Take a fresh look at your lifestyle.

శాస్త్రీయత కొరవడిన పిఆర్సిని తిరస్కరిస్తున్న ఉద్యోగులు

ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం. ప్రభుత్వ పథకాలను ,విధానాలను ప్రజలకు దగ్గరకు చేర్చే వారధులు.  ప్రభుత్వ పథకాలుసక్రమంగా అమలు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కీలకం.  ప్రభుత్వాల ఆదేశానుసారం ప్రజల అభివృద్ధికి పాటు పడుతున్నవ్యక్తులు ఉద్యోగులు. అంకితభావంతో వృత్తి నిబద్ధత తో ఉద్యోగులు పని చేయడం వల్లనే ప్రభుత్వాలు విజయవంతం అవుతాయి. నాలుగో తరగతి ఉద్యోగుల నుండి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల వరకు నిర్విరామంగా కృషి చేసినప్పుడే ఏప్రభుత్వ పథకం అయినా విజయవంతం అవుతుంది. తద్వారానే ప్రభుత్వాలు మంచి పేరును   సాధిస్తాయి. అప్పుడే వాటి మనుగడ   సుసాధ్యమవుతుంది. ఇంతటి కీలకమైన ఉద్యోగులు కూడా సమాజంలోని భాగమే. ఉద్యోగుల అభివృద్ధి కూడా సమాజాభివృద్ధికి గానే పరిగణించాలి. ఉద్యోగులకు   సంతృప్తికరంగా సక్రమంగా వేతన భత్యాలు అందించినప్పుడు, వారు ఎటువంటి ఆర్థిక మానసిక ఇబ్బందులు లేకుండా రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలుగుతారు. తద్వారా ప్రభుత్వ పనులు వేగవంతంగా జరిగి ప్రజల సమస్యలు త్వరితంగా  పరిష్కరించబడి, అభివృద్ధి పనులు వేగవంతం మై అభివృద్ధికి రాజ మార్గం ఏర్పడుతుంది.

అటువంటి ఉద్యోగులకు   నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ పరిస్థితులకుఅనుగుణంగా వేతన సవరణ చేయడం జరుగుతుంది.  ఈ వేతన సవరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వాతంత్ర్య భారతావనిలో 1947 నుండి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఇప్పటి వరకు 7 సార్లు వేతన సవరణ జరిగింది .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదిసార్లు వేతన సవరణ జరిగింది.  పదవ పిఆర్సి అమలు కాలపరిమితి 2018 జూన్ 30తో ముగిసిపోవడంతో ,తదుపరి పదకొండవ పిఆర్సి జులై 1 2018 నుండి అమల్లోకి రావాల్సి  ఉంది. ఈ పిఆర్సి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిది కావడంతో ,తొలి    పిఆర్సి కి కొంత ప్రాముఖ్యతను  సంతరించుకుంది. ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో లాభం జరుగుతుందని ఆశించిన సమయంలో సి ఆర్ బిస్వాల్ చైర్మన్గా ఉమామహేశ్వరరావు , మహమ్మద్ అలీ రఫాత్ సభ్యులు గా 2018 మే 18న  పేరివిజన్  కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేతన సవరణ తోపాటు సర్వీస్ రూల్స్ సరళీకరణ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని పిఆర్సి కమిషన్ అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. వేతన సవరణ నివేదికలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సూచి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపును  ఖరారు చేయడమే ఫిట్మెంట్. వేతన సవరణ నివేదికలో ప్రధానాంశం అయిన ఫిట్మెంట్ శాతం పై ఉద్యోగులు ఆసక్తిగా, ఆశగా ఎదురు చూడటం సహజం. పే రివిజన్ కమిటీ ఫిట్మెంట్ శాతాన్ని ఎంతోకొంత  సిఫార్సు చేసిన, ఉద్యోగ  సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమకు అనుకూలంగా ప్రకటించుకుంటారు .గత మూడు వేతన సవరణ  కమీషన్ల సిఫార్సుల తో పోల్చితే ప్రభుత్వం అమలు చేసిన ఫిట్మెంట్ శాతాలు…..

 పిఆర్సి      కమిషన్     ఫిట్మెంట్     ఫిట్మెంట్
                                  శాతం            శాతం
                                 సిఫార్సు        అమలు
8వ       జె. రాంబాబు      10                 16

- Advertisement -

(2005)   
9వ       సి.ఎస్.రావు         27                   39
(2010)  
10వ       ప్రదీప్ కుమార్   29               43
(2015)       అగర్వాల్
ఇదిలా ఉండగా తెలంగాణ తొలి పిఆర్సి కమిషన్ గత సాంప్రదాయానికి భిన్నంగా ఏకసభ్య కమిషన్, త్రిసభ్య కమిషన్ గా మార్చడంతో….  ముగ్గురు సభ్యులు ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను వివిధ డిపార్ట్మెంట్ల వారీగా పరిశీలించి, వారి ఉన్నతికి అభివృద్ధికి బాసటగా ఉండే విధంగా ఫిట్మెంట్ శాతాన్ని సిఫార్సు చేస్తారని ఆశించగా… కమిషన్ 7.5% ఫిట్మెంట్ ను సిఫార్సు చేయడంతో  ఉద్యోగ వర్గాల్లో తీవ్రమైన నిరాశ ,నిస్పృహలు, ఆశాంతి బయలుదేరింది. పాలకులు ధనిక రాష్ట్రంగా, బంగారు తెలంగాణ గా  పదే పదే చెబుతూ…… ఉద్యోగులకు న్యాయబద్ధంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా శాస్త్రీయంగా అంచనావేసి ఫిట్మెంట్ శాతాన్ని  నిర్ణయించాల్సింది పోయి గత పిఆర్సి నివేదికలు సిఫారసు చేసిన దానికంటే అతి తక్కువగా  ఫిట్మెంట్ శాతాన్ని  నిర్ణయించినట్లు ప్రకటించడం అత్యంత బాధాకరం. భౌతిక వసతులు, ఆదాయ వనరులు లేని, లోటు బడ్జెట్ గల పక్క రాష్ట్రం ఉద్యోగుల కు ఆగస్టు 2019 నుండి  27శాతం మధ్యంతర భృతి ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అ అమలు చేస్తుండటం  విధితమే… పీఆర్సీ కాల పరిమితి ముగియగానే తదుపరి పిఆర్సి వెంటనే అమలు చేయలేనప్పుడు ఉద్యోగులకు ఆర్థిక నష్టం జరగకుండా మధ్యంతర భృతిని ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది.

కానీ తెలంగాణలో ఇటువంటి మధ్యంతర భృతి ఇవ్వకుండా పీఆర్సీ కాలపరిమితి ముగిసి రెండు సంవత్సరాల ఎనిమిది నెలల తొమ్మిది రోజులు కావస్తున్నప్పటికీ అత్యంత నిరాశాజనకంగా, అన్యాయంగా గత చరిత్రలో ఎప్పుడూ లేని పేలవంగా 7.5 శాతం  ఫిట్మెంట్ ప్రకటించడం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పక్క రాష్ట్ర ఉద్యోగులు ఈ సంవత్సరం నుండి 27 శాతం అదనంగా వేతనాన్ని పొందుతూ సంభ్రమాశ్చర్యాలతో ఉద్యోగ విధులు నెరవేరుస్తూ ఉంటే,  తెలంగాణలో మధ్యంతర భృతి లేకుండా,  వేతన  పెరుగుదల లేకుండా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ  మానసిక ఒత్తిడితో పని చేయడం జరుగుతుంది.  గత సంవత్సరం నుండి   కొరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. అనేకమంది ఉపాధ్యాయ ఉద్యోగులు  కరోనాతో ఆరోగ్య సమస్యలకు గురి అయిన సందర్భంలో ఒకవైపు, మరోవైపు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న  కుటుంబ సభ్యులు గల ఉద్యోగులు ఆర్థిక సమస్యలతోసతమతమవుతూ ఉంటె,  దేశంలో,  ఏ రాష్ట్రంలో లేనివిధంగా వేతనాలను 50శాతం తగ్గించడంతో ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులకు నెట్టి వేయబడ్డారు .కొంత మంది  ఉపాధ్యాయ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యలకు పాల్ప డ ట0 జరిగిన హృదయవిదారక సంఘటనలు ఎన్నో చవి చూశాము.  పిఆర్సి కమిషన్ వేసిన నాటి నుండి, అల్పసంతోష్ లైనఅయిన ఉద్యోగులు లెక్కల మీద  లెక్కలు వేసుకుంటూ, ఆ అంకెలతో మురిసిపోతూ… పీఆర్సీ నివేదికను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ …  ఊరిస్తూ..  ఇదిగో అదిగో అంటూ మభ్య పెడుతూ ఉంటే, ముప్పై రెండు నెలలుగా చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ    ఉన్న ఉద్యోగ వర్గాలకు  ఫిట్మెంట్ అతి తక్కువగా ఉండటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఈ కమిటీ నివేదిక అశాస్త్రీయమైన వేతన సవరణ కమిటీ నివేదిక గా వర్ణించటం జరుగుతుంది.

ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి నివేదిక పూర్తిగా అశాస్త్రీయంగా ఉండదని ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచవలసి ఉండగా ఈ నివేదిక వేతనాల పెరుగుదల కాకుండా తగ్గింపు కొరకే ఉన్నట్లుగా ఉంది.  ఉద్యోగుల    వేతనాలను   తగ్గించేది గానే ఉన్నది… ఈ పి ఆర్ సి 2018జులై నుండి ఇవ్వవలసి ఉండగా 2021   జనవరి  లో ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను అనుసరించి కుటుంబంలో ఉన్న నలుగురు సభ్యులు అవసరాల జీవనానికి అనుగుణంగా వేతన స్కేలు నిర్ణయించాల్సి  ఉండగా,  ఈ  పిఆర్సి అధ్యయన చేయకుండా రాయించినది గా ఉంది. గతంలో నివాస ప్రాంతాలు ,అక్కడ కాస్ట్ ఆఫ్  లివింగ్ ని బట్టి ఇంటి అద్దె 30 శాతం, 24%, 14.5 %,12%  లుగా  ఉండగా , వీటిని సవరించి పెంచాల్సింది పోయి, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా  తీరోగమన రీతిలో 24 శాతం, 17 శాతం, 13 శాతం, 11 శాతలకు కుదించడం ఆశ్చర్యకరం. జీవిత కాలం సేవలందించిన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ ని 18 లక్షలు డిమాండ్ చేయగా 16 లక్షలు మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది. జీవిత కాలం పనిచేసి రిటైరైన తర్వాత సామాజిక భద్రత తో గౌరవప్రదంగా జీవనం కొనసాగించేందుకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని డిమాండ్ చేయగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరహలో 10 శాతం స్థానంలో యజమాని వాటాను 14 శాతం కు పెంచాలని సిఫార్సు చేయడం జరిగింది. కనీస వేతనాన్ని కూడా అతి తక్కువగా నిర్ణయించడం, ప్రతి సంవత్సరం ఇచ్చే వార్షిక పెరుగుదల ఇంక్రిమెంటు ను మూడేళ్ళ కొకసారి ఇచ్చేదిగా సిఫార్సు చేయడం, డి ఎ విషయంలో ఒక శాతం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 1.048 శాతం డీజే గా ప్రకటించేది. ఇప్పుడు అలా కాకుండా 0.910 శాతంగా కుదించడం, గతంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు ఎలాంటి రుసుము లేకుండా ఉండేది .కానీ ఈ కమిటీ 1% మూల వేతనం నుండి మినహించాలని సిఫార్సు చేసింది.

కనీస వేతనంగా 19000 మాత్రమే నిర్ణయించడం అశాస్త్రీయం. ఈ పి ఆర్ సి నివేదికలో చిన్నచిన్న అలవెన్సులు పెంపు మాత్రమే తప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ లేకపోవడం  విచారకరం. ప్రయోజనం లేకపోగా వాస్తవ వేతనం తగ్గి పోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు మూల వేతనం 38170 గా ఉన్న ఉద్యోగులు తీసుకునే వేతనం 58,000 అయితే 7.5 శాతం ఫిట్మెంట్ తో మూల వేతనం 52,000 అవుతుంది. దీనికి ఇంటి అద్దె 11 శాతం, డీ ఎ 5శాతం కలిపి తగ్గింపులో క్రింద నాలుగు శాతం సిపిఎస్ కి  ఒక శాతం  పెరిగే వృత్తిపన్ను మరియు  పెరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ ల తో కలిపి లెక్కిస్తే 56,000 కూడా రావని ఉద్యోగులు లెక్కలు వేసి చూపుతున్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో రోజుల సకల జనుల సమ్మె మొదలు పలు ఉద్యమాలతో తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో మొట్టమొదటి పీఆర్సీ పేలవంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అతి తక్కువ ఫిట్మెంట్ ఇవ్వ చూపడం అధర్మమని ,ఫ్రెండ్ ప్రభుత్వంగా చెప్పుకున్న పాలక పెద్దలు వాళ్ళ వేతనాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెంచుకొని జీవితాంతం  రాష్ట్ర అభివృద్ధికిి పనిచేసే ఉద్యోగుల శ్రమను  గుర్తించకుండా వేతనాల పెంపు లో మొండిచేయి ఇవ్వ చూపడం ఇబ్బందికరం.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం…. ఫ్రెండ్లీ ప్రభుత్వంగా  శాస్త్రీయంగా వేతన సవరణ చేయాలి. తక్షణమే ఫిట్మెంట్ ను 50 శాతం పెంచాలి, కనీస వేతనం 26,500, మరియు గరిష్ఠ వేతనం 2,04,020  రూపాయలుగా పెంచాలి.  వార్షిక పెరుగుదలను గతంలో లాగే ప్రతి సంవత్సరము ఇవ్వాలి. ఇంటి అద్దె ను నివాస ప్రాంతాలకు అనుగుణంగా గతంలో కంటే పెంచాలని ,ఆర్ధిక లాభమును జూలై 2018 నుండి   వర్తింప చేయాలని ఉద్యోగులు కోరుతున్నట్లు సవరించాల్సిన అవసరం ఉంది. లేనిచో ఇప్పటికే ఉద్యోగులు  ఆగ్రహోదగ్రులై ” మాకొద్దు ఈ పిఆర్సి” అని నిరసన చర్యలు చేపట్టారు. ఇంకా ఈ ఉద్యమం ఉదృతం కాకముందే  పరిష్కరించినట్లు అయితే రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగుల గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారని  అప్పుడే పాలకులు కలలుగన్న బంగారు తెలంగాణ గా మారే అవకాశం ఉంటుంది. లేనిచో ఉద్యోగుల ఆగ్రహానికి గురైన,   గత ప్రభుత్వాల వలె గత పాలకుల వలె కాలగమనంలో కలిసిపోవడం ఖాయం.

Leave a Reply