Take a fresh look at your lifestyle.

అం‌తరిస్తున్న తెలంగాణ చేనేత హస్తకళ!

అమలుకాని ప్రభుత్వ హామీలు .. దిక్కుతోచని నేతన్నలు: టీజేఎస్‌ అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌

కొరోనాతో ఛిద్రమైన చేనేత వ్యవస్థ స్థితిగతులను పరిశీలించడానికి, క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడానికి తెలంగాణ జన సమితి రాష్ట్ర
అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం వరంగల్‌ ‌నగరంలోని కొత్తవాడకు మంగళవారం విచ్చేశారు.జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ‌దాసు సురేశ్‌ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఈ క్షేత్ర స్థాయి పర్యటనలో వరుసగా వెల్లువెత్తుతున్న కరోనా, వరదలతో నెలకొని ఉన్న సంక్లిష్ట పరిస్థితులను నేతన్నలు కోదండరాంకు వివరించారు. రోజంతా కష్టపడి ధర్రీలు, జంపఖానాలు నేస్తున్నా తమకు కూలీ  ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. కష్టాలు తమను వెన్నాడి తరుముతున్నా తరతరాలుగా వస్తున్న చేనేత వృత్తి కాక వేరే వృతిని కొనసాగించలేక పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడి పని చేస్తే కేవలం రూ.200 కూడా సంపాదించలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలు ప్రభుత్వానికి తెలిసినా పట్టించుకున్న పాపాన పోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.

అనంతరం నేతన్నల సమక్షంలో స్థానిక డివిజన్‌ ‌నాయకులు గాదె రవీందర్‌ ‌నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం మాట్లాడుతూ చేనేత కళ తెలంగాణ సమాజానికి అస్తిత్వ ప్రతీక అని కొనియాడారు. ఈ వ్యవస్థలో అనేక అవకాశాలు కూడా అద్భుతంగా ఉన్నాయన్నారు.  అద్భుతమైన డిజైన్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే వెరైటీ  లతో వరంగల్‌ ‌చేనేత పరిశ్రమ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని కొనియాడారు. కానీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేడు నేతన్నలు తిండి లేని స్థితికి చేరుకోవడం చాలా విచారకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత వ్యవస్థలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కారం చేయకుండా చేనేత వ్యవస్థను రూపుమాపే విధానాలను కొనసాగిస్తున్నదన్నారు. ఈ వృత్తిలోని కళానైపుణ్యాన్ని పెంపొందించడానికి, అనేక వర్క్ ‌షాపులు ,డిజైన్‌ ‌స్టూడియోలు, ఎక్స్పోర్ట్ ‌షోరూంలను  ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ‌దాసు సురేష్‌
‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొనసాగిన వరుస చేనేత ఆత్మహత్యల నివారణకు చేనేత భీమాను కల్పించాలని సుదీర్ఘ కాలంగా తాము కొనసాగిస్తున్న డిమాండ్‌ ‌నేపథ్యంలో 2018 ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందు పరిచిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా చేనేత భీమా పథకాన్ని అమలు పరిచేలా సీఎం కెసిఆర్‌ ‌మదిలో ఆలోచన రేకెత్తాలని ఆశిస్తున్నామన్నారు.
ఏదైనా కొట్లాడి సాధించుకోవడం  తెలంగాణ ప్రజల నైజం అని పదేపదే చెప్పే సీఎం కేసీఆర్‌, ‌చేనేత బీమా విషయంలో ఎందుకు ప్రతికూల వైఖరిని అవలంభిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని దాసు సురేష్‌ ‌పేర్కొన్నారు.ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ.5 లక్షల ఉచిత బీమాను, సాలీనా రూ.36 వేల పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించాలన్నారు. హెల్త్ ‌కార్డులను, థ్రిఫ్టు పథకాన్ని , నూలు సబ్సిడీని పునరుద్దరించాలన్నారు .తెలంగాణ ప్రభుత్వం  వెంటనే రాష్ట్రంలోని 50 వేల మంది చేనేత కార్మికులకు ఏర్పాటు చేసి వీరితో పాటు తరచూ ప్రమాదాలకు లోనయ్యే చేతివృత్తి దారులకు సహితం రూ.5 లక్షల  ఉచిత జీవిత భీమాను   వర్తింపజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ నేతన్న ఐక్య కార్యాచరణ కమిటీ ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాల కన్వీనర్‌ ఆడెపు నగేష్‌ ‌నేత, ఆడెపు విజయ్‌, ‌మాసబత్తుల రవి శంకర్‌ ‌కుమార్‌, ‌మడత కిషోర్‌, ‌నాసని సాయిరాం, అంకం సత్యం, సురేష్‌ ‌నాయక్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply