Take a fresh look at your lifestyle.

పాత సమస్యలతో కొత్త సంవత్సరంలోకి…

కొరోనా మిగిల్చిన విషాదాలను మూటగట్టుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరం అనగానే కోటి ఆశలు. కానీ, ఈసారి కొత్త ఆశలు లేవు సరికదా, పాత లక్ష్యాలను సాధించలేని నిస్సహాయ స్థితిలో జనం ఉన్నారు. అయితే, నిస్సహాయత వల్ల నిస్పృహలో కూరుకుని పోకుండా ఆత్మనిర్భర్‌తో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. మనిషిని ఉత్సాహ పర్చేందుకు  ఉత్తేజాన్నిచ్చే నినాదంతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు పూర్వకాలంలో (ఇప్పటికీ పలు ప్రాంతాల్లో) యువతులు రంగవల్లులు దిద్ది హ్యాపీ న్యూయిర్‌ ‌గ్రీటింగ్స్ ‌ముగ్గులు వేయడం పరిపాటి. కానీ, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల గెట్‌ ‌టుగదర్‌ ‌లు,  విందులు, వినోదాలు సర్వసాధారణం అయ్యాయి. ఇవి కూడా పరిమితులకు లోబడి నిర్వహించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఈ పార్టీల సందర్భంగా చెవులు గడలు పడే సంగీతంతో పొరుగువాడు ఏమైపోయినా పర్వాలేదనే ధీమాతో చేసే గానగంభీర్యాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

వీటిని నివారించవొచ్చు. కానీ, అధికార వర్గం ఉదాసీనత వల్ల ఇవి అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి.  డిసెంబర్‌ 31‌వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్త సంవత్సరానికి విందులు, నృత్యాలతో స్వాగతం పలికే సంప్రదాయం పాశ్చాత్యులది. దానిని మన వాళ్ళు అమలులో పెట్టి చాలా కాలమైంది. మొగ్గలోనే తుంచేయాల్సిన ఈ సంప్రదాయాన్ని రాజకీయ ప్రముఖులు చూసీ చూడనట్టు ఊరుకోవడం వల్ల అది పెద్దదై  ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. మామూలు రోజుల్లో ఇలాంటి వినోదాలను ఎవరూ పట్టించుకోలేదు. కొరోనా వల్ల దేశం మొత్తం అట్టుడికి పోయింది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. జన సమూహాన్ని పెంచే సమావేశాలను నిషేధించాలని ప్రజాహితైషులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొత్త సంవత్సరం సంరంభాలను  నిషేధించాలంటూ పత్రికల్లో, మీడియాలో వొచ్చిన వార్తలను పురస్కరించుకుని తెలంగాణ హైకోర్టు సూమోటోగా కేసు నమోదు చేసింది. కొరోనా తగ్గినా, కొత్త స్ట్రెయిన్‌ ‌జనాన్ని భయపెడుతున్న వేళ, కొత్త సంవత్సర సంరంభాలకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త కొరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. జనవరి ఏడవ తేదీన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ మధ్య ప్రతి నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. తిరగతోడుతున్నారు. అలాగే, ఇది కూడా చేయవొచ్చు. ఎల్‌ఆర్‌ఎస్‌ ‌విషయంలోనూ,  పంటలు వేయడం విషయంలోనూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. రైతులు తమకు ఏది నచ్చితే ఆ పంటలు వేసుకోవొచ్చని సూచించారు. అలాగే, ఎక్కడ ధర వొస్తే అక్కడ అమ్ముకోవొచ్చని సూచించారు.

- Advertisement -

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట యమపాశాలని అభివర్ణించిన కేసీఆర్‌ ‌మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కేసీఆర్‌ను యూ టర్న్ ‌ముఖ్యమంత్రి అంటూ అభివర్ణించారు.   రాజకీయాల్లో ఇలాంటివి సహజమే కానీ, అధికారంలో ఉన్న నాయకులు  తాము తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలు కాకుండా చూడాలి.  ఇప్పటికైనా కేసీఆర్‌ ‌మనసు మార్చుకున్నందుకు ప్రజలు ఆనందిస్తున్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని ఎల్‌ఆర్‌ఎస్‌ ‌విషయంలో రుజువైంది. ఎంతో మంది  డబ్బు కట్టేశారు. అలాగే, సన్నవడ్లు వేసిన రైతులు అమ్మకాలు జరగక ఇబ్బందులకు గురి అయ్యారు. వారంతా కొత్త సంవత్సరంలో పాత సమస్యల కొనసాగింపుతో ఇబ్బందులను ఎదుర్కోవల్సి వొస్తుంది. కేసీఆర్‌కి ఉన్నపళంగా ఉద్యోగుల మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే, శాసనమండలికి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ వరాలను ఆయన ప్రకటించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణను కొట్టివేయలేము. ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందిందే. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వానికి విధేయులుగానే ఉంటున్నారు. ఒక్క తెరాసకు మాత్రమే కాకుండా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగులు ఎక్కడో కానీ, వ్యతిరేకంగా పని చేయరు. మిగిలిన వర్గాల సంగతి ఏమిటి? వరద బాధితులకు అందించాల్సిన సాయం ఇంకా చాలా ప్రాంతాల్లో అందలేదు. భారీ వర్షాలకు గూడు కోల్పోయిన వారిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే, కొత్త సంవత్సరంలో పాత సమస్యలను మూటగట్టుకుని ప్రవేశిస్తున్న సామాన్యునికి ఊరట కలిగించే నిర్ణయాలేవీ ప్రభుత్వం తీసుకోలేదు. అటు కేంద్రం కూడా ఆత్మనిర్భర్‌ ‌పేరిట ధైర్యంగా ఉండమని చెబుతోంది. ప్రజలు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటున్నారు.

ఎన్ని కష్టాలొచ్చినా పరస్పరం సాయం అందించుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంపై ఆశపెట్టుకునేంత అమాయకులెవరూ ఇప్పుడు లేరు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా స్వీయ రాజకీయ ప్రయోజనం కోసమే పని చేస్తుందన్నది వారికి అనుభవమే. అందుకే ఆత్మనిర్భర్‌ అనేది ప్రజల రక్తంలో ఉంది. అది భారతీయుల రక్తంలో ఉంది. ప్రభుత్వాలు పెద్దల కోసమే కానీ, పేదల కోసం కాదని వారు స్థిర నిశ్చయానికి వొచ్చారు. కొరోనా నేర్పిన పాఠాలతో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. పొదుపు పెరిగింది. ఆరోగ్యం, పొదుపులతో జీవితం సాఫీగా సాగించేందుకు వారు నిశ్చయించుకున్నారు. ఆత్మనిర్భర్‌ అనేది నినాదం కాకుండా దానిని అమలులో పెడుతున్నారు. ప్రధానమంత్రికి ఈ విషయం తెలుసు. అందుకే, ప్రజలకు నినాదాలు ఇచ్చి, పెద్దలకు వరాలు ఇస్తున్నారు.

Leave a Reply