Take a fresh look at your lifestyle.

మళ్ళీ బ్యాలెట్‌ ‌పద్ధతిలో ఎన్నికలు

హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలను ఈసారి బ్యాలెట్‌ ‌పద్ధతి ద్వారా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ‌నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యంత్రాల(ఈవీఎంల) ద్వారా ఎన్నికలు ఎంతో పారదర్శకంగా జరుగుతున్నట్టు మేధావులు, నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాలెట్‌ ‌పద్దతి అంటే పాతరోజుల్లోలాగే అక్రమాలు జరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈవిఎం మెషీన్ల బటన్‌ ‌ప్రెస్‌ ‌చేసేటప్పుడు కొరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, అందుకే బ్యాలెట్‌ ‌పద్దతిని ప్రవేశపెట్టాలని మెజారిటీ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. దాంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, బ్యాలెట్‌ అయినా కొరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. బ్యాలెట్‌ ‌పత్రంలోని గుర్తులపై వోటర్లు స్టాంపు వేయాల్సి ఉంటుంది. అందరూ ఒకే స్టాంపును ఉపయోగిస్తే, దాని ద్వారా కొరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నది వాదన. తార్కికంగా అందులోనూ నిజం ఉంది. అయితే, మెజారిటీ పార్టీల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం బ్యాలెట్‌ ‌వైపే మొగ్గు చూపింది. బ్యాలెట్‌ ‌పద్ధతి మన దేశంలో కొత్త కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2001 వరకూ ఇదే పద్ధతిన ఎన్నికలను నిర్వహించారు. బ్యాలెట్‌ ‌పత్రాలపై ఇంకు పోయడం, పెట్టెలను ఎత్తుకుని పోయి బావిలో పడేయడం వంటి అక్రమాలు జరగడం వల్లనే ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈవీఎంలను అప్పట్లోనే సవాల్‌ ‌చేశారు. అయితే, ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ ‌జత చేస్తే అనుమానాలు ఉండవు. అయితే, తెలంగాణలో ఎం-2 ఈవీఎంలు ఉన్నాయి.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త వివీ పాట్‌లు ఈ యంత్రాలకు అమరవు. అందువల్ల ఎం-3 యంత్రాలను తెప్పించాల్సి ఉంటుంది. వీటిని ఈసీఐఎల్‌ ‌తెప్పించే పరిస్థితిలో లేదు. అయినా కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 కోట్ల రూపాయిలు ఖర్చవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బ్యాలెట్‌ ‌పత్రాల ద్వారా ఈ ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికలకు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. అయితే, బ్యాలెట్‌ ‌పత్రాలను ఒకసారి ఉపయోగిస్తే అన్ని ఎన్నికలకూ వాటినే ప్రవేశపెట్టాలని ప్రజల్లో డిమాండ్‌ ‌పెరిగే అవకాశం ఉంది. గతంలో బ్యాలెట్‌ ‌పత్రాల పద్ధతిని తొలగించి ఈవీఎంలను ప్రవేశపెట్టినప్పుడు వీటికి జనం అలవాటు పడటానికి రెండుమూడు ఎన్నికలు పట్టింది. వీటిని కూడా ట్యాంపరింగ్‌ ‌చేయవచ్చని ఎలక్ట్రానిక్‌ ‌నిపుణుడు ఒకరు రుజువు చేసి చూపించారు. అప్పుడే వీవీ ప్యాట్‌ను అమర్చే పద్దతిని ప్రవేశపట్టారు. అయితే మన వోటర్లలో ఇప్పటికీ అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులు. గుర్తులను బట్టే వోటు వేస్తారు. బ్యాలెట్‌ ‌పత్రాల్లో ఉన్న గుర్తులు వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. అందువల్ల బ్యాలెట్‌ ‌పద్ధతి తొలగించవద్దని అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. బ్యాలెట్‌ ‌పెట్టెలను మార్చేయడం, వాటిని ధ్వంసం చేయడం, పోలింగ్‌ ‌కేంద్రాలను ఆక్రమించడం వంటి అక్రమాలు జరిగేవి. పోలింగ్‌ ‌కేంద్రాల్లోకి అక్రమంగా ప్రవేశించి బ్యాలెట్‌ ‌పెట్టెలను ఎత్తుకుని పోయిన సంఘటనలు కూడా ఇంకా మన స్మృతిపథంలోనే ఉన్నాయి.

వోటర్లలో చైతన్యం వస్తే తప్ప ఏ విధానంలోనైనా లొసుగులు ఉంటూనే ఉంటాయి. వాటిని అతిక్రమించేందుకు వోటర్లను చైతన్య పర్చే కార్యక్రమాలు జరగాలి. అవి జరగడం లేదు. ఇలాంటి విషయాల్లో అన్ని పార్టీల ధోరణీ ఒకే విధంగా ఉంది. ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యంత్రాలు పారదర్శకంగానే ఉన్నాయని అన్ని వర్గాలు పేర్కొంటున్నారు. అయితే, ఓడిపోయిన పార్టీలు సహజంగానే ఈ యంత్రాలపై విరుచుకుని పడుతున్నాయి. నిజానికి బ్యాలెట్‌ ‌పెట్టలను తారుమారు చేయడం, మార్చడం ఐదు దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ యంత్రాలను ట్యాంపరింగ్‌ ‌చేయడం అంత సులభం కాదు. సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎన్నికల వోటింగ్‌ ‌విధానంలో మార్పులకు ఆలోచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పని చేసిన టిఎన్‌ ‌శేషన్‌ ‌హయాంలోనే ఎన్నికల సంఘంలో సంస్కరణలు జరిగాయి. ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యంత్రాలను మొదటి సారిగా కేరళలో 1982లో పారూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. 1999 ఎన్నికల్లో పరిమితంగా వినియోగించారు.

2004 నుంచి ఈ యంత్రాలను వరుసగా వాడుతున్నారు. ఒక్కొక్క ఈవీఎంలో 2000 వోట్లు నమోదు అయ్యేందుకు ఏర్పాటు ఉంది. బ్యాలెట్‌ ‌పెట్టెలలో ఆ పరిమితి లేదు. అయితే, వాటిలో పట్టినంతగా వోట్లు వేయవచ్చు. అందువల్లనే వీటిలో వోట్లను మార్చేందుకు అవకాశం ఉంటోంది. ఎన్నికల సంఘానికి చెందిన సాంకేతిక నిపుణుల కమిటీ, బెంగళూరుకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్ ‌లిమిటెడ్‌, ‌హైదరాబాద్‌కి చెందిన ఎలక్ట్రానిక్‌ ‌కార్పొషన్‌ ఇం‌డియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఈ ‌వీఎంలను తయారు చేస్తున్నాయి. ఎం-2 యంత్రాల్లో గరిష్టంగా 64 అభ్యర్థుల పేర్లు పడతాయి. ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యంత్రాలు మొదట్లో అనుమానాలు రేకెత్తించినా ఇప్పుడు అందరికీ అలవాటు కావడం వల్ల ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. మునిసిపల్‌ ఎన్నికలతో పాటు గ్రేటర్‌ ఎన్నికలకు ఈ యంత్రాలను ఉపయోగించాలన్న ప్రతిపాదనలపై మెజారిటీ పార్టీలు అంగీకరించినందున పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ట్యాంపరింగ్‌ ‌చేయాలనుకుంటే ఏ పద్దతిలోనైనా చేసేందుకు అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఒక ప్రయోగమే.

Leave a Reply