Take a fresh look at your lifestyle.

మనకెందుకీ భావ దారిద్య్రం

“పాఠశాల స్థాయి లో ప్రథమ భాషగా ఇంటర్మీడియట్‌ ‌డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా కొనసాగిస్తున్న తెలుగు ప్రయివేటు జూనియర్‌ ‌కళాశాల ల్లో ఇప్పటికే కనుమరుగైంది.తర్వాత జరిగే ఏ పోటి పరీక్ష లకు పనికిరాని సంస్కృతాన్ని పట్టుబట్టి కేవలం మార్కుల కొరకే విద్యార్థులపై ప్రయోగించడం సరియైనది కాదు.సంస్కృతం నేర్పాలనే ఆలోచన ఉన్నట్లయితే దానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. సంస్కృతం పండిత భాష .కఠోర సాధన ద్వారా మాత్రమే దాన్ని నేర్చుకోగల్గుతాము.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్న ఆధునిక మానవుని కి నేడు అంత కఠినమైన భాషను నేర్చుకోవాల్సిన అవసరంలేదు.మనిషి నిత్య జీవిత వ్యవహారాల్లో దాని అవసరం అంతకన్నా లేదు. అనేక పోటి పరీక్షల్లో ఉపయోగపడే మాతృభాష తెలుగును తొలగించడం అనాలోచితమైన చర్యవుతుంది.”

ముందుగ మురిసినమ్మ పండుగ మొకమెరుగదు ‘‘అనే సామెత తెలంగాణ సమాజం లో చాలా ప్రసిద్ధమైనది.ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ ‌తెలుగు భాష పట్ల తన మమకారాన్ని ప్రదర్శిస్తూ తెలుగు కవులు రచయితలు గాయకుల కృషిని కొనియాడారు. ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించిన గోరటి వెంకన్న గల్లీ సిన్నది గరీబొళ్ళ కథ పెద్దది అనే పాటను గుర్తు కు తెచ్చాడు.పదోన్నతులకు నోచుకోని భాషా పండితుల సమస్యలు ప్రస్తావించారు.ఇన్ని మాటలు విన్న భాషాభిమానులు భాషోపాధ్యాయులు రాబోయే కాలంలోతెలుగు భాష కు మహార్దశ పట్టబోతున్నట్లు, ఆనందం వ్యక్తం చేశారు.తెలుగును చదువుకొని తెలుగు భాష పట్ల అత్యంత అభిమానం ప్రకటించే ముఖ్యమంత్రి మాటల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించారు. మహాభారతం లోని విరాట్‌ ‌పర్వంలోనున్న ఉత్తర గోగ్రహాణ సందర్భంలో తిక్కన రాసిన దుష్కరమైన దుష్కరప్రాస గల పద్యాన్ని సందర్భోచితంగా పాడి వినిపించిన ముఖ్యమంత్రి పట్ల తెలుగుభాషను ఉద్దరిస్తాడనే ఆకాంక్షలు ఉండటం సహాజమే.కాని నాటి మాటలన్నీ నీటీమూటలేననీ మున్నాళ్ళ ముచ్చట్లేననీ ఇన్నాళ్ళు కు తేలిపోయింది.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ‘‘నేడు అటు ఆంగ్లము ఇటు ఆర్య భాష సంస్కృతం చేస్తున్న దండయాత్ర లో తెలుగు భాష తన అస్థిత్వం కొరకు ప్రాకులాడే పరిస్థితి ఏర్పడింది.నన్నయ్య కాలమునుండి కావ్యభాషగా కాలుమోపి నారాయణ రెడ్డి విశ్వంభరతో దిగంతాలకు తాకి జ్ఞానపీఠ మై వెలుగొందిన ఖ్యాతి మన తెలుగు భాషది.

విదేశీయుల నోళ్ళలో ఇటాలియన్‌ ఆఫ్‌ ‌ది ఈస్ట్ ‌గా ప్రశంసలు పొందిన మన భాష ఇంటి మనుషులకు కంటగింపు కావడం అత్యంత హేయమైన చర్య.శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సభలో దిగ్గజాల్లాంటి లాంటి ఎనిమిది మంది కవుల కలము నుండి జాలువారిన ప్రబంధ కావ్యాల శోభతో తెలుగు నేలంతా విరబూసిన సాహితి పరిమళాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందలేదా! శ్రీనాథుడు అనువదించిన శృంగార నైషధాన్ని అహాంకారం తో హేళన చేసిన సంస్కృత కవుల పీచమణచడానికి ప్రబంధకవి రామ రాజభూషణుడు రాసిన వసుచరిత్ర స్వతంత్ర కావ్యం తో సగర్వంగా తలెత్తుకున్న ఖ్యాతి తెలుగు భాషది.పాల్కురికి సోమనాథుని దేశీచంధస్సులో ద్విపద కావ్యంగా దేదిప్యమానంగా వెలిగిన ఘనత తెలుగు భాషకు కలదు.తెలంగాణ గడ్డ పై పురుడు బోసుకున్న పొన్నికంటి తెలగన అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర తెలుగు భాషకు వన్నెలద్దినదే కదా.

మరెందుకు ఈ భావ దారిద్య్రం.మృతభాషను ముందుకు తెచ్చి మాతృభాష ను మట్టి లో కలపాలన్న కుట్రలకు తెరలేచిందెక్కడ. అదే జరిగితే ప్రాచీన కవులకు దీటుగా అద్భుతమైన పదవిన్యాసంతో పద్యాలల్లి నా తెలంగాణ కోటి రతనాల వీణ యన్న దాశరథి అగ్నిధార రుద్రవీణ లు అన్య భాషల దాడికి ఆహుతి కావాల్సిందేనా, బమ్మెర పోతన రాసిన రసగుళికల్లాంటి భాగవత పద్యాలను పాడుకునే భాగ్యానికి భావితరాలు దూరమవ్వా ల్సిందేనా? కందుకూరి, గురజాడ.శ్రీశ్రీ జాషువా,కాళోజీ ల కవన వారసత్వం ఇంతటితో అంతం కావాల్సిందేనా? మలిదశ తెలంగాణ పోరాటంలో గజ్జ కట్టి గంతులేసి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన తెలంగాణ తెలుగు పాటకుగ్రహణం పట్టవ లసిందేనా? మన ఆట పాటల్లో మాటలో నడకలో నడతలో నిత్యం మనల తోడు నీడగా ఉండే అమ్మ భాష పట్ల ఇంత అలసత్వం మనలో అలముకున్న బానిసత్వానికి సూచిక కాదా? .మార్కుల వ్యామోహాంలో మాతృభాష తెలుగు ను మృత భాష గా మార్చితే చరిత్ర క్షమిస్తుందా! తరాల నుండి తరగని వారసత్వ వాజ్మయ సంపదగా మన మనో ఫలకాలపై ముద్రించబడిన తెలుగు భాషా నిధిని భావితరాలకు అందించే బాధ్యత నుండి తప్పుకుందామా! ఇంగ్లీషు వాడు మన వనరులను కొల్లగొట్టడానికి గుమస్తా లుగా పనిచేయించుకోవడానికి మనకు ఇంగ్లీషు నేర్పిండు.

ఆర్యభాష సంస్కృతం అన్ని భాషలకు నేనే మూలమంటూ అమాంతం మింగజూస్తున్నది.నిజాం నవాబుల కాలంలో రాజ భాష గా నున్న ఉర్దూ బలవంతంగా ప్రజలపై రుద్దారు.ఫలితంగా ఉర్దూ తెలుగు పదాలు విడదీయ లేనంతగా కలి• •పో యాయి.అలాంటి మన భాషను తౌరక్యాంధ్రమని కూడా నిందించారు. ఏ భాషా పదాల నైనా తెలుగు తనలో. సహాజంగా కలుపుకుంటుంది. అందుకే ఏ భాష చెణకైనా ఏ వాన చినుకైనా తనలోన కలుపుకుని తరలింది తెలుగు అంటాడు సి.నా.రె. అజంతభాషైన(అచ్చులతో అంతమయ్యే భాష) తెలుగు ను అన్యభాషలు మాట్లాడే వారుకూడా సులువు గా నేర్చుకుంటారు. అలాంటి భాషను కాపాడుకొని అధ్యయనం, పరిశోధన ల ద్వారా మరింతగా వెలుగులోనికి తీసుక రావాల్సింది పోయి దాని క్షిణతకు దోహాదకారి కావడం సరియైనది కాదు.ఇప్పటికే పాఠశాల,ఉన్నత విద్యా స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ప్రభావం తో తెలుగు మాధ్యమం క్రమం గా కనుమరుగవుతున్నది. పాఠశాల స్థాయి లో ప్రథమ భాషగా ఇంటర్మీడియట్‌ ‌డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా కొనసాగిస్తున్న తెలుగు ప్రయివేటు జూనియర్‌ ‌కళాశాల ల్లో ఇప్పటికే కనుమరుగైంది.తర్వాత జరిగే ఏ పోటి పరీక్ష లకు పనికిరాని సంస్కృతాన్ని పట్టుబట్టి కేవలం మార్కుల కొరకే విద్యార్థులపై ప్రయోగించడం సరియైనది కాదు.

సంస్కృతం నేర్పాలనే ఆలోచన ఉన్నట్లయితే దానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. సంస్కృతం పండిత భాష .కఠోర సాధన ద్వారా మాత్రమే దాన్ని నేర్చుకోగల్గుతాము.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్న ఆధునిక మానవుని కి నేడు అంత కఠినమైన భాషను నేర్చుకోవాల్సిన అవసరంలేదు.మనిషి నిత్య జీవిత వ్యవహారాల్లో దాని అవసరం అంతకన్నా లేదు. అనేక పోటి పరీక్షల్లో ఉపయోగపడే మాతృభాష తెలుగును తొలగించడం అనాలోచితమైన చర్యవుతుంది.అందుకే ప్రతి ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల లోపూర్వం లాగానే తెలుగు నే ద్వితీయ భాషగా కొనసాగించాలి.ఇంకా వీలైతే డిగ్రీ స్థాయి వరకు తెలుగు ను ఒక భాషగా తప్పనిసరి చేయాలి.తెలుగు లేకుండా చేయాలనే కుట్రలను మొగ్గ దశలోనే తుంచడానికి తెలుగు భాషాభిమానులందరు కంకణబద్దులైయుండాలి.ఒత్తిడీలకు తలొగ్గ కుండా విద్యార్థుల భవిష్యత్తు కు పెద్దగా ఉపయోగం లేని సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. సంస్కృతం నేర్చుకుని పాండిత్యం సంపాదించు కోవాలనుకునే వారికి తెలుగు ను తప్పని సరిచేస్తూ సంస్కృతాన్ని ఐచ్చికంగా ఎన్నుకునే అవకాశాలను పరిశీలించాలి. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ సంస్కృతాలను దక్షిణ భారత ప్రజలపై కేంద్రం బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వాటికి ఊతం ఇవ్వకుండా ప్రజల ఆకాంక్షలు గౌరవించాలి
– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply