Take a fresh look at your lifestyle.

అలిశెట్టి కవిత్వంలో ఎన్నికల ‘ఎండమావులు’

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వంతో యువతరం పాఠకుల్లో అగ్గిని రాజేసిన అక్షర యోధుడు అలిశెట్టి ప్రభాకర్‌.  12 ‌జనవరి 1954లో జన్మించి అనారోగ్య సమస్యలతో అనునిత్యం పోరాడిన కవి ముప్పైయి తొమ్మదేళ్లకే కన్నుమూశారు. అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వంలో ఆయన నిబద్ధత, జీవితంలోని ఆత్మగౌరవం నేటి యువతరం కవులకు ఆదర్శనీయము, ఆచరణనీయమైన వ్యక్తిత్వమని  ఆయన సన్నిహిత మిత్రులు చెబుతుంటారు. ఇరవై తొమ్మిదేళ్ల (1993) క్రితం మన నుంచి భౌతికంగా దూరమైనా ప్రభాకర్‌ ‌కవిత్వంలోని ప్రతీ అక్షరం నేటికి ప్రాసంగికతను కోల్పోకుండా సామాజిక చలనంలోనే ఉంది. పదునైనా అభివ్యక్తి కలిగిన అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వం నిత్యం ప్రసారా మాద్యామాల్లో, ప్రజల నాలుకల మీద సభలు సమావేశాల్లో, వక్తల ఉపన్యాసాల నుంచి అలవోకగా గుర్తు చేస్తుంటారు. ఇప్పటికీ ఆయన కవిత్వానికి ప్రాసంగికత ఉండటం వల్లనే కదా ఆయన కవిత్వం ప్రజల నాలుకలపై ప్రవహించేది. సమాజ మార్పులో భాగస్వామ్యం కావాల్సిన సామాన్య, మధ్యతరగతి ప్రజలను రాజకీయ చైతన్యం కలిగించే దృష్టితో కవి అలిశెట్టి  తన భావాలను పదును పెట్టి అద్భుతమైన కవితలు రాశారు. ఆయన పండితుల కోసమో, పాండిత్య ప్రదర్శన కోసమో కవిత్వం రాయలేదు. కళ్లెదుట కనిపిస్తున్న అన్యాయాలను, అక్రమాలనులోకానికి చాటి చెప్పడానికి కవిత్వాన్ని ఆయుధంగా మలచుకున్నాడు. అట్టడుగు ఆర్థిక సమస్యల జీవితం నుంచి వచ్చిన ప్రభాకర్‌ను ఆయన కలలు కన్న ఆశయం నుంచి వచ్చిన కవిత్వం అత్యున్నత స్థాయిలో నిలిపింది. కుళ్ళిపోయిన ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలకు శస్త్రచికిత్సే శరణ్యమని అక్షరాల్లో ఆక్రోశించాడు. ఆయన ప్రతీ వాక్యంలోని అక్షరం పీడితుల పక్షమై నిలిచింది. ప్రజాస్వామ్యం ముసుగులో దోపిడీ స్వభావం కలిగిన పాలకులు చేస్తున్న అరాచకాల్ని, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించడం అలిశెట్టి కవిత్వంలోని ప్రత్యేకత.

తెలుగు కవిత్వంలో సామాన్యుల నుంచి పండితుల వరకు అలిశెట్టి వచన కవిత్వంలోని చురకలను, వ్యంగాన్ని, ఎత్తిపొడుపులను ప్రయోగించిన తీరులో తనకు తానేసాటి అనిపించుకున్న ప్రజాకవి ప్రభాకర్‌. ‌వాక్యంలో అల్ప పదాలతో అనంతమైన భావ విస్తృతిలో పాఠకుణిలో ఆలోచనలు రగిలించే కవిత్వం ఆయనది. ఆగ్రహంలో నుంచే సుందర స్వప్నాల ప్రపంచాన్ని కలగనడం పాఠకులకు నేర్పుతుంది అతని కవిత్వం. కలలే కదా మనిషిని సజీవంగా, సంతోషంగా తన ఆశలు, ఆశయాల ప్రపంచం వైపు నడిపించేది. ప్రభాకర్‌ ‌కవిత్వంలోని నిబద్ధత, అభివ్యక్తి, ఆగ్రహం వెనకాల కరీంనగర్‌, ‌జగిత్యాల రైతాంగ పోరాట ప్రభావాల నేపథ్యం ఉంది. ఆనాటి స్థల, కాలాలు కవి అలిశెట్టిని బలమైన విప్లవకవిగా తీర్చిదిద్దాయి. మినీ కవిత్వం ఉద్యమమై వైయుక్తిక భావాలను రాస్తున్న కాలంలో అక్షరాలను ‘చురకత్తి’గా మార్చుకొని ప్రతిఘటనా యుద్ధాన్ని కొనసాగించారు. అలిశెట్టి అక్షర ఉద్యమం ప్రజాస్వామ్యంలో కుళ్లిపోయిన సర్వాంగాలపై కలంపోటుతో పొడిచారు.
ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఎన్నికల్లోని డొల్లతనాన్ని, రాజకీయ నాయకుల రంకులీలలను బాహాటంగా నిలదీశారు. అయితే 1989లో ‘ఎన్నికల ఎండమావి’ శీర్షికతో అలిశెట్టి ప్రభాకర్‌ ‌కొన్ని కవితలను ప్రచురించారు. అవిశెట్టి మిత్రులు ‘అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత’ పేరుతో జులై, 2015లో అతని కవిత్వాన్ని పునర్ముద్రించారు. ఆ సంకలనంలో ‘ఎన్నికల ఎండమావి’ లభ్యంకాకపోవడంతో ముద్రణకు నోచుకోలేదు. మొత్తంగా ఆరు సంకలనాలు మాత్రమే ఒక పుస్తకంగా మన ముందుకు వచ్చింది. ఆ కవిత సంకలనంలో సుమారుగా ఇరవై ఎనిమిది కవితలు ఎన్నికలు, రాజకీయాలు, రాజకీయనాయకులు, పాలకుల తీరుపై తీవ్రమైన ఆగ్రహంతో కవిత్వంలో నిప్పులు చెరిగారు. ఎన్నికల రాజకీయాలపై నలభై ఏళ్ల క్రితం అలిశెట్టి ప్రభాకర్‌ ‌రాసిన కవిత్వం నేటికి అదే రిలవెన్స్ ‌కనిపిస్తుంది. ఎన్నికలు, బూర్జువా రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అంతా సమయం వృధా అనే పరిస్థితికివిలువలు దిగజారిపోయాయి.

ఓటు వేసే ముందు విచక్షణతో ఆలోచించి వేస్తేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. ‘జాగ్రత్త’ కవితలో ఓటర్లను హెచ్చరిస్తాడు. ‘‘జాగ్రత్త / ప్రతీ ఓటూ/ ఒక పచ్చి నెత్తురు మాంసం/ చూస్తు చూస్తూ వేయకు ఎదో గద్దకు / అది కేవలం కాగితం మాద గుర్తు కాదు/ జీవితం కింద ఎర్తు’’ అని ఓటు విలువను చాటి చెబుతాడు. రాజకీయ నాయకుల నినాదాలకు, వాళ్ల వాగ్దానాలకు అసలు బలికా వొద్దంటాడు. రాజకీయ నైతిక విలువలకు కట్టుబ డని ఖద్దరు బట్టల నాయకులు ఎన్నికల్లో అమలు సాధ్యంకాని హామీలిచ్చి నెరవేర్చకున్నా వాళ్లకు ఏలాంటి శిక్షలు లేని భూస్వామ్య, నియంతృత్వ భావజాలం నిండిన ప్రజలస్వామ్యం. దళారీ రాజకీయ నాయకుల స్వభావాన్ని జంతువులతో పోల్చి చెప్పడం అద్భుతంగా శిల్పాన్ని పండి ంచారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో రాసిన ‘రాజకీయం’ కవిత నేటి కీ చదివించే గొప్ప గుణం వుంది. కవిత్వం కప్పి చెప్పడమే కాదు, చెర్నాకోల తీసుకొని మొద్దు నిద్ర నుంచి మేల్కోల్పినట్లుగా కవిత చదివిన పాఠకులను ఆలోచనల్లో పడేస్తుంది. ‘‘ఒక నక్క/ ప్రమాణ స్వీకారం చేసిందట / ఇంకెవర్నీ మోసగించననీ/ ఒక పులి / పశ్చాతాపం ప్రకటించిందట / తోటి జంతువుల్ని సంహరించినందుకు / ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ్‌’’ అం‌టాడు.

ప్రశ్నించి, ప్రజాపక్షం వహించే ఉద్యమకారులను బూటకపు ఎదురుకాల్పుల్లో చంపేసి పశ్చాతాపం ప్రకటించడం దోపిడీ పాలకులకు పరిపాటిగా మారిపోయింది. గాంధీ టోపీలు ధరించి ప్రజల మధ్యకు వచ్చే తెల్లబట్టల నాయకులు, ఓట్ల కోసం దెబేరించే తీరు బిచ్చగాళ్ల కంటే అధ్వాన్నంగా తయారయ్యారు. కూటికిలేని వాడు ఆకలి తీర్చుకోవడానికి అడుక్కోవడం పట్ల ప్రజలకు సానుభూతి వుంటుంది. కానీ గాంధీగిరి వేశాల టోపిలను ‘ఎన్నికల్లో ఓట్లడు క్కునే చిప్ప’ అని అభివర్ణిస్తూ ఎద్దేవా చేస్తాడు. శవ రాజకీయాలతో ప్రజల్ని మభ్యపెడుతున్న కాలం. అధికార పీఠాలను కాపాడుకోవడానికి శవాలపై ఆసనాలు వేస్తూ క్షుద్ర పూజలు చేసే అరాచక ప్రజాప్రతినిధుల అజ్ఞానాన్ని అక్షరాల్లో నిలదీయడం అలిశెట్టి ప్రభాకర్‌ ‌ప్రత్యేకత. ఎన్టీఆర్‌ ‌హాయాంలో ఉస్మానియా ఆస్పత్రి నుంచి  శవాలు మాయమైన సంఘటనలు కవిత్వానికి నేపథ్యంగా నిలిచాయి. ‘అరాచకత్వం’ కవితలో  ‘‘శవాలపై ఆసనాలు వెయ్యడం / శవాలపై శాసనాలు చెక్కడం / శవాలపై స్వారీ చెయ్యడం / రాజకీయాలుగా పరిగణించబడితే / ఈ దేశంలో / సోగేసిన శవాల గుట్టవంటి / బ్యాలెట్‌ ‌పెట్టెపై / ఆధిపత్యమే ఒక అరాచకత్వం’’ అని నిరసన వ్యక్తం చేస్తాడు. ఎన్నికల్లో అరాచకవా దుల ఆధిపత్యాలు, వీధి రౌడీల నుంచి మొదల యి ఖూనీకోర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ అరాచకీయాల్లో అరితేరినవాడే మంత్రుల వుతారని ప్రజాప్రతినిధుల మేరు ముసుగులను తొలగించి బట్టబయలు చేస్తాడు కవి.

ఎన్నికల ప్రచారంలో కుల, మతాల ప్రతీకల్ని వాడుకొని ఓటర్లను తప్పుదోవ పట్టించి, మోసగించడం ఓటు బ్యాంకు పార్టీలకు అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా మతతత్వ్త పార్టీలకు, నాయకులకు ఉన్మాదపు భక్తుల్ని తమవైపు ఆకట్టుకోవడానికి ఎన్నికల్లో విలువలు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ‘అట్ట పర్వతం’ కవితలో ‘‘అట్ట పర్వతం పట్టుకున్నవాడు / ఆంజనేయుడు కాదు / నెత్తిలో నెమలీక పెట్టుకున్నవాడు / కృష్ణ పరమాత్ముడు కాదు/ అదంతా / ఎన్నికల అట్టహాసం’’ అని ప్రజాస్వామ్యంలోని ఎన్నికల నాటకీయ సారాం శాన్ని ఎండగడుతాడు కవి. ఆంధ్రజ్యోతి దినపత్రిక సిటీలైఫ్‌ ‌శీర్షికలో వచ్చిన వచన కవితలు నగరంలోని సామాన్య, మధ్యతరగతి జీవితాలే భూమికగా రాసిన నగర జీవుల అక్షరాలు నేటికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది అలిశెట్టి ప్రభావకర్‌ ‌కవిత్వం. అల్ప అక్షరాల్లోనే అనంతమైన భావాలను పొదిగి పాఠకులను కొత్త ఆలోచన దారుల్లో నడిపించారు. మన దేశంలో కుళ్లిపోయిన ఎన్నికల వ్యవస్థలోని లోపాలు, రాజకీయ పార్టీల విలువల అరాచకం పట్ల అలిశెట్టి ప్రభాకర్‌కు తీవ్రమైన నిరసన ఉంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ వాటిల్లోని అక్రమార్గాలు, లోసుగులను, నాయ కుల మోసపు హామీలను చిన్న చిన్న పదాల్లోనే విస్తృతమైన భావాలను గుభాలింప చేయడం ఆయన ప్రత్యేకత. ప్రజల్ని ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయమంటాడు. మన భారతీయ సమాజంలో ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ ప్రాతిపదికగా సాగుతున్న మాయదారి పండగ. ‘లిబర్టీ ఆఫ్‌ ‌స్టాచ్యు’ ఒక స్వేచ్ఛ ప్రతీక పోరాట చిహ్నం కానీ మన దేశంలో మద్యం సీసా కనిపిస్తే ఓటరు మహాశయుడు గుర్తొస్తాడని చెప్పడం కవిఅలిశెట్టి శిథిలమైన ఎన్నికల నియమావళిని నలభై ఏళ్ల క్రితమే చెప్పారు. అయితే నేటికి యధాతధస్థితి మాత్రమే మన కళ్లెదుట కనిపిస్తున్న నిజదృశ్యం. ఎన్నికలు సామాన్యుల పాలిట ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనే ఒక దుస్థితి. ఎన్నికల్లోని పెట్టుబడి పార్టీల ఆధిపత్య నాయకుల కుట్రలకు బలయి అట్టుడుగు పేదల రక్తం చిందడమే ఈ దేశపు ప్రజాస్వామ్యపు అసలు రంగని, ఎన్నికల రహస్యాన్ని బద్దలు కొడుతాడు.  ‘‘బాంబులూ బరిసెలూ / గొడ్డళ్లే / ఎన్నికల కళ్ళు / ప్రవహించే నెత్తురే / ప్రజాస్వామ్యపు రంగు / శ్మశాన పత్రంలో / కపాలమే ఓ గుర్తు’’ అని ఎన్నికలు నిరుపేద ప్రజల పాలిట ప్రమాదకరమైన తంతుగా మారాయని హెచ్చరిస్తాడు.

ఎన్నికల ప్రచారంలో హామీలతో బురడీ కొట్టించే నాయకుల ప్రసంగాలకు, మోసపూరిత వాగ్దానాలకు సామాన్యులైన ఓటర్లకు ప్రతీసారి ఓటమే. అదుపులోని లేని అధిక ధరలు పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తున్నాయి. నమ్ముకున్న ఓటర్లను ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత వివిధ రకాలైన టాక్స్‌ల పేరుతో  నట్టేట ముంచుతున్న తీరు మీద కవి ఆవేదన వ్యక్తం చేస్తాడు. ‘‘ఉండబట్ట లేక / ఓటేస్తే / ఉన్న బట్టా / లాక్కునట్లు’’ అని విమర్శిస్తాడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల తంతు నియమ నిబంధనల్లో చెప్పుకున్నంత గొప్పగా అమలు చేయడంలో బ్యూరోక్రసీ వైఫల్యం చెందుతోంది. దేశంలోని బ్యూరోక్రాట్లు స్వతంత్రంగా అధికారాలను అమలు చేయకుండా భూస్వామ్య, పెట్టుబడిదారి భావజాలం నిండిన రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు. ప్రజా సమస్యలపై మొసలి కన్నీళ్లు పెట్టుకునే దళారులు ప్రజలను ఎన్నికల్లో మాటల మాయాజాలంతో అధికారం చేజిక్కించుకుంటున్నారు. అక్రమార్గాల్లో దేశ సంపదను కొల్లగొడుతున్న అవినీతి పరులు ఓటుకు నోటు ఆశచూపి పార్లమెంటులో పాగావేసి ధనార్జనకు పాల్పడుతున్నారు. ఈ అప్రజాస్వామిక పరిస్థితులను పరిశీలించిన నిబద్ధత కలిగిన కవిగా ప్రజాపక్షంగా నిలబడి ప్రశ్నించారు. చట్టసభల్లోకి మొసళ్ళు, తిమింగలాల చొరబాటుకు పరోక్షంగా ప్రజలేనని నిజాయితీగా ప్రకటిస్తాడు. ‘‘అయిదేళ్లకోసారి / అసెంబ్లీలో మొసళ్ళు / పార్లమెంటులోకి తిమింగలాలూ / ప్రవేశించటం పెద్ద విశేషం కాదు / జనమే / ఓట్ల జలాశయాలై / వాటిని బతికించటం / విషాదం..?’’ అని నిర్ధ్వందంగా హెచ్చరిస్తాడు.  ప్రజల్లో రాజకీయ చైతన్యం రానంత వరకు చట్టసభలు ప్రక్షాళన చేయడం సాధ్యం కాదంటాడు. ఓటింగ్‌లో పాల్గొని మోసపోవడానికి పద్దెనిమిదేళ్ల పౌరుడే కానక్కరలేదు. అజ్ఞానులైన ఓటర్లు అందరూ బాధితులే అవుతారని చురకలు అంటిస్తాడు అలిశెట్టి. ఎన్నికల పండగలో నాయకులు ఓటరు మహాశయులను నెలరోజుల పాటు దేవుళ్లుగా కొలుస్తూ కీర్తిస్తారు. కడుపులో తలపెట్టి కాళ్ళకు దండం పెడుతారు. ఎన్నికల తంతు పూర్తయ్యాక పాలకులు పాలితులైన ప్రజల్ని చీమల కన్న అధ్వాన్నంగా అన్ని రకాలుగా నలిపేస్తారని కవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.  ‘‘రాక్షసంగా ఎదిగిన ఎన్నికల పాదాల కింద / నువ్వెప్పుడూ చీమవేరా ఓటరూ!’’ కవి ప్రజల్ని రాజకీయ చైతన్యంతో మేల్కొల్పుతున్నాడు.

అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వంలో జీవం ఉండటానికి కారణం అందులో పీడిత ప్రజల కన్నీళ్ల తడియే నేపథ్యంగా కనిపిస్తుంది. కష్టజీవుల పక్షాల నిలబడి అక్షరాలను సాయుధం చేసినవాడు. ప్రతీ అక్షరాన్ని సైతం పదునైనా ఈటెలుగా మార్చడంలో అలిశెట్టికి ప్రజల జీవితంలోని కష్టాలు, కన్నీళ్లను, ఆవేదలను దగ్గరగా ఉండి చూసినవారు మాత్రమే రాయగల కవిత్వం. ఈ దేశంలో రావాల్సిన నూతన ప్రజాస్వామిక విప్లవంపై అచంచల విశ్వాసం కలిగిన రచయిత కావడం వల్లనే తుదకంటూ పీడితుల చేతుల్లో తన అక్షరాలను ఆయుధాలుగా చేసి అందించి పోయాడు. మార్క్సిస్టు సాహిత్య రాజకీయాలపై అవగాహన కలిగిన బుద్దిజీవి కావడం వల్లనే సన్మానాలు, సాహిత్య పురస్కారాల కోసం వెంపర్లాడలేదు. అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వాన్ని, జీవితాన్ని కొత్తతరం కవులు, రచయితలు , పాత్రికేయులు అవగాహన చేసుకొని ఆయన అక్షరాల బాటలో నడవటమే నిజమైన నివాళి.
– కోడం కుమారస్వామి,9848362803

Leave a Reply