Take a fresh look at your lifestyle.

ఎమర్జెన్సీ-5

“రాజ్యాంగబద్ధంగా పాలన సాగి ఉన్నట్టయితే ఈ దేశంలో విప్లవం గురించి ఇంత ఆలోచన ఉండేదే కాదు. జీవితం ఎంతో కొంత సంతృప్తికరంగానే ఉండేది. ప్రజలను భ్రమల్లోనే ఉంచుతూ ఉంటే, ఆ భ్రమలు ఎప్పటికీ వాస్తవరూపం ధరించకపోతే, అసంతృప్తి పెల్లుబుకుతుంది. అది వేర్వేరు ఉద్యమాలకు, ఆందోళనలకూ దారి తీస్తుంది. అందుకే ఎంతో బాధ్యతాయుతుడైన రాజకీయవేత్త జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌కూడ ‘తప్పుడు ఆజ్ఞలను ఉల్లంఘించండి, విధేయంగా ఉండనవసరం లేదు’ అని మన సైనిక బలగాలకు పిలుపునిచ్చాడు.”

అట్లా ఒకసారి జస్టిస్‌ ‌చిన్నపరెడ్డి, జస్టిస్‌ ‌జీవన్‌ ‌రెడ్డిల బెంచి ముందు ఒక కేసు వచ్చింది. అది జూపూడి యజ్ఞనారాయణ కేసు. ఆయన గుంటూరులో సీనియర్‌ ‌న్యాయవాది. మంచివాడు. ఆయనను, గౌతులచ్చన్నను నేను ఒకసారి ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో చూసివచ్చాను. ఆ రోజుల్లో డిటెన్యూలు ఏదయినా అనారోగ్యం ఉన్నా, లేకపోయినా తరచుగా బైట ఆస్పత్రులలో చేరుతుండేవాళ్ళు. ఆ రకంగానైనా బైటి ప్రపంచాన్ని చూడవచ్చునని, మిత్రులను, బంధువులను కలవవచ్చునని అనుకునే వాళ్ళు. ‘‘ఇందిరా గాంధీని మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిట్టినారు. కొంచెం సభ్యతతో మాట్లాడి ఉంటే ఆమెకు ఇంత పరపతి వచ్చేది కాదు’’ అని యజ్ఞనారాయణ తో చెప్పాను.

తర్వాత వాళ్ళు కోర్టుకు వచ్చారు. అప్పుడే జస్టిస్‌ ‌కుప్పుస్వామి, జస్టిస్‌ ఎ.‌వి.కృష్ణారావు, జస్టిస్‌ ‌రామచంద్రరాజుల ఫుల్‌ ‌బెంచ్‌ ‌ముందర మరొక మీసా కేసు హియరింగ్‌ ‌కు• వచ్చింది. నేనక్కడికి పోతున్నాను. ‘మరి నేనాబెంచికి పోవాలి, మీరే వాదించుకుంటారా’ అని యజ్ఞనారాయణను అడిగాను. ‘‘మేమే వాదించుకుంటాం. మీరు రానక్కర్లేదు. చూడండి, సాయంత్రానికి చట్టాన్ని కొట్టేస్తారు. మీరు ఈ కేసు వాదన నుంచి విముక్తి అయిపోయినట్టే’’ అన్నారు యజ్ఞనారాయణ. ఆ బెంచి మీద ఇద్దరూ ప్రగతిశీల న్యాయమూర్తులు కదా. మీసా చట్టాన్ని, అక్రమ నిర్బంధాన్ని కొట్టివేస్తారని యజ్ఞనారాయణ అమాయకంగా ఆశించారు. నేను చెప్పినాను – ‘మీరు చాల పొరపాటు పడుతున్నారు. చట్టాన్ని కొట్టెయ్యరు. మీ రిట్‌ ‌పిటిషన్ను కొట్టేస్తారు. మీరు మనుషుల గురించి గాని, ఇక్కడ కూచునే న్యాయమూర్తుల గురించి గాని, కోర్టుల గురించి గాని, చాలా తప్పుడు అంచనా వేస్తున్నారు. అది ఎవరి బెంచయినా సరే. అది వీలు కాదు’ అని చెప్పాను. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి అసాధారణమైన సాహసం కావాలి. ఆ చట్రం నుంచి బైట పడాలి. చట్రాన్ని అతిక్రమించి ఒక న్యాయబద్ధమైన తీర్పు ఇవ్వాలంటే చాల గొప్ప నైతిక ధైర్యం కావాలి. అది మన దేశంలో అరుదు. మరుసటి రోజు ఆ రిట్‌ ‌పిటిషన్ను కొట్టివేశారు.

అంటే న్యాయమూర్తి గనుక ప్రగతిశీలవాది అయితే ఇంకా సులభం. జమాయత్‌ ఎ ఇస్లాం వాళ్ళను, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వాళ్ళను నిర్బంధించడం సరైందే అని వాళ్ళ రిట్‌ ‌పిటిషన్లను కొట్టి పారెయ్యవచ్చు. అక్కడ భావప్రకటనా స్వేచ్ఛ ఎవరికి అనే ప్రశ్న వస్తుంది గాని ఎందుకు అని రాదు. జస్టిస్‌ ‌గంగాధరరావు గాని, అటువంటి న్యాయమూర్తులెవరయినా గాని కొన్ని రకాల అభిప్రాయాలతో ఉండేవారు. వారి దృక్పథాలు ఒక మాదిరిగా ఉండేవి. అందువల్ల ఎమర్జెన్సీ వ్యతిరేక రిట్‌ ‌పిటిషన్లను సులభంగా కొట్టివేస్తూ ఉండేవాళ్ళు.

ఎమర్జెన్సీ పట్ల మేధావి వర్గం ఇట్లా దాసోహం అనే వైఖరి తీసుకున్నప్పటికీ ప్రజలు అటువంటి వైఖరి తీసుకోలేదు. మేధావులు లొంగిపోయారు. కాని జనం దాన్ని పట్టించుకోలేదు. ఇందిరా గాంధీ అసలు ఎమర్జెన్సీని ఎత్తివేస్తుందా లేదా అనే సందేహాలు కూడ ఉండేవి. కాని ఆమె ఓడిపోయిన తర్వాత, ఇంకా నిర్ణయాధికారం తనదే అని చూపుకోవడానికి ఎమర్జెన్సీ ఎత్తివేసింది.

కాని ఈ క్రమం మొత్తాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టారు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణను మనం ఉపయోగించుకున్నామా, దుర్వినియోగం చేశామా వేరే సంగతి. ఆమె అన్ని రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేసింది. ఇక మరమ్మత్తు చేయడానికి వీలు లేకుండా చెడగొట్టి పెట్టింది. రెండు సంవత్సరాల జనతా పార్టీ పాలన తర్వాత ఆమె తిరిగి వచ్చింది. అయినా అంతకుముందు చలాయించినంతటి అధికారం చలాయించే లేకపోయింది.
జనతా పాలనా కాలంలో కూడా అంతకు ముందు ఎమర్జెన్సీలో రాజ్యాంగ వ్యవస్థ లకు ఏమి ప్రమాదం జరిగిందని నిజమైన విచారణ జరగలేదు. ఎన్నో విచారణ సంఘాలు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి షా కమిషన్‌ ‌వచ్చింది. దేశంలో అధికార యంత్రాంగం ఎట్లా ఉన్నదో, ఎట్లా పనిచేసిందో షా కమిషన్‌ ‌పరిశోధించింది. భారత పోలీసు వ్యవస్థ పనితీరు, రాజకీయ నాయకుల పనితీరు, ఆ రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని ఎట్లా వాడుకున్నారో తెలిపే ఉదాహరణలు – అన్నీ షా కమిషన్‌ ‌పరిశీలించింది.

అది జనతా ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం. ఆ రాజ్యాంగ వ్యవస్థ లన్నిటినీ సంస్కరించి, రాజ్యాంగ బద్ధంగా పనిచేయడమెట్లాగో నేర్పగలిగిన అవకాశం జనతా ప్రభుత్వానికి దొరికింది. ఆ వ్యవస్థలను పునర్నిర్మించే అవకాశాన్ని జనతా ప్రభుత్వం వాడుకోలేదు. అప్పటికే జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ అనారోగ్య పీడితుడిగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడడం తప్పు. అసలు జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినదే ఆధిపత్య, నిరంకుశ ధోరణులను అరికడతాననే వాగ్దానం మీద. అంటే అసలు ఆధిపత్య, నిరంకుశ ధోరణులంటే ఏమిటి అని తేల్చాలి.

ఆ పని చేయడానికే షా కమిషన్ ను నియమించారు. అది చాల మంచి పని. సరైన పని. అధికార యంత్రాంగం అక్రమాలను, పెత్తందారీతనాన్ని, నేరాలను పరిశోధించడానికి వేరే కమిషన్లు కూడ వేశారు. ఆ కమిషన్ల పని అంతా ఈ దేశంలో అధికార యంత్రాంగం ఎక్కడ విఫలమైందో కనిపెట్టడమే. ఆ కమిషన్లను వాడుకోకుండా జనతా ప్రభుత్వం దారి తప్పిపోయింది. ఆ సంస్థలను పునర్వ్యవస్థీకరించకుండా కాలయాపన చేశారు. ఇందిరా గాంధీ పాలనా కాలంలో రాజకీయ నేరాలు, అక్రమాలు చాల జరిగి పోయాయనే అవగాహనతో ప్రత్యేక న్యాయస్థానాలను తయారు చేశారు. అది చాలా అవసరమైన పని. మామూలు నేరాలకు, ఈ మాదిరి రాజకీయ నేరాలకు మధ్యన ఒక విభజన రేఖ గీయవలసిన అవసరం ఉండింది.

ఈ ప్రత్యేక న్యాయస్థానాల బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏదో రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు కోసం ఇటువంటి బిల్లు తెచ్చారని అనిపించు కోకుండా ఉండడానికి, రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. అది చట్టంగా మారింది. సుప్రీం కోర్టు కూడా ఈ ప్రత్యేక న్యాయస్థానాల చట్టాన్ని సాదరంగా ఆహ్వానించింది. భారత రాజకీయాలలో స్వర్ణయుగం ప్రారంభమైందని చంద్రచూడ్‌ ‌తీర్పు రాశారు. ఇది ఒక శాశ్వత అంగం కావాలని కృష్ణయ్యర్‌ ‌రాశారు. రాజకీయ దుష్ప్రవర్తన ను అరికట్టే, నియంత్రించే ఒక సంస్థగా ఇది అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఆ ప్రత్యేక న్యాయస్థానం సక్రమంగా పనిచేయనే లేదు. దాంట్లో మొదట నాలుగు కేసులు వచ్చాయి. ఆ తర్వాత విసి శుక్లా, మరికొందరు ‘ఇది ప్రత్యేక న్యాయస్థానం కాదు. దీని పరిధి ఏమిటి’ అని సవాల్‌ ‌చేశారు. అప్పుడు సుప్రీం కోర్టు ‘ఇది ప్రత్యేక న్యాయస్థానమే, శాశ్వత వ్యవస్థే, ఎమర్జెన్సీ కేసుల విచారణతోనే దీని పని అయిపోలేదు’ అని మళ్ళీ తీర్పు ఇచ్చారు.

మళ్ళీ శ్రీమతి ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత షా కమిషన్‌ ‌పరిధి ఏమిటని మరొక సుప్రీం కోర్టు జడ్జి ప్రశ్నిస్తూ తీర్పు ఇచ్చాడు. ఆ వెంటనే శ్రీమతి గాంధీ ప్రత్యేక న్యాయస్థానాల (రద్దు) చట్టం తీసుకొచ్చింది. గుర్తించవలసిన విషయ మేమంటే ఈ రద్దును పార్లమెంటులో కూడ ఎవరూ ప్రశ్నించలేదు. ఎవరి దృష్టికీ రాకుండానే ఒక్క కలం పోటుతో ప్రత్యేక కోర్టులు రద్దు అయిపోయాయి. ఆమె చెప్పిన కారణం ఏమంటే ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరచడానికి తీసుకొచ్చిన చట్టానికి కాలం చెల్లిందని.
ఇది అప్పుడు ఎవరూ గమనించలేదు. నేను పది సంవత్సరాలుగా దాని గురించి రాస్తూనే ఉన్నాను. ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే రాసిన పుస్తకంలో అరుణ్‌ ‌శౌరి ఈ ప్రత్యేక న్యాయస్థానాల అవసరం గురించి రాశాడు. ఇప్పుడు ఆయనే నేరుగా సెంటార్‌ ‌హోటల్‌ ‌కుంభకోణంలో చిక్కుకున్నాడు.

ఎమర్జెన్సీ నేరాల మీద ఎటువంటి చర్య తీసుకుని ఉన్నా అధికార వ్యవస్థలన్నీ ఇట్లా కుప్పకూలిపోయి ఉండేవి కావు. జనతా పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక మంచి ప్రారంభం చేశారు. వ్యవస్థ ఎక్కడ విఫలమయిందో అన్వేషణ ప్రారంభ మయింది. కమిషన్ల నివేదికలు చదివితే ఆ అన్వేషణ ఎంత బాగా జరిగిందో తెలుస్తుంది. ఆ నివేదికల మీద ఆధారపడి ఆ వ్యవస్థలను పునర్నిర్మించవలసి ఉండింది. కాని ఆ పని జరగలేదు. అట్లా మన అధికార వ్యవస్థలను పునర్నిర్మించే పని స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఎప్పుడూ జరగలేదు. జనతా పార్టీ పాలనా కాలంలో వచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందనుకోను. అది కేవలం మన అలవాటు వల్ల జరిగింది. ఈ దేశంలో అలవాటు ఏమంటే ఏదీ పని చేయగూడదు. ఉన్నది ఉన్నట్టు ఉంచడానికి ఈ దేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. మేధో ప్రపంచంలోనూ అంతే. రాజకీయ రంగంలోనూ అంతే.అందువల్లనే మతోన్మాద రాజకీయాలు గాని, ప్రపంచీకరణ రాజకీయాలు గాని మనను ముంచెత్తడం సాధ్యమయింది.

రాజ్యాంగబద్ధంగా పాలన సాగి ఉన్నట్టయితే ఈ దేశంలో విప్లవం గురించి ఇంత ఆలోచన ఉండేదే కాదు. జీవితం ఎంతో కొంత సంతృప్తికరంగానే ఉండేది. ప్రజలను భ్రమల్లోనే ఉంచుతూ ఉంటే, ఆ భ్రమలు ఎప్పటికీ వాస్తవరూపం ధరించకపోతే, అసంతృప్తి పెల్లుబుకుతుంది. అది వేర్వేరు ఉద్యమాలకు, ఆందోళనలకూ దారి తీస్తుంది. అందుకే ఎంతో బాధ్యతాయుతుడైన రాజకీయవేత్త జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌కూడ ‘తప్పుడు ఆజ్ఞలను ఉల్లంఘించండి, విధేయంగా ఉండనవసరం లేదు’ అని మన సైనిక బలగాలకు పిలుపునిచ్చాడు. అంటే ప్రజలను పాలకులు ఆ స్థితికి నెట్టారన్నమాట. ఎమర్జెన్సీ అనంతరం మన అధికార యంత్రాంగంలో నిండిపోయిన వ్యక్తులలో అత్యధికులకు భవిష్యత్‌ ‌దృష్టి లేదు. అట్లా ఒకవిధంగా ఏ పనికీ పనికిరాని నిర్వీర్య వ్యక్తులను సృష్టించడం జరిగింది.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply