Take a fresh look at your lifestyle.

కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తర్వాతనే ఎన్నికలు

తేల్చి చెప్పిన మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా
జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదాను కల్పించిన తర్వాతే శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నేత ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామని చెప్తున్నదని అన్నారు. ముందుగానే రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆ తర్వాతే శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. అధికరణ 370ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ ‌నుంచి వెనుకకు తగ్గేది లేదని స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీరులో ఎన్నికలను నిర్వహించాలనుకుంటే, అంతకన్నా ముందుగానే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు. ఒమర్‌ అబ్దుల్లా శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ-కశ్మీరుపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి ప్రస్తావించారు.

తమను ఈ సమావేశానికి ఓ కూటమిగా పిలవలేదని, అందుకే తాము వేర్వేరుగా హాజరయ్యామని తెలిపారు. ఒకవేళ తమను గుప్కర్‌ అలయెన్స్‌గా పిలిచి ఉంటే, తమ కూటమి తరపున ఒక నేత మాత్రమే హాజరై ఉండేవారని చెప్పారు. గుప్కర్‌ అలయెన్స్ ఎజెండాకు భిన్నమైనదానిని తాము ఈ సమావేశంలో మాట్లాడలేదన్నారు. అధికరణ 370ను రద్దు చేయాలనే ఎజెండాను సాధించుకునేందుకు బీజేపీకి 70 సంవత్సరాలు పట్టిందని మెహబూబా ముఫ్తీ మాత్రమే కాకుండా ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా చెప్పారన్నారు. ఈ అధికరణను పునరుద్ధరించాలనే మా ఉద్యమం నుంచి 70 వారాలు లేదా 70 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పట్టినా వెనుకంజ వేయబోమని మెహబూబా, ఫరూఖ్‌ ‌చెప్పారన్నారు.

డీలిమిటేషన్‌ ‌కమిషన్‌ ‌గురించి నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఫరూఖ్‌ అబ్దుల్లాకు అప్పగించిందన్నారు. జమ్మూ-కశ్మీరు నేతలందరి తరపున గులాంనబీ ఆజాద్‌ ‌మాట్లాడారని, డీలిమిటేషన్‌ ‌జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించి, అనంతరం రాష్ట్ర హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించబోమని చెప్పారని తెలిపారు. మొదట డీలిమిటేషన్‌, ఆ ‌తర్వాత రాష్ట్ర హోదా, అనంతరం ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply