకమే నయమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు కాలుష్యం యొక్క ప్రభావాన్ని తెలియజేస్తుంది. సల్ఫర్‌ ‌డయాక్సైడ్‌, ‌నైట్రోజన్‌ ‌డయాక్సైడ్‌ ,‌కార్బన్‌ ‌మోనాక్సైడ్‌ ,‌సీసం, బెంజిన్‌ ,‌కార్బాక్సిలిక్‌ ‌యాసిడ్‌ ఇలాంటి ఎన్నో కాలుష్య కారకాలు గాలిలో దుమ్ము ధూళితో కలిసిపోయి చిన్న చిన్నకణాలుగా ఏర్పడతాయి. ఈ ధూళి కణాలు (పార్టీ క్యూ లేట్‌ ‌మ్యాటర్‌ )‌రకరకాల పరిమాణాల్లో ఉండొచ్చు. పెద్ద కణాలు 10 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉండేవి కింద పడి పోతాయి. 2.5 మైక్రాన్ల కన్నా తక్కువ ఉండేవి మనకు అందుబాటులో లేనంత ఎత్తులో ఉండిపోతాయి. ఇక 2.5 మైక్రాన్ల నుంచి 10 మైక్రాన్ల పరిమాణంలో ఉండే కణాలు పైకి వెళ్లకుండా, కిందికి చేరకుండా నిరంతరం గాలిలో తేలియాడుతూ, మనం శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు , శ్వాస నాళం గుండా ప్రయాణించి ఊపిరితిత్తుల్లోకి పోయి పలు అనర్థాలకు దారితీస్తాయి. వాయు కాలుష్యం వల్ల దేశంలో దాదాపు 20 లక్షల మందికి పైగా పిల్లలు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వాయు కాలుష్యాన్ని ‘‘కొత్తరకం పొగాకు ‘‘ గాను వర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, వ్యవసాయం అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత, కారిచిచ్చు తదితర కారణాల వల్ల అటవీ సంపద క్షీణిస్తోంది. ఆస్ట్రేలియాలో సంభవించిన కారిచిచ్చు పర్యావరణానికి పెను ఉపద్రవాన్ని కలిగించింది. అడవులు భూమికి ఊపిరితిత్తులుగ పనిచేస్తాయి.సకల జీవరాసులకు ప్రాణ వాయువును అందిస్తాయి. అడవుల తరుగుదల 24 శాతం కర్బన ఉద్గారాలకు కారణమౌతుంది. ఫలితంగా భూమి వేడెక్కుతుంది. పర్యావరణ సమతుల్యానికి ఏ దేశంలో అయినా మూడో వంతు వైశాల్యంలో అడవులు ఉండాలి.ఐక్యరాజ్య సమితి, ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ )‌ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రపంచ అటవీ వనరుల అంచనా (జి ఎఫ్‌ ఆర్‌ ఎ ) 2015 ‌ప్రకారం 1990లో 31.6 శాతం గా ఉన్నా ప్రపంచ అడవుల విస్తీర్ణం 2015 నాటికి 30.6 శాతానికి తగ్గడం ఆందోళన కలిగించే విషయము.

ప్రపంచ సరాసరి అడువులవిస్తీర్ణం 30.6 శాతం కాగా భారత్‌ ‌లో అది 21.3 శాతం మాత్రమే ఉంది. జిఎఫ్‌ఆర్‌ఎ ‌ప్రకారం అడవులు సగటున హెక్టారుకు 74 టన్నుల కార్బన్‌ ‌ను నిల్వ చేసుకుంటాయి. ఈ విధంగా అడవులతో కర్బన శోషణ పరిమాణాన్ని పెంచడం ద్వారా హరితగృహ వాయువుల ప్రభావాన్ని, తద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చునని నిపుణుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ‘‘హరితహారం’’ పేరుతో నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకొని ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిరుపయోగ భూములు, సాగు చేయని స్థలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భారీ స్థాయిలో చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది.పేరుకు ఒకటే కానీ పలు రూపాల్లో ప్రత్యక్షమై, వాడి పారేసిన తర్వాత కూడా వందల ఏండ్ల అయినా నాశనం కాకుండా మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారుతున్న పర్యావరణ ప్రమాదకారి ప్లాస్టిక్‌. ‌స్వతహాగా ప్లాస్టిక్‌ ‌విషపూరితం కాదు, కానీ వాటి వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు.ప్రపంచంలో ఏటా 830 కోట్ల టన్నులు, భారత్‌ ‌లో94.6 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ ‌వెలువడుతుంది. ప్రస్తుతం 60 శాతం మేర ప్లాస్టిక్‌ ‌వ్యర్థాల సేకరణ మాత్రమే జరుగుతుంది. ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలను ’’రీసైక్లింగ్‌ ‌మరియు అప్‌ ‌సైక్లింగ్‌’’ ‌చేయడం ద్వారా పర్యావరణానికి, సహజ వనరులకు హానీ జరగదు. ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలను రీసైక్లింగ్‌ ‌చేసి రహదారుల నిర్మాణం లో ఉపయోగిం చుకోవడం ప్లాస్టిక్‌ ‌వ్యర్థాల నిర్మూలనలో నూతన విప్లవం. కాలుష్య నివారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించాలి.పర్యావరణ పరిరక్షణకు చట్టాలతో సరిపెట్టకుండా మానవ జీవన విలువలలో భాగం చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్య ఫలితాలను ఎక్కువగా అనుభవిస్తున్న పేదలు, మూగజీవుల సంరక్షణకు ప్రభుత్వాలు, కార్పొరేట్‌ ‌సంపన్నులు ప్రయత్నాలు చేయాలి. నేడు ప్రపంచాన్ని కరొనా కబళిస్తున్నవేళ ప్రకృతిని కాపాడుతూ దానికనుగుణంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రకృతితో అన్ని స్థాయిల్లో సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది.

Leave a Reply