Take a fresh look at your lifestyle.

పాకిస్తాన్‌కు జ్ఞానోదయం ?

భారత్‌ ‌పక్కలో బల్లెంలా ఇంతకాలం వ్యవహరిస్తున్న పాకిస్తాన్‌కు నిజంగానే జ్ఞానోదయం అయిందా అంటే ఆ దేశ ప్రధాని తాజాగా చేసిన ప్రకటన అక్కడి రాజకీయ నేతల దృక్పథంలో కొంత మార్పును సూచిస్తున్నట్లుగా ఉంది. తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలద్వారానే పరిష్కరించుకోవలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవల దుబాయ్‌కు చెందిన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌తెలపడం చూస్తుంటే ఆ దేశ ఆలోచనా సరళిలో కొంత మార్పు వొచ్చినట్లుగా కనిపిస్తున్నది.
వాస్తవంగా పాకిస్తాన్‌ ‌ప్రధానిగా షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌బాధ్యతలు చేపట్టినప్పుడు చేసిన ప్రకటనకు, ఇవ్వాళ ఆయన మాట్లాడిన  తీరులో చాలా వ్యత్యాసం కనిపించింది. భారత్‌తో సత్సంబంధాలను తాము కోరుకుంటున్నామని అంటూనే, కశ్మీర్‌ ‌పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని, అప్పటివరకు రెండు దేశాల మధ్య శాంతి అసాధ్యమని ఆనాడు ఎలుగెత్తి చాటిన షెహబాజ్‌, ఈ ‌నాడు తాము భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని ప్రకటించడం చూస్తుంటే భారత్‌తో  కయ్యం పెట్టుకున్నంత మాత్రాన జరిగేది నష్టమే తప్ప మరేమీకాదన్న అవగాహనకు ఆదేశం వొచ్చినట్లుగా కనిపిస్తున్నది.

భారత్‌దేశంతో జరిగిన ప్రతీ యుద్ధంలో పాకిస్తాన్‌ ఓటమినే చవిచూసింది. దేశం విడిపోయిన తర్వాత ఇప్పటివరకు మూడు సార్లు భారత్‌పై దండెత్తిన పాకిస్తాన్‌, ఈ ‌యుద్దాలవల్ల తాను ఎంతగా నష్టపోయిందన్న విషయాన్ని ఇప్పటికి తెలుసుకోగలిగింది. పాక్‌ ‌ప్రధానిగా  షెహబాజ్‌ ‌షరీఫ్‌ అదే అంశాన్ని ఊటంకిస్తూ,  ఈ మూడు యుద్ధాలు తమ దేశానికి గుణపాఠాన్ని నేర్పాయంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.  అలా ఉంటూనే ఆయన మరోసారి కశ్మీర్‌ ‌ప్రస్తావన లేవనెత్తడం చూస్తుంటే ఆ విషయంలో మాత్రం వెనక్కు తగ్గినట్లుగా లేదు. గతంలో  కశ్మీరీ ప్రజలకు తమ నైతిక మద్ధతు ఎప్పటికీ ఉంటుందని,ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రతీ అంతర్జాతీయ వేదికలపైన ఈ అంశాన్ని చర్చిస్తూనే ఉంటామని  పేర్కొన్న షెహబాజ్‌ ఇప్పుడు కశ్మీర్‌ ‌వంటి అంశాలపై భారత ప్రధానితో నిజాయితీతో కూడిన ద్వైపాక్షిక చర్చలు జరుగాలని కోరుకుంటున్నట్లు తెలిపడం, యుద్ధాలతో కన్నా చర్చలతోనే సామరస్యంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలన్న అవగాహనకు ఆ దేశం వొచ్చినట్లు అర్థమవుతోంది.

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ద్వారా సమయంతోపాటుగా, వనరులను అనవసరంగా వృధా చేసుకునే అవరసం ఉండదన్న తన అభిప్రాయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేయడం గమనార్హం. ఇవ్వాళ పాక్‌ ఆర్థిక సంక్షోభానికి గురికావడానికి యుద్ధాలుకూడా కారణమన్న  అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తీకరించాడు. భారత్‌తో జరిగిన మూడు యుద్ధాలు పాక్‌ ‌ప్రజలు తీరని నష్టాన్ని, కష్టాన్ని కలిగించాయి. గత కొంతకాలంగా పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. అప్పులు చేస్తేగాని రోజువారి పాలన జరిగేట్లుగా లేకుండాపోయింది. విదేశాలనుండి అప్పులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, తీసుకున్న అప్పులను తిరిగి ఎలా చెల్లించాలన్నది ఇప్పుడా దేశం ముందు ప్రధాన సమస్యగా మారింది. అణ్వాయుధాలను  సమకూర్చుకోగలమేమోగాని అన్న వస్త్రాలకోసం అర్రూలు చాచాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆ దేశం ఆలోచించలేకపోయింది.

ఆ దేశ పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే  దేశ ప్రజలు పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కోవాల్సి వొస్తున్నది. విద్యుత్‌ ‌సంక్షోభం  కారణంగా గోధుమపిండి కొరత ఏర్పడింది. ఆ దేశ ప్రధాన ఆహారమైన  గోధుమ పిండికోసం గంటల తరబడి దుకాణాల ముందు నిలబడాల్సిన పరిస్థితి. దానికోసం ఎగబడడంతో తీవ్ర తొక్కులాటలో పలవురికి  గాయాలయ్యాయి.  ఇక్కడ గోధుమ పిండి ధర రోజురోజుకు పెరిగి పోతున్నది. ఇక్కడ పెట్రోల్‌ ‌ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి.  మరో పక్క  అనారోగ్య సమస్యలు, మందుల కొరత..  దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్త కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికిచ్చింది.

ఇలాంటి పరిస్థితిలో  ప్రపంచ దేశాలముందు దేహీ అని చెయ్యిచాపడానికి సిగ్గుఅవుతుందని, భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం  కాదన్న ఆలోచనకొచ్చారు ఆ దేశం పాలకులిప్పుడు. అందుకే పొరుగున ఉన్న భారత్‌తో తగువులాడటంకన్నా శాంతియుతంగా మెదలడమే ఉచితమని పాక్‌ ‌పాలకులు ఆలోచనకు వొచ్చినట్లు కనిపిస్తున్నది.  ఇదిలా ఉంటే అక్కడి పత్రికల్లో కూడా మార్పు కనిపిస్తున్నది. ఇతర దేశాలను ప్రభావితం చేసే స్థాయిలో ప్రధాని మోదీ భారతదేశాన్ని నిలబెట్టారంటూ తన వ్యాసాల్లో ప్రశంసించిన  విధానం ఆ దేశ ఆలోచనాధోరణిలో వొస్తున్న మార్పుకు సంకేతంగా నిలుస్తున్నది. ఎలాంటి అవాంతరాలు వొచ్చినప్పటికీ తట్టుకుని నిలబడగల సామర్థ్యం గల పాలకుడిగా ఆ పత్రికలు మోదీని పొగిడాయి. ఈ ధోరణి ఆ దేశ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్నప్పటినుండే మొదలైంది..!

Leave a Reply