Take a fresh look at your lifestyle.

నిరుపేద కుటుంబాలకు అండగా ఉపాధి హామీ పథకం

గరిష్ట సంఖ్యలో ఉపాధి పొందిన లబ్దిదారులు
ఇప్పటి వరకు 52.3 లక్షల జాబ్‌ ‌కార్డులు జారీ

దేశంలోని ప్రతీ నిరుపేద గ్రామీణ కుటుంబానికి ఉపాధిని కల్పించడం లక్ష్యంగా 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఏడాదిలో వంద రోజుల పనికి చట్ట బద్దమైన హామీ, పని కోరిన పదిహేను
రోజుల లోపు దరఖాస్తుదారునికి రోజువారీ నిరుద్యోగ భృతి చెల్లింపు, కేటాయించిన పని పూర్తయిన తేదీ నుంచి 15 రోజుల లోపు వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికునికి నష్టపరిహారం పొందే హక్కు వంటి కచ్చితమైన నిబంధనలతో ఈ ఉపాధి హామీ పథకం రూపొందింది. దేశంలో ప్రజా సేవల మెరుగుదలకు అమలవుతున్న వివిధ పథకాలపై ఆసక్తి కలిగిన ఇంజనీర్లు, సామాజిక శాస్త్రవేత్తలు డి.అశోక్‌, ‌బి.చక్రధర్‌, ఎం.‌రణధీర్‌, ‌కె.వెంకట కృష్ణ  లిబ్‌టెక్‌ ఇం‌డియా పేరుతో ఒక బృందంగా ఏర్పడి గత 8 ఏళ్లుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఉపాధి హామీ పథకంపై సమగ్ర అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో వారు వెల్లడించిన అంశాల మేరకు రాష్ట్రంలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్‌ 2020 ‌నాటికి 52.3 లక్షల మందికి ఉపాధి కల్పించారు. దీని నుంచి 1.14 కోట్ల మంది కార్మికులు లబ్ది పొందారు.

ఈ ఒక్క ఏడాదిలోనే 2.7 లక్షల కొత్త జాబ్‌ ‌కార్డులు జారీ అయ్యాయి. అంటే 2006లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జారీ చేయబడ్డ మొత్తం జాబ్‌ ‌కార్డులలో 5.2 శాతం ఎక్కువ. జాబ్‌ ‌కార్డుల జారీలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, అతి తక్కువ కార్డుల జారీతో మంచిర్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న ప్రతీ కార్మికునికి కేంద్ర ప్రభుత్వం నుంచే నగదు బదిలీ ద్వారా వేతన చెల్లింపులు జరుగుతాయి. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే సంబంధిత నగదు బదిలీ అయ్యే వెసులుబాటు ఉండటంతో గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ఉపాధి హామీ పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 540 మండలాలు ఈ ఉపాధి హామీ పథకంలో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలు ఉండగా,  వీటిలో 456 మండలాలు గత ఏడాది ఇదే అధ్యయన కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ ఉపాధిని కల్పించినట్లు లిబ్‌ ఇం‌డియా నివేదిక పేర్కొంది. మహబూబాబాద్‌, ‌జనగాం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో మాత్రమే గత ఏడాది కంటే తక్కువ ఉపాధి శాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు అత్యధిక శాతం ఉపాధిని కల్పించిన మండలాల్లో మాచారెడ్డి, లింగంపేట, గాంధారి, యాచారం, బిచ్కుంద, జుక్కల్‌, ‌మంచాల్‌, ‌మాడ్గుల్‌, ‌ధరూర్‌, ‌నందిపేట ఉన్నాయి. అతి తక్కువ ఉపాధి కల్పించిన మండలాల్లో నందిగామ, పాల్మెల, మెయినాబాద్‌, ‌పటాన్‌చెరువు, షామీర్‌పేట, జగిత్యాల, కొత్తూరు, కీసర, మేడ్చల్‌, ‌భద్రాచలం ఉన్నాయి. రాష్ట్రంలో 1.6 లక్షల కుటుంబాలు అంటే 5.3 కుటుంబాలు 100 రోజుల పనిని పూర్తి చేసుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి సగటున 43 రోజుల పని లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పెరుగుదలతో పాటు 1.6 లక్షల కుటుంబాలు ఇప్పటికే తమ కోటా కింద 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌ 20, 2020 ‌నాటికి రూ.66,348.89 కోట్ల నిధులను ఖర్చు చేసింది. ఈ నిధులలో భాగంగా ఇప్పటికే తెలంగాణ 4.4 శాతం నిధులను పొందింది. కాగా, దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే కొరోనా మహమ్మారి ఉపాధి హామీ పథకంపై సైతం ప్రభావం చూపింది. కొరోనా కారణంగా రాష్ట్రంలో పూర్తి కాని చెల్లింపులు దేశం మొత్తం లావాదేవీల్లో 0.77 శాతంగా ఉండగా, రాష్ట్రం మొత్తం మీద వివిధ సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన చెల్లింపులు కింద ఉన్న సొమ్ము రూ.5.99 కోట్లు, దీనిలో 18 శాతం ఒక్క నల్గొండ జిల్లాలోని ఉపాధి కార్మికులకే చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో పూర్తికాని చెల్లింపుల్లో 2.25 కోట్లు తిరస్కరించబడ్డాయి. కాగా, రూ. 3.74 కోట్ల చెల్లింపులు నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ కొరోనా కాలంలో ఈ పథకం గ్రామీణ ప్రజల చేతుల్లో ఉంచే డబ్బు విలువను కూడా పెంచింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply