Take a fresh look at your lifestyle.

ముందస్తుకు సై అంటున్న రాజకీయ పార్టీలు

ముందస్తు ఎన్నికలకు రాజకీయ పార్టీలుకూడా సిద్ధమంటున్నాయి.. నిన్నటివరకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ వొచ్చిన ఈ పార్టీలు ఇప్పుడు తాము కూడా సిద్ధ్దమేనంటు ప్రకటనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయను కున్నప్పుడు సహజంగా అధికార పార్టీ ముందుచూపుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధ్దమవుతాయి. 2018లో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆవిధంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించిన విషయం తెలియందికాదు. ఆ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించడంతో తిరుగులేని మెజార్టీ సాధించింది. గత కొంతకాలంగా మరోసారి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నదన్న విషయంలో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త పథకాలు, వివిధ పనులకు చేస్తున్న మంజూరులు ఆ దిశగానే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వొచ్చాయి. అయితే ఈ చర్చలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెడుతూ కెసిఆర్‌ ‌చేసిన ప్రకటన ఆందరి నోళ్ళను కట్టిపడేసినట్లైంది.

కాని, తాజాగా మీడియా సమావేశంలో కెసిఆర్‌ ‌చేసిన సవాల్‌ ఆ ‌దిశగా మరోసారి ఆలోచింపజేసేదిగా ఉంది. ఇటీవల జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ కెసిఆర్‌ ‌పేరెత్తకుండానే టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలియందికాదు. దానిపైన ఆలస్యంగానైనా కెసిఆర్‌ ‌తీవ్రంగా రియాక్ట్ ఆయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి పార్టీని ఆయన ఘాటుగా విమర్శించారు. కేవలం విమర్శించడమే కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా సవాల్‌కు ప్రతి సవాల్‌కు విసిరారు. బిజెపి జాతీయ కార్యవర్గన సమావేశాల్లో పాల్గొన్న అమిత్‌షా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదంటూ దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటూ కెసిఆర్‌ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దానికి కెసిఆర్‌కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ప్రధాని ముందస్తు ఎన్నికలకు సిద్ధమయితే• తానుకూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తానని చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరోసారి ముందస్తు చర్చకు కారణమైంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు తేదీని ఖరారు చేస్తే.. తానుకూడా మరుసటిరోజే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తాననడం వెనుక తప్పకుండా కెసిఆర్‌ ‌వ్యూహం ఉండి ఉంటుందన్న చర్చ జరుగుతున్నది.

నిజంగానే ఆ ఆలోచన లేకుండానే కెసిఆర్‌ ఇలాంటి ప్రకటన చేయడని, తాము మొదటినుండి వ్యక్తం చేస్తున్న అనుమానం సరిఅయిందేనంటున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలకు ముందస్తుకు వెళ్ళే ధైర్యం ఉందా అని కెసిఆర్‌ ‌చేసిన సవాల్‌కూడా వ్యూహాత్మకమే నంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో ఆరితేరిన కెసిఆర్‌ ‌మాటల వెనుక ఎంతో నిగూడార్థం దాగి ఉంటుందని వారు చెబుతున్నారు. తాను బయట పడకుండానే ప్రతిపక్షాలను ముందస్తు ముగ్గులోకి తెలివిగా లాగే ఎత్తుగడగానే ఈ ప్రకటన అయి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. వాస్తవంగా రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌పైన రాజకీయ దాడి మొదలయింది. ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఇటీవల తమ కార్యక్రమాలను విస్తృత పరుస్తున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంనుండి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, ప్రజలతో మమేకమయ్యే వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు ఎదుటి పార్టీల్లోని ముఖ్యనేతలను తమవైపు లాక్కొనే పనిలో ఈ రెండు పార్టీలు పోటీపడుతున్నాయి.

దానికితోడు వైఎస్‌ఆర్‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ మరో పక్క గత సంవత్సర కాలంగా పాదయాత్రలపేరున ఊరూరు తిరగుతూ టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పాలనాతీరును నిలదీసే పనిలో ఉంది. ఇంకో పక్కన టిడిపి తిరిగి ఇక్కడ వేళ్ళూనుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక లెఫ్ట్ ‌పార్టీలు ఉండనే ఉన్నాయి. అయినా టిఆర్‌ఎస్‌కు ధోకా లేదని కెసిఆర్‌ ‌ఘంటా పథంగా చెబుతున్నారు. అంతర్ఘతంగా ఇప్పటికే ఆయన చేయించుకున్న సర్వేలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న వార్తలు వొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలోకూడా ఆయన ఇప్పటికే చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయినా ఇనుము వేడిగా ఉన్నప్పుడే అనుకూలంగా మలుచుకోవాలన్నట్లుగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయికాబట్టే ముందస్తుకు పోవాలన్న ఆలోచన కెసిఆర్‌కు చాలా కాలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే కేంద్రంలోని బిజెపి సర్కార్‌పైనే యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలు జరుపకుండా కేంద్ర అడ్డుపడి, రాష్ట్రపతిపాలన పెడితే ఎలా అన్న అనుమానంతోనే కెసిఆర్‌ ‌ముందుకు వెళ్ళలేక పోతున్నారని రాజకీయ వేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రాజకీయాలిప్పుడు చాలా వేడిగా కొనసాగుతున్నాయి. పలు రాజకీయ పార్టీలు వొచ్చే ఎన్నికల్లో తమదే పై చెయ్యి అన్నట్లుగా ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదన్న విషయం తెలిసినప్పటికీ కెసిఆర్‌ను అంత సులభంగా నమ్మే పరిస్తితులు లేవన్నట్లుగా ప్రతీ రాజకీయపార్టీకూడా రేపు ఎన్నికలు వొచ్చినా పోటీ చేయడానికి సిద్ధమే అన్నట్లుగా తమ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకుంటున్నాయి. ఎట్టిపరిస్థితిలో ఈసారి టిఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించాలన్నదే ప్రతీ రాజకీయ పార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.

Leave a Reply