పహల్గామ్ ఉగ్రవాదులు నలుగురిలో ముగ్గురి హతం
శ్రీనగర్, జూలై 28: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రెండు నెలల క్రితం పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని మతం పేరు అడుగుతూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్)‘ ఉగ్రవాదులు చంపేశారు. రెండు నెలలుగా ఈ ఉగ్రవాదుల కోసం భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ‘ఆపరేషన్ మహదేవ్‘ పేరుతో వేట మొదలుపెట్టి ఎట్టకేలకు వారిలో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతం చేశారు. వీరిలో 26మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబాకు చెందిన సులేమాన్ షా కూడా ఉన్నట్లు భద్రతా దళాలు నిర్ఱారించాయి. మరో ఇద్దరిని అబూ హమ్జా, యాసిర్‌లుగా గుర్తించారు. పహల్గాం దాడిలో యాసిర్ కూడా ఉన్నాడని భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజులుగా గాలింపు చేపట్టారు. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి.



