హెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లో మాదిగలకు, ఇతర ఉపకులాలకు ఎంతెంత వాటా ఇవ్వాలని తేల్చడానికి ఒక కమిషన్‌ను నియమించారు. ఆ విషయం తేల్చడానికి ఒక కమిషన్ అవసరమా? షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న ఉపకులాలలో ఒక ప్రధాన కులం అన్యాయంగా ఆ రిజర్వేషన్ ప్రయోజనం మొత్తాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ చర్యను ఆపడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు సరిపోదా?
డాక్టర్ రామనాథంను పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఆయన అంత్యక్రియలో భాగంగా పదవరోజున కర్మకు హాజరు కావడానికి కొందరు బంధువులు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగగానే వారిని పోలీసులు అటకాయించారు . ఆ బంధువులలో ఉన్న సివిఎల్ నరసింహారావు ఆ తర్వాత జడ్జి కూడా అయ్యారు. వారందరినీ పోలీసులు స్టేషన్లోనే ఆపివేసి, రైల్లోనో బస్సులోనో హైదరాబాద్ తిరిగి వెళ్లిపొమ్మని పంపించేశారు.
ఈ దేశ రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను రద్దు చేయడానికి పోలీసులు ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి ఈ మాత్రం ఉదాహరణలు చాలు.
సరే, ఒంగోలులో పోలీసు కాల్పులపై విచారణ జరుపుతున్న అయ్యర్ కమిషన్ గురించి చెబుతున్నాను గదా. పోలీసు కాల్పులు అనివార్యమైన పరిస్థితులలోనే జరిగాయని, నిరసనకారులలో ఎవరూ తమపై కాల్పులు జరిపిన పోలీసులు గుర్తించలేదని జస్టిస్ అయ్యర్ మిగిలిన న్యాయమూర్తులందరి లాగే నివేదిక రాశారు. ఆ కమిషన్ విచారణ మొత్తంలో జరిగినదేమంటే నాకు జస్టిస్ అయ్యర్‌తో దగ్గరి పరిచయం ఏర్పడింది . అయ్యర్ తన అనుభవాలూ ఇతర సంగతులూ ఆసక్తికరంగా కథలు కథలుగా చెబుతుండే వారు.ఆయన తన ఉద్యోగంలో శిక్షణ పొందే రోజుల్లో రూథర్‌ఫర్డ్ దగ్గర పని చేశారు. రూథర్‌ఫర్డ్ అంటే అల్లూరి సీతారామరాజు నడిపిన ఉద్యమాన్ని అణచివేసిన అధికారి. ఆనాటి సంగతులన్నీ అయ్యర్ చెప్పేవారు. అంతే జస్టిస్ అయ్యర్ ఎవరికీ ఉద్దేశ్యపూర్వకంగా అపకారం చేశారనుకోను. ఆయన చాలా మంచివాడు. హాస్యప్రియుడు , సంభాషణా చతురుడు.
నేను ఒంగోలులో ఆయనతో గడిపిన సాయంకాలాలలో ఒక రోజున ఆయన తాను ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు తన దగ్గర ఉండిన ఇద్దరు సహాయ కార్యదర్శుల మధ్య వచ్చిన తగాదా గురించి చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరు పెద్ద అవినీతి పరుడని మరొకరు బహిరంగంగా ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదు లిఖిత పూర్వకంగా వచ్చిందట. ఆ రోజుల్లోని ఆనవాయితీ ప్రకారం ఆ ఫిర్యాదు చివర ఆ సహాయ కార్యదర్శి ‘‘దురదృష్టవశాత్తూ ఇవన్నీ చూసేందుకే కాబోలు భగవంతుడు నాకు కళ్లు ఇచ్చాడు. మరి ఇక నేను చూడకుండా ఎలా ఉండగలను?’’ అని రాసి ముగించాడట. ఆ ఫిర్యాదు తిరిగి తిరిగి అయ్యర్ దగ్గరికి వచ్చిందట. ‘‘నీకు కళ్లు ఇచ్చిన ఆ భగవంతుడే, అపార కరుణామయుడై ఆ కళ్లకు రెప్పలు కూడా పెట్టాడు. కావాలంటే నీవు వాటిని మూసుకోవచ్చు’’ అని రాశారట అయ్యర్. ఆ ఫిర్యాదుల యుద్ధం అలా ముగిసిందట.
వివాదాలు తలెత్తినప్పుడు చాలా మంది తీసుకునేది ఇటువంటి వైఖరే. సమస్యలను చూడకపోతే సరిపోతుంది అని వాళ్లు భావిస్తారు.
విచారణ కమిషన్లు నియమించడం, వాటిలో సాధారణ ప్రజానీకానికి భాగస్వామ్యం కల్పించడం అనే పద్ధతే సంబంధిత విషయాలలో ఎక్కువ మందికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, ప్రచారం చేయడం కోసం ఉద్దేశించినది. కాని మన రాజకీయ ప్రక్రియలో అసలు విచారణ కమిషన్ల మౌలిక ఉద్దేశ్యమే తిరగదోడడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తక్షణ పరిష్కారం అవసరమైన విషయాలపై నిర్ణయాలను వాయిదా వేయడానికి, నాన్చడానికి ఒక సాధనంగా విచారణ కమిషన్ల నియామకం జరుగుతోంది.
తాజా ఉదాహరణ చూడాలంటే హెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లో మాదిగలకు, ఇతర ఉపకులాలకు ఎంతెంత వాటా ఇవ్వాలని తేల్చడానికి ఒక కమిషన్‌ను నియమించారు. ఆ విషయం తేల్చడానికి ఒక కమిషన్ అవసరమా? షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న ఉపకులాలలో ఒక ప్రధాన కులం అన్యాయంగా ఆ రిజర్వేషన్ ప్రయోజనం మొత్తాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ చర్యను ఆపడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు సరిపోదా? అందరికందరూ అగ్రవర్ణాల వారు నిండి ఉండే ఒక న్యాయమూర్తుల బెంచికి అస్పృశ్యులందరూ ఒకటేననిపిస్తుంది. షెడ్యూల్డ్ కులాల జాబితాలో అందరూ అస్పృశ్యులేగదా అనీ, వారి మధ్య తేడాలు చూసే అధికారం రాష్ట్రపతికి తప్ప మరెవరికీ లేదనీ వాళ్లకు అనిపించింది. కాని ఆ న్యాయమూర్తులు ఈ నిర్ధారణకు రావడానికి ఉపయోగించిన పద్ధతి ఏమిటో ఎవరి ఊహకూ అంతుపట్టనిది.
ప్రజా ప్రాధాన్యత గల అంశాలలో విచారణ కోసం నియమించిన అనేక కమిషన్ల ముందు హాజరైన నా అనుభవంతో చెప్పగలదేమంటే, ఈ కమిషన్ల నియామకాలు ప్రభుత్వంగాని, చట్టాన్ని అమలు చేయవలసిన సంస్థలుగాని సమస్యలను పక్కదారి పట్టించడానికి ఉపయోగించే ఎత్తుగడలు మాత్రమే. ఈ విచారణ కమిషన్ల ముందు సాక్షులు సాక్ష్యాధారాలు సమర్పించకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం, శాసనాధికార వ్యవస్థలు అన్ని ప్రయత్నాలూ చేస్తాయి . ఇందులో శక్తివంతులైన ప్రైవేటు వ్యక్తుల, స్వార్థపరశక్తుల పాత్ర కూడా ఉంటుంది. వీళ్లందరూ కలిసి అధికారులు తమను తాము సమర్థించుకోవడానికిగాని, ప్రభుత్వ తప్పిదాల నుంచి దృష్టి మరల్చడానికిగాని, ప్రభుత్వాధికారంలో ఉన్న వ్యక్తులు చేసిన అకృత్యాలను కప్పి పెట్టడానికిగాని ప్రయత్నిస్తారు.
ఈ సందర్భంలో మరొక సంఘటన గురించి చెప్పాలి. అది న్యాయవాదులు తమ నల్లకోటు వేసుకుని అంటే బాధ్యతా నిర్వహణలో భాగంగా, హైదరాబాద్‌లో జరిపిన ఊరేగింపు. ఆ న్యాయవాదుల ఊరేగింపు పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న పోలీసు కంట్రోల్ రూం దగ్గరికి చేరగానే దాన్ని పోలీసులు ఆపివేశారు. న్యాయవాదులను యూనిఫారంలో ఉన్న పోలీసు అధికారులు కొట్టారు. ఆ సమయంలో ఆ పోలీసు అధికారుల వంటి మీద ఖాకీ చొక్కాలు ఉన్నాయి గాని వాటి మీద వారిపేర్లు, నంబర్లు, భుజాల మీద వారి బలగం పేర్లు, పట్టీలు లేవు. ఈ సంఘటన మీద విచారణ జరపడానికి ఒక కమిషన్‌ను నియమించడం జరిగిందిగాని ఆ వివరాలు తెలియకపోవడం వల్ల న్యాయవాదులను కొట్టిన పోలీసు అధికారులు ఎవరో గుర్తించడం అసాధ్యమైపోయింది . అంటే కమిషన్ నియామకం అవతలి వ్యక్తులను బోల్తా కొట్టించడానికి ఒక తెలివైన ఎత్తుగడగా కనబడుతుందిగాని, దాని ఫలితం ఏమిటి?.