Take a fresh look at your lifestyle.

బాయిలకాడ కరెంటు మీటర్లు రైతుల పాలిట తూటాలు ……!

  • కావాలంటే బిజెపికి వోటెయ్యండి..వొద్దనుకుంటే టిఆర్‌ఎస్‌కు ..!
  • ఆరేండ్లుగా కేసీఆర్‌ ‌రైతుల కోసమే పని చేస్తుండు
  • బిజెపి ప్రభుత్వమేమో రైతులపై బాంబులు వేస్తుంది
  • రైతులకు మేలు కోసమే కొత్త కెవెన్యూ చట్టం
  • పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో మంత్రి హరీష్‌రావు

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో నిప్పులు చెరిగారు. బాయిలకాడ, బోర్లకాడ కరెంటు మీటర్లు పెట్టి బిల్‌ ‌కలెక్టర్లతో బిల్లుల వసూళ్లకు పెడతారట. కరెంటు మీటర్లు కావాలంటే బిజెపి పార్టీకి(త్వరలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి రానున్న ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని) వోటెయ్యండి. బోర్లకాడ కరెంటు మీటర్లు వొద్దనుకుంటే .. మన కేసీఆర్‌ ‌సారూ.. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కారు గుర్తుకు వోటెయ్యాలనీ రైతులకు పిలుపునిచ్చారు. గురువారం సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన రాయపోల్‌లో మధుసూదన్‌ ‌రెడ్డి ఫంక్షన్‌ ‌హాల్‌లో మండలంలోని 266 మంది రైతులకు ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాక్రిష్ణశర్మతో కలిసి పట్టాదారు పుస్తకాలను, అధిక వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..జీఎస్టీ, ఐజీఎస్టీ, 14వ ఆర్థిక సంఘం నిధులు, బీఆర్‌జీఎఫ్‌ ‌కింద రాష్ట్రానికి 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలనీ, తెలంగాణ రాష్ట్రానికి వాటాగా..హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం మాయమాటలు చెబుతున్నారని హరీష్‌రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు ప్రభుత్వం. గత ఆరేండ్లుగా రైతు కోసమే పని చేస్తున్నది. బిజెపి పార్టీ ప్రభుత్వం రైతులపై బాంబులు వేస్తున్నదనీ ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం రైతుకు ఎకరానికి యేటా పెట్టుబడి సాయం కింద 10 వేల రూపాయలు సాయం చేస్తున్నదనీ, ఈ విధంగా దేశంలోని మిగతా 28 రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా? అంటూ మంత్రి ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సంక్షేమ, రైతు ప్రభుత్వమని, బిజేపీ రైతు వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తున్న విధానం నచ్చక కేంద్రమంత్రి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ చేతల్లో చూపే ప్రభుత్వమని, 7 లక్షల ఆడ పిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని, ఆర్థిక సాయం కింద ఇప్పటి దాకా 5వేల 555 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు.

ప్రస్తుత కొరోనా విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. కానీ, సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా వోట్ల కోసం వచ్చేవారెవరో గుర్తించాలని కోరారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారని, అయినా పాసు పుస్తకాలు పొందేవారు కారని, కొత్త రెవెన్యూ చట్టం..రైతులకు మేలు కోసం సిఎం కేసీఆర్‌ ‌తెచ్చారన్నారు. 1బీ కోసం తహశీల్దార్‌ ‌కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతుల సమయం వృథా కావొద్దని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో డిజిటల్‌ ‌సర్వే చేస్తానని సిఎం కేసీఆర్‌ ‌చెప్పారని, ట్రాక్టర్‌ ‌ర్యాలీతో కొత్త రెవెన్యూ చట్టానికి ప్రతి గ్రామంలో స్వాగతిస్తున్నారన్నారు. మండలంలోని 11, 317 ఖాతాలకు 10, 022 ఖాతాలు క్లియరెన్స్ ‌చేసినట్లు వాటిలో ఇప్పటికే 9, 756 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసుకున్నామని, ఇవాళ 266 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నాలా- ఎక్సెస్‌ ఎక్సేంట్‌ 550, ‌కోర్టు తగదాలతో 350, ఈకేవైసీ-344, ప్రభుత్వ ల్యాండ్‌ ‌ఖాతాలో 51 ఇలా మొత్తం క్లియరెన్స్ ‌చేయని 1295 పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన క్లియరెన్స్ ‌చేసి రైతులకు అందివ్వాలని ఆర్డీవోను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply