Take a fresh look at your lifestyle.

ఎమర్జెన్సీ

“ఆ వెంటనే నేను రాజ్యాంగం తీసి ఎమర్జెన్సీ ఏమిటి, దాని వల్ల ఏయే హక్కులు పోతాయి మళ్ళీ ఒకసారి చదువుకున్నాను. ఆ తర్వాత అబిడ్స్‌లోని ఎఎ హుస్సేన్‌ ‌పుస్తకాల షాపుకు వెళ్ళి విలియం షైరర్‌ ‌రాసిన ‘ది రైజ్‌ అండ్‌ ‌ఫాల్‌ ఆఫ్‌ ‌ది థర్డ్ ‌రీష్‌’ ‌పుస్తకం కొనుక్కున్నాను. హిట్లర్‌ ‌జర్మనీలో అధికారాన్ని ఎట్లా సంపాదించాడో, ఆ అధికార సోపానంలో అత్యున్నత శిఖరాలకు ఎట్లా ఎగబాకాడో, చివరికి ఎట్లా పతనమైపోయాడో చాలా వివరంగా, విమర్శనాత్మకంగా చెప్పిన పుస్తకం అది. వందలాది పేజీల ఆ ఉద్గ్రంథంలో విలియం షైరర్‌ ‌మహా నియంత హిట్లర్‌ ‌గురించి ఏమేమి వర్ణించాడో, ఇందిరా గాంధీ సరిగ్గా ఆ పనులే చేయడం మొదలుపెట్టింది. ఆ పనుల వరుసలో ఒకానొకటి ఈ ఎమర్జెన్సీ ప్రకటన.”

ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి మన వ్యవస్థలోని మౌలిక నిర్మాణాలన్నీ ధ్వంసమై పోయాయి. ముఖ్యంగా న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ పనికిరాకుండా పోయాయి. పార్లమెంటు అనేది బాతాఖానీ షాపు కూడా కాకుండా పోయింది.

కొంత మంది ప్రజ్ఞావంతులయిన పార్లమెంటేరియన్లు ఉండేవారు. ఉదాహరణకు మధులిమాయే ఉండేవాడు. అశోక్‌ ‌మెహతా ఉండేవాడు. రాం మనోహర్‌  ‌లోహియా ఉండేవాడు… అటువంటి ప్రజ్ఞావంతులయిన పార్లమెంటేరియన్లు కూడ నిరర్థకమయి పోయారు. పాకిస్తాన్‌తో యుద్ధంలో గెలిచి, బంగ్లాదేశ్‌ ‌సాధించి, ఆమె విజయేందిర అయిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది.

అందువల్ల ప్రజాప్రతినిధులనబడే వాళ్ళు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం మానేశారు. పార్లమెంటులో పెరుగుతున్న ఆధిపత్య, నిరంకుశ ధోరణులకు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టారు.అట్లాగే న్యాయవ్యవస్థను విధ్వంసం చేయడం క్రమబద్ధంగా, పద్ధతి ప్రకారం 1960ల నుంచే జరిగింది. ఆ క్రమం గురించి మరోసారి.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎమర్జెన్సీ పాలన భయానకంగా సాగింది. అక్రమ అరెస్టులు విచ్చలవిడిగా సాగాయి. వందలాది మంది నక్సలైట్ల సానుభూతిపరులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఎంతో మంది ఈ నిర్బంధానికి గురయ్యారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు, గెస్ట్ ‌హౌసులు నిర్బంధ శిబిరాలుగా మారాయి.

అంపశయ్య నవీన్‌ ‌రాసిన నవల ‘చీకటి రోజులు’లో ఆ నిర్బంధ కాండ గురించి వివరంగా ఉంది.ఆ రాత్రి నుంచే నాకు ఫోన్‌ ‌కాల్స్ ‌రావడం మొదలయింది. మొట్టమొదటి ఫోన్‌ ‌కాల్‌పత్తిపాటి వెంకటేశ్వర్లు నుంచి. ఆయన అప్పటికి మా డిఫెన్స్ ‌కమిటీకి కార్యదర్శి. పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి. పోలీసులు ఆయన ఇంటిమీద దాడి చేసి పుస్తకాలు ఎత్తుకుపోయారు. పౌర హక్కుల సంఘం రికార్డస్ ఎత్తుకుపోయారు. ఆయనను అరెస్టు చేశారు.

ఆ తర్వాత ఎంటి ఖాన్‌  ‌నుంచి ఫోన్‌. ఎంతోమంది కవులు, రచయితలు ఫోన్లు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్‌ ‌చేశారు. ఆ రాత్రి నుంచి మర్నాటి ఉదయం దాకా నాకు కనీసం ఇరవై ముప్పై మంది అరెస్టయిన వార్త ఫోన్‌ ‌ద్వారాతెలిసింది.ఆ వెంటనే నేను రాజ్యాంగం తీసి ఎమర్జెన్సీ ఏమిటి, దాని వల్ల ఏయే హక్కులు పోతాయి మళ్ళీ ఒకసారి చదువుకున్నాను.

ఆ తర్వాత అబిడ్స్‌లోని ఎఎ హుస్సేన్‌ ‌పుస్తకాల షాపుకు వెళ్ళి విలియం షైరర్‌ ‌రాసిన ‘ది రైజ్‌ అండ్‌ ‌ఫాల్‌ ఆఫ్‌ ‌ది థర్డ్ ‌రీష్‌’ ‌పుస్తకం కొనుక్కున్నాను. హిట్లర్‌ జర్మనీలో అధికారాన్ని ఎట్లా సంపాదించాడో, ఆ అధికార సోపానంలో అత్యున్నత శిఖరాలకు ఎట్లా ఎగబాకాడో, చివరికి ఎట్లా పతనమైపోయాడో చాలా వివరంగా, విమర్శనాత్మకంగా చెప్పిన పుస్తకం అది. వందలాది పేజీల ఆ ఉద్గ్రంథంలో విలియం షైరర్‌ ‌మహా నియంత హిట్లర్‌ ‌గురించి ఏమేమి వర్ణించాడో, ఇందిరా గాంధీ సరిగ్గా ఆ పనులే చేయడం మొదలుపెట్టింది. ఆ పనుల వరుసలో ఒకానొకటి ఈ ఎమర్జెన్సీ ప్రకటన.

ఆ రోజు నేను చేసిన మొదటి పని పత్తిపాటి వెంకటేశ్వర్లు తరఫున పిటిషన్‌ ‌రాయడం. పిటిషన్‌ప్రధాన భాగమంతా రాసి టైపు చేయించాను. వెంకటేశ్వర్లు భార్య వెంకాయమ్మ గారిని పిలిపించాను. ఆమె వివరాలన్నీ ఆ పిటిషన్‌లో చేర్పించాను. అప్పుడే వెంకటేశ్వర్లు దగ్గర గుమస్తాగా పనిచేస్తుండిన వెంకటరావు కూడా వచ్చాడు.

వెంకటేశ్వర్లు దగ్గర ఉన్న కేసుల ఫైళ్ళన్నీ నా దగ్గరికి తెప్పించుకున్నాను. కక్షిదార్లందరికీ చెప్పమని వెంకటరావుకు చెప్పాను. ప్రతి కక్షిదారూ ప్రతి కేసు విషయం లోనూ వెంకాయమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చి రావాలి. ఆమె ఆ విషయం నాకు చెప్పిన తరువాతనే ‘నేను కోర్టులో వాదిస్తాను’ అనే ఏర్పాటు చేశాను. సరే, ఆ రోజు పత్తిపాటి వెంకటేశ్వర్లు పేరు మీద లంచ్‌ ‌మోషన్‌ ‌మూవ్‌  ‌చేశాను. ఆ పిటిషన్‌లో అసలు ఎమర్జెన్సీ చట్టబద్ధతను సవాలు చేశాను. ఆంతరంగిక భద్రతా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్‌ ఇంటర్నల్‌ ‌సెక్యూరిటీ ఆక్ట్ – ‌మీసా) సమంజసత్వాన్ని ప్రశ్నించాను. పత్తిపాటి వెంకటేశ్వర్లును అరెస్టు చేయడాన్ని సవాల్‌ ‌చేశాను.

ఆ లంచ్‌ ‌మోషన్‌ ‌జస్టిస్‌కొండా మాధవ రెడ్డి గారి బెంచి మీదికివచ్చింది.కోర్టు హాలులోకి అప్పటి పోలీసు కమిషనర్‌ ‌శరణ్యన్‌  ‌వచ్చి కూచున్నాడు. డ్రెస్‌తో వచ్చి కూచున్నాడు. వెంపటాపు సత్యనారాయణ అనే శ్రీకాకుళ ఉద్యమ నాయకుడిని చంపడంలో ఆ శరణ్యన్‌కు సంబంధం ఉందని నాకు  తెలుసు. రాత్రికి రాత్రే మొత్తం వాతావరణం మారిపోయినట్టు  కనబడింది. ఆ గాలిలో భయం, అనుమానం వ్యాపిస్తుండడం నేను చూశాను. న్యాయవాదుల మనసులలో బెరుకు ముఖాల మీద కనబడుతోంది.

మా డిఫెన్స్ ‌కమిటీ కోశాధికారిగా ఉండిన శ్రీరామారావు అనే న్యాయవాది వచ్చి ఇంకెందుకు మన డిఫెన్స్ ‌కమిటీ? మన పని అయిపోయింది గదా ‘మూసేద్దాం’ అనిఅన్నాడు. ‘లేదు. మన పని ఇప్పుడే మొదలవుతోంది’ అని నేనన్నాను.ఎవరు నా వెంట ఉన్నా, లేకపోయినా నేనీ పని చేస్తూనే ఉంటాను, చేయాలి అనుకున్నాను.న్యాయవాదులు, బైటి మిత్రులు కొందరు కూడ నన్ను తప్పించుకు పోవడం మొదలు పెట్టారు. ఎదురు పడితే మాట్లాడేవారు కాదు. కొందరు రెడ్డి మిత్రులు మాత్రం నాతో పాటు భోజనం దగ్గర కూర్చునేవారు.

మధ్యాహ్నం పిటిషన్‌ ‌విచారణకు వచ్చింది. నా వాదనలు మొదలు పెట్టాను.‘‘అసలు అతడ్ని అరెస్టు చేయడానికి తగిన కారణమే లేదండీ. అతను డిఫెన్స్ ‌కమిటీ కార్యదర్శి. అతడ్ని తీసుకుపోయి మీసా కింద ఇరికిస్తే ఎట్లా అండీ’’ అని నేను మాధవ రెడ్డి గారి ముందు వాదిస్తున్నాను.‘అసలు గ్రౌండ్సే లేవండి’ అని నేను జస్టిస్‌ ‌మాధవ రెడ్డి గారితో అనగానే ఆయన పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ ఓబులపతి చౌదరి వైపు తిరిగి ‘గ్రౌండ్స్ ఎక్కడ’ అని అడిగారు.‘గ్రౌండ్స్ ‌టైపవుతున్నాయండీ’ అని ఓబులపతి చౌదరి చెప్పారు.‘ఆ స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చెయ్యండి. గ్రౌండ్స్ ‌మీద అరెస్టు చేయడం కాదు. ముందు అరెస్టు చేసి పడేసి ఆ తర్వాత కారణాలేవో బనాయించి ఇప్పుడు టైపు చేయిస్తున్నారు’  అని నేను తగులుకున్నాను.దీన్ని ఎట్లా చేసేదిరా అని మాధవ రెడ్డి గారికి సంకటం పట్టుకుంది. దాన్ని అట్లనే రికార్డు చేస్తే చౌదరి ఉద్యోగం పోతుంది.

అందుకని ఆయన కొంచెం తాత్సారం చేశాడు. అట్లా సాగదీసే సరికి గ్రౌండ్స్ ‌టైప్‌ అయిన కాగితం వచ్చింది.సరే, ఆ తర్వాత చట్టానికే ఒక సవరణ తెచ్చారు. గ్రౌండ్స్ ఏమిటి అని అడగడానికి వీల్లేదు అని. అసలు ప్రతిరోజూ ఏదో ఒక సవరణ ఫాక్స్ ‌వస్తూనే ఉండేది. ఎక్కడో ఏదో రిట్‌ ‌పిటిషన్‌  ‌పడి, చట్టాన్ని మొత్తంగానో, చట్టంలోని ఏదో ఒక నిబంధననో సవాలు చేయడం, వెంటనే దానికి సవరణ తీసుకురావడం – ఈ మాదిరిగా ఉండేది.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం

అక్షరీకరణ :ఎన్ .వేణుగోపా

Leave a Reply