Take a fresh look at your lifestyle.

కేరళలో ఏనుగు మరణవేదనను చూస్తుంటే… ‘కడుపు రగిలిపోతోంది’

కేరళలోని మలప్పురం జిల్లాలో బాణాసంచా కూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి..గర్భంతో ఉన్న ఏనుగును వధించిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ ‌విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో జరిగిన ఘటనతో కడుపు రగిలిపోతోందని విజయశాంతి అన్నారు. మూగజీవుల విషయంలో కొందరు మనుషులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న తీరుపై ఆమె తన ఫేస్‌బుక్‌ ‌వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సృష్టిలో ఎంతో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యాం వేసేలా మనుషులు ప్రవర్తిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రకృతిపై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు…. మిగిలిన జీవాల మనుగడ ఈ మనుషుల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు… కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాణాసంచా మందు కూర్చిన అనాసపండు పెట్టి, ఆ మూగజీవి మరణవేదనను క్రూరంగా వినోదించిన ఈ మనుషుల వికృత చేష్టలకు ఏ శిక్ష వేస్తే సరిపోతుంది? అని ప్రశ్నించారు.

ఈ సంఘటనకు ముందు టిక్‌టాక్‌ ‌వీడియో కోసం ఒక కుక్కపిల్ల కాళ్లూ, చేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరేసి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాం. అంతకుముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు. మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు… అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు… దిగజారిన పరిస్థితులు… చూస్తుంటే మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు… చూస్తూ స్పందించనివారు… అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం… నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దనీ విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply