Take a fresh look at your lifestyle.

వలస కార్మికుల ఉపాధితో గ్రామాభ్యుదయం

మ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు, రైతులు, కార్మికులు, క‌ర్ష‌కులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు.  సంక్షోభాన్ని సైతం అవ‌కాశంగా మ‌ల‌చుకుని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు.  తిరిగి త‌మ త‌మ గ్రామాల‌కు చేరిన వ‌ల‌స కార్మికుల‌కు  ఉన్న‌వారికి ఉన్న‌చోటే, ఎక్క‌డిక‌క్క‌డే, అంటే త‌మ త‌మ గ్రామాల‌లోనే ఉపాధి క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.
*గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజనకు రూ.  50 వేల కోట్లు
          దేశంలో చాప కింద నీరులా విస్త‌రించిన కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి తీవ్ర సంక్షోభం సృష్టించింది.  జ‌న జీవ‌నం స్తంభించిపోయింది.  ర‌వాణా సౌక‌ర్యాలతోపాటు, అన్ని రంగాల‌లోను కార్య‌క‌లాపాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి.  ఎంద‌రో జీవ‌నోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.  బ్ర‌తుకుతెరువు కోసం త‌మ త‌మ గ్రామాల‌ను వ‌ద‌లి న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స‌ వెళ్ళిన కార్మికులు, శ్రామికులు జీవ‌నోపాధి కోల్పోవ‌డంతో స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్నారు.  ప‌రిస్థితుల తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించింది.  ప్ర‌జ‌లకు అండ‌గా నిలిచింది.  ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితులు స‌మీక్షిస్తూ, వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.  ఉద్య‌మ స్థాయిలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.  ఎక్క‌డున్న‌వారికి అక్క‌డే స‌హ‌కారం అందిస్తూనే, వ‌ల‌స కార్మికులు త‌మ త‌మ స్వ‌స్థ‌లాల‌కు చేరేందుకు ప్ర‌త్యేక శ్రామిక రైళ్ళ‌ను ఏర్పాటు చేసింది.
ఉన్నచోటే ఉపాధి:
      ఎప్పుడూ దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రిస్తూ, తాత్కాలిక ఉప‌శ‌మ‌న చ‌ర్య‌ల‌కు గాక, దీర్ఘకాలిక ప్ర‌యోజ‌నాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ, నిర్ణ‌యాలు తీసుకుంటున్న మ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు, రైతులు, కార్మికులు, క‌ర్ష‌కులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు.  సంక్షోభాన్ని సైతం అవ‌కాశంగా మ‌ల‌చుకుని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు.  తిరిగి త‌మ త‌మ గ్రామాల‌కు చేరిన వ‌ల‌స కార్మికుల‌కు  ఉన్న‌వారికి ఉన్న‌చోటే, ఎక్క‌డిక‌క్క‌డే, అంటే త‌మ త‌మ గ్రామాల‌లోనే ఉపాధి క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.  అయితే, వ‌ల‌స కార్మికులు అధికంగా ఉన్న బీహార్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కు మాత్రం ప్ర‌త్యేకంగా ‘‘గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌’’ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు.  ఈ ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 11 కేంద్ర మంత్రిత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ఈ ప‌థ‌కం అమ‌లు జ‌రుగుతుంది.  వ‌ల‌స కార్మికుల‌కు, జీవ‌నోపాధి లేని గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు ప్ర‌తి ఒక్క‌రికీ 125 రోజుల‌పాటు ఉపాధి క‌ల్పించే ఈ ప‌థ‌కం ద్వారా చేప‌ట్టేందుకు 25 అభివృద్ధి ప‌నుల‌ను గుర్తించ‌డంతోపాటు, ప‌థ‌కం అమ‌లుకు  50 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించారు.  గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తూ, గ్రామాభ్యుద‌యానికి తోడ్ప‌డే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ నెల 20వ తారీఖున బీహార్ రాష్ట్రంలోని తెలిహార్ గ్రామంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా లాంఛ‌నంగా ప్రారంభించారు.  దీనితోపాటు, గ్రామీణ ప్ర‌జా ప‌నుల ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని సైతం ఆయ‌న ప్రారంభించారు.
అవసరాలకు అనుగుణంగా సదుపాయలు:
      ‘‘గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌’’ కార్య‌క్ర‌మం కింద కార్మికులు, శ్రామికులంద‌రికీ నివ‌సిస్తున్న ప్ర‌దేశాల‌కు స‌మీపంలోనే ప‌నులు చూపించ‌డం జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు న‌గ‌రాల అభివృద్ధికి తోడ్పడిన వీరి నైపుణ్యాలు, ఇక గ్రామాల పురోభివృద్ధికి దోహ‌ద ప‌డ‌తాయ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.  మ‌న దేశంలో ఆరు ల‌క్ష‌ల‌కు పైగా గ్రామాలు వున్నాయి.  దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది, అంటే సుమారు 80 నుండి 85 కోట్ల మంది గ్రామాల‌లోనే నివ‌సిస్తున్నారు.  వీరి అవ‌స‌రాల‌కు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల‌లో మౌలిక స‌దుపాయాలు, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సంబంధించిన అన్ని ప‌నుల‌ను ఈ ప‌థ‌కానికి అనుసంధానం చేశారు. చేప‌ట్ట‌వ‌ల‌సిన 25 ప‌నుల గుర్తింపు పూర్తి కాగా, కార్మికులంద‌రి నైపుణ్యాల మ్యాపింగ్ ప‌ని ప్రారంభ‌మైంది.  గ్రామ స్థాయిలో వ‌ల‌స కార్మికులు, నిరుద్యోగుల నైపుణ్యాల‌ను గుర్తించి, త‌ద‌నుగుణంగా వారికి ఉపాధి ల‌భించేలా, ప్ర‌జ‌లు కూడా ప‌నుల నిమిత్తం వారిని సంప్ర‌దించ‌గ‌లిగేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.  అంగ‌న్‌వాడీ, పంచాయ‌తీ భ‌వ‌నాలు, మండీలు, ప‌శువుల కొట్టాల నిర్మాణం, గ్రామీణ ర‌హ‌దారులు, గృహ నిర్మాణం, సామాజిక మ‌రుగుదొడ్లు, బావుల త‌వ్వ‌కం, చెట్లు నాట‌డం, తాగునీరు, ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించ‌డం త‌దిత‌ర ప‌నుల ద్వారా గ్రామాల ముఖచిత్రం మారిపోతుంది.  వారు ఉన్న‌చోటే వారి అవసరాలకు అనుగుణంగా అన్ని ర‌కాల స‌దుపాయాలు తమకు తామే క‌ల్పించుకోగ‌లిగేలా ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసింది.  గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్‌, రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారులు, గ‌నులు, తాగునీరు, పారిశుధ్యం, ప‌ర్యావ‌ర‌ణం, రైల్వేలు, పెట్రోలియం, స‌హ‌జ‌వాయువు, నూత‌న పున‌రుత్పాద‌క ఇంధ‌నం, స‌రిహ‌ద్దు ర‌హ‌దారులు, టెలికాం, వ్య‌వ‌సాయం త‌దిత‌ర ప‌ద‌కొండు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల స‌మ‌న్వ‌యంతో క్షేత్ర‌స్థాయిలో ఈ ప‌థ‌కం అమ‌లు జ‌రుగుతుంది.
      పేద‌ల ఆత్మ గౌర‌వానికి భంగం క‌ల‌గ‌కుండా, వారి సాధికార‌త‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం అతి స్వ‌ల్ప‌కాలంలో ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసి, అమ‌లులోకి తెచ్చింది.  లాక్ డౌన్ ప్రారంభ స‌మ‌యంలోనే కోట్లాది మంది దేశ ప్ర‌జ‌ల త‌క్ష‌ణ అవ‌స‌రాలు గుర్తించి, ‘ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న‌’ కార్యక్రమాన్ని, అనంతరం  ఈ పథకంతో కూడిన  ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ప్యాకేజీని ప్ర‌క‌టించింది.  మూడు నెల‌ల కాలంలో 80 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఉచితంగా పప్పుల పంపిణీ జ‌రిగింది.  ఉచితంగా మూడు వంట‌గ్యాస్ సిలిండ‌ర్లు కూడా స‌ర‌ఫ‌రా చేశారు.  20 కోట్ల మంది మ‌హిళల జ‌న్ ధ‌న్ ఖాతాల్లోకి 10 వేల కోట్ల రూపాయలకు పైగా బ‌దిలీ చేశారు.  వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఖాతాల్లోకి 1000 రూపాయ‌ల వంతు ఆర్థిక స‌హాయం నేరుగా బ‌దిలీ చేయ‌డం జ‌రిగింది.  ఆధార్‌, మొబైల్ అనుసంధానం ద్వారా జ‌న్ ధ‌న్ ఖాతాలు తెర‌వ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మ‌యింద‌ని, లేక‌పోతే డ‌బ్బు ఖ‌ర్చ‌యిన‌ప్ప‌టికీ అది వారికి చేరేది కాద‌ని, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు.  అన్ని వేళ‌లా ప్ర‌జా సంక్షేమానికే ప్రాధాన్య‌త‌నిస్తూ, ముందుకు సాగుతున్న కేంద్ర ప్ర‌భుత్వం ‘ఒక దేశం ఒక రేష‌న్ కార్డు’ నినాదంతో దేశంలో ఎక్క‌డైనా రేష‌న్ పొందే సౌక‌ర్యం క‌ల్పించింది.  శీత‌ల గిడ్డంగుల నిర్మాణానికి ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ కింద ల‌క్ష‌ కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డంతోపాటు, రైతులు ఎప్పుడు, ఎక్క‌డ త‌న పంట‌ను విక్ర‌యించుకోవాలో స్వ‌యంగా తామే నిర్ణ‌యించుకునేందుకు అవకాశం క‌ల్పించింది.  దీనికి ఆటంకంగా నిలిచిన చ‌ట్టాల‌ను సైతం ర‌ద్దు చేసి కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా నిలిచింది.  21వ రాజ్యాంగ అధిక‌ర‌ణం ప్ర‌కారం జీవించే హ‌క్కు పౌరుల ప్రాథ‌మిక హ‌క్కు.  ఇది స‌క్ర‌మంగా అమ‌లు జ‌ర‌గాలంటే పౌరుల‌కు  జీవ‌నోపాధి క‌ల్పించాలి.  జీవ‌నోపాధి క‌ల్పించ‌డం ద్వారా పౌరుల జీవించే హ‌క్కును ప‌రిర‌క్షిస్తూ, త‌ద్వారా గ్రామా‌ల ముఖ‌చిత్రం మార్చేందుకు కృషి చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ కృషి అభినంద‌నీయం.
 
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ,హైదరాబాద్

Leave a Reply