ష్ట్రంలో ఒక పక్క ఎండల వేడి పెరుగుతుంటే నాగార్జున సాగర్‌లో అంతకన్నా ఎక్కువగా ఎన్నికల వేడి రాజుకుంటున్నది. శనివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ వేడి మరింత పెరిగింది. పోటీ పడుతున్న ప్రధాన రాజకీయపార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్ళు ప్రతిసవాళ్ళతో ఆ నియోజకవర్గమంతా ఉడికిపోతున్నది. తమ సిట్టింగ్ స్థానమైన సాగర్‌ను మళ్లీ దక్కించుకోవడానికి అధికార టిఆర్ఎస్ విశ్వప్రయత్నం చేస్తున్నది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినప్పటికీ, మిగతా రాజకీయ పార్టీలకన్నా ముందునుండే ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. దుబ్బాక ఎన్నికల్లో పరువు పోవడంతో ఈ ఎన్నికను ఆపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఎట్టి పరిస్థితిలో ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో వ్యూహరచన చేస్తుంది. ప్రతీ ఇరవై అయిదు మంది వోటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించి ఒక్క వోటరు కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడుతుంది. నియోజకర్గ బాధ్యతలను జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కళ్ళపల్లి రవీందర్‌రెడ్డిలకు అప్పగించినప్పటికీ ఇతర మంత్రులతో పాటు పలువురు ఎంఎల్ఏలకు బాధ్యతలను అప్పగించారు. నియోజకర్గంలో యాదవ సామాజిక వర్గాలకు చెందిన వోటర్లు ఎక్కువగా ఉండడం వల్లే తమ అభ్యర్థి నోముల భరత్ రాజకీయాలకు కొత్తవాడైనా ఆయనకే పార్టీ టికెట్ కేటాయించింది. అయితే నియోజకవర్గంలో నోముల నర్సయ్యకున్న అనుబంధ సెంటిమెంట్ ఇక్కడ ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలను ఎదుర్కుంటుంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా కులాల వారీగా వోటర్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వివిధ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తుందన్న విమర్శలున్నాయి. ఎస్సీ వోటర్లను ఆకట్టుకునేందుకు శాసనసభ్యులు బాల్కసుమన్, కోనేరు కోనప్ప, కోరుకంటి చందర్ లాంటి వారిని రంగంలోకి దింపారు. అలాగే ఎన్. భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌లతో ఆయా వర్గాలవారిని ఆకట్టుకునేందుకు వినియోగించుకుంటున్నారంటూ పోటీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇక వోటు అడిగే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత జానారెడ్డి.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత తెలుపాలంటే కాంగ్రెస్‌కు వోటు వేయాలంటూ వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆ నియోజకవర్గం నుండి ఏడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచిన జానారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏడేళ్ళ టిఆర్ఎస్ పాలనకు ముందే ఈ నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్థి చేశానని చెబుతూ, ఎలాంటి ప్రచారం లేకుండా వొదిలేస్తే ప్రజలే న్యామమైన తీర్పు ఇస్తారంటూ టిఆర్ఎస్కు సవాల్ విసరడమే కాకుండా ఆయన అదే ధీమాను వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, వోటర్లను ప్రలోభానికి గురిచేయకుండా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలన్నదే తన భావనంటున్నారు జానారెడ్డి. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ప్రజలు తప్పకుండా ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్న నమ్మకాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. కాగా, తమ పార్టీ కార్యకర్తలు, వోటర్లు చెక్కుచెదరలేదని, ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామంటున్నది తెలుగుదేశం పార్టీ. తమ పార్టీకి పూర్వవైభవాన్ని తప్పకుండా తీసుకువస్తామంటూ నమ్మకంగా చెబతున్నాడు ఆ పార్టీ అభ్యర్థి ముక్తా అరుణ్‌కుమార్. అధికార పార్టీ డబ్బు, మద్యం పంచడంతోపాటు మంత్రులు, ఎంఎల్ఏలను దింపుతున్నదంటే టిఆర్ఎస్ ఇంతకాలంగా ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని అర్థమవుతున్నదంటూ ఆరోపిస్తున్నారు టీడీపి అభ్యర్థి. అయినా నిరుపేద వర్గాలకోసం పుట్టిన పార్టీని తప్పకుండా కాపాడుకుంటామంటూ వోటర్లు ఉత్సాహంచూపిస్తున్నారంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో వూపుతగ్గిన బిజెపి ఈ ఎన్నికలు వొచ్చేనాటికి అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతుంది. టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్ వందలాది మంది కార్యకర్తలతో గులాబీ కండువ కప్పుకోవడం, మరో నాయకురాలు కంకనాల నివేదితా రెడ్డి పార్టీ అనుమతిలేకుండానే నామినేషన్ వేయడం ఆపార్టీలో ఏర్పడిన మనస్పర్థలు ఇప్పుడాపార్టీ అభ్యర్థి పొనుగోతు రవికుమార్ నాయక్ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఏపి రాష్ట్రంలో ఇదే సమయంలో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న బిజెపి పార్టీకి అక్కడ మద్దతిస్తున్న జనసేన, సాగర్ ఎన్నికల విషయంలో మాత్రం మౌనంగా ఉంది. జనసేన అధినేత తెలంగాణ బిజెపిపైన అలిగారన్న ప్రచారం జరుగుతుంది. అయితే బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయన్ను అనునయించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆయన ప్రయత్నం ఫలిస్తే జనసేన ప్రచార ప్రభావం ఆ పార్టీకి ఏమేర ఉపయోగపడుతుందన్నది ఫలితాల్లోగాని తేలదు.