Take a fresh look at your lifestyle.

ఉల్లిసాగుకు ప్రోత్సాహం మెళకువలపై రైతులకు శిక్షణ

import onions, from turkey, amid rising, raising onion rates  

  • రాష్ట్ర అవసరాలు,
  • ఎగుమతులు ధ్యేయంగా
  • రాష్ట్ర విత్తనాభివృద్ధిసంస్థ ప్రణాళిక

రాష్ట్రంలో ఉల్లిపంటను పెద్దఎత్తున పండించేందుకు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్ర అవసరాలకు మాత్రమే కాకుండా రైతులు ఎగుమతి చేసుకునేవిధంగా పంటలను పండించాలని, తద్వారా తెలంగాణ రైతులు సంపద సృష్టించే రైతులు కావాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయశాఖ సిద్ధమవుతున్నది. 2021-22 వ్యవసాయ సంవత్సరం నాటికి రాష్ట్రంలో సమృద్ధిగా ఉల్లి అందుబాటులోకి రావాలని నిర్ణయిం చారు.నానాటికి పెరుగుతున్న ఉల్లి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయశాఖ, విత్తనాభివృద్ధిసంస్థతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ ఈ కార్యాచరణలో నిమగ్నమవుతున్నాయి. అవకాశాలు ఉన్న జిల్లాలన్నింటిలో ఉల్లిసాగును నిర్ణయించి విత్తనాలను అందించాలని, దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం నుంచే ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ప్రధాన సంకల్పంతో కార్యాచరణను అమలు చేయనున్నారు. వచ్చే ఖరీఫ్‌ ‌నుంచే ఈ కార్యక్రమాలను తీసు కోనున్నారు. తొలివరుసలో వనపర్తి, నిజా మాబాద్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లో నేలలు ఉల్లి సాగుకు అనువుగా ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. మార్చి లేదా ఏప్రిల్‌ ‌నెలల్లో ఉల్లిపండించడంలో అనుభవం ఉన్న రైతులకు నాసిక్‌లో జాతీయ ఉద్యాన పరిశోధన అభివృద్ధిసంస్థ (ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్‌)‌లో మెళుకువలపై శిక్షణను ఇవ్వనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సారథ్యంలో త్వరలో ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్‌ , ‌తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థల మధ్యన అవ గాహన ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ కార్యాచరణలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కీలక భూమిక పోషించనున్నది. రైతులకు అవ సరమైనన్ని విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉల్లివిత్తనోత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడ్డాకకానీ ఉల్లి విత్తనోత్పత్తి పైన శ్రద్ద చూపకపోవడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే రైతులకు ఎంత అవసరం ఉంటే అంతమొత్తంలో విత్తనాలను అందించాలని ప్రణాళికలను రూపొందించారు. ప్రాథమికదశలో ఉల్లిసాగు విస్తీర్ణాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటారు. ప్రదానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి నిజామాబాద్‌లతో పాటు ఉల్లిపండించేందుకు సిద్ధంగా ఉన్న అన్నీ జిల్లాలో ఉల్లిసాగు విస్తీర్ణాన్ని పెంచడం, కావాల్సిన విత్తనాలను సబ్సిడీ పద్ధతిలో పంపిణీ చేయడం ముమ్మరంగా చేయాలని కార్యాచరణలో పేర్కొన్నారు. ఉల్లి విత్తనోత్పత్తికి కావాల్సిన ఎర్రగడ్డ, తెల్లగడ్డ పంటలకు కావాల్సిన మూలవిత్తనాలను ఎన్‌హెచ్‌ఆర్‌డిఎఫ్‌ ‌వారు సరఫరా చేయనున్నారు.ఈ మూల విత్తనాల నుంచి కావాల్సినన్ని విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ తయారు చేస్తుంది. ఈ పంటలలో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు వీలుగా కొంతమంది రైతులకు ఎంపిక చేసి నాసిక్‌లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు.చీడపీడల నివారణ, ఉల్లి నిలువచేసేందుకు వీలుగా గోదాముల ఎంపిక, ఎక్కువరోజులు నిలువచేసేందుకు కావాల్సిన సాంకేతిక నిర్వహణ తదితర అంశాలలో రైతులకు శిక్షణను ఇస్తారు. ప్రపంచంలో ఉల్లి ఉత్పత్తిలో మన దేశం రెండోస్థానంలో ఉన్నది. చైనా ప్రథమస్థానంలో ఉన్నది. బంగ్లాదేశ్‌, శ్రీ‌లంక, నేపాల్‌, ‌మలేషియా దేశాల్లో ఉల్లిగడ్డకు మంచి డిమాండ్‌ ఉన్నది. మహారాష్ట్ర కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాలలో ఉల్లి సాగు చేస్తున్నప్పటికీ, తెలంగాణ ఉల్లిగడ్డకు ఉన్న రుచి మిగతా రాష్ట్రాల ఉల్లికి లేదనే చర్చ ఉన్నది. ఉల్లిని సాగుచేస్తే ఎకరానికి రూ. 80వేల వరకు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ నివేదికలు తెలియచేస్తున్నాయి. అంతరాష్ట్ర మార్కెట్‌లో తెలంగాణ ఉల్లిగడ్డ ద్వారా లాభాలను ఆర్జించేందుకు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉంటాయని శాఖాపరంగా రూపొందించిన నివేదికలు పేర్కొంటున్నాయి.

Leave a Reply