కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
ఈవి పాలసీ ప్రకటనలో మంత్రి కెటిఆర్
తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చబోతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ఫ్రెండ్లీ వెహికల్స్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే టీఎస్ ఐపాస్, బీఎస్ ఐపాస్ విజయవంతం అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా విజయవంతం కాబోతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వొచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి శుక్రవారం ఉదయం విడుదల చేశారు.
జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. ఐదు కంపెనీలతో శువ్రారం ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించారు. తయారీ, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించేలా నూతన విధానం రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు పడ్డారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యతను కొరోనా మరోసారి గుర్తు చేసిందన్నారు. కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. డీ కార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీ సెంట్రలైజేషన్ అమలు చేయాలని సూచించారు.