Take a fresh look at your lifestyle.

విశ్వసనీయత కోల్పోతున్న ఎన్నికల సంఘం..

మీడియాను కట్టడి చేయాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషన్‌ ‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించవద్దని ఆదేశించాలని ఈసీ చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశంలో కోవిడ్‌ ‌కేసులు పెరగడానికి ఈసీ బాధ్యురాలని మద్రాస్‌ ‌హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. మీడియాను నియంత్రించడం తిరోగమన చర్య అవుతుందని స్పష్టం చేసింది. మద్రాస్‌ ‌హైకోర్టు ఏప్రిల్‌ 26‌న ఓ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్‌-19 ‌కేసులు విపరీతంగా పెరగడానికి కారణం ఎన్నికల కమిషనేనని పేర్కొంది. అత్యంత బాధ్యతారహితమైన సంస్థగా అభివర్ణించింది.

ఎన్నికల కమిషన్‌ అధికారులు హత్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ అపీలు చేసింది. జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈసీ అపీలుపై విచారణ జరిపింది. మద్రాస్‌ ‌హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా పరుషంగా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు జ్యుడిషియల్‌ ఆర్డర్‌లో లేవని, అందువల్ల వాటిని తొలగించబోమని చెప్పింది. కోర్టు వ్యవహారాలను ప్రచురించే హక్కు మీడియాకు ఉందని తెలిపింది. సరైన ఆలోచన లేకుండా చేసే వ్యాఖ్యలు అపార్థాలకు దారి తీస్తాయని పేర్కొంది. ఈ ధర్మాసనంలోని మరొక న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ ‌షా మాట్లాడుతూ, విచారణల సమయంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించరాదని తెలిపారు. వ్యాఖ్యలు చేయకుండా హైకోర్టులను, వ్యాఖ్యలను రిపోర్టింగ్‌ ‌చేయకుండా మీడియాను నియంత్రించడం తిరోగమన చర్య అవుతుందని పేర్కొంది.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రభుత్వాలను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తుంటారు. కానీ, భారత్‌ ‌లో విచిత్రం ఏమంటే ప్రజలను ఏ వైరస్‌ ‌కావాలో ఎంచుకోమంటుంటారు.సుప్రీంకోర్టు  రాష్ట్రాల హైకోర్టులు కోవిడ్‌-19 ‌పై జాతీయ విధానం అవసరం గురించి చేసిన ప్రకటనను సమర్ధించగా, మద్రాసు హైకోర్టు ఎన్నికల కమిషన్‌ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించిన తీరును తప్పు పట్టింది. తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోర్టులు కోవిడ్‌ ‌సంబంధిత కేసులను చేపడితే, ఇది జాతీయ సంక్షోభమన్న సంగతి పట్టించుకోకుండా, సుప్రీంకోర్టుకు బదులు మద్రాసు హైకోర్టు ఎన్నికల కమిషన్‌ ‌పై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఈసీ సకాలంలో తగిన చర్యలు తీసుకుని ఉంటే కోవిడ్‌ ‌రెండో దశ ఇంత తీవ్రంగా వ్యాపించి ఉండేది కాదేమోనన్న అభిప్రాయం జనంలో కలుగుతోంది.

ఏప్రిల్‌ 27‌వ తేదీన మద్రాసు హైకోర్టు దేశంలో రెండవ దశ కొరోనా విజృంభణకు ఈసీయే కారణమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈసీ అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేయడంతో ప్రకంపనాలు మొదలయ్యాయి. హైకోర్టు వ్యాఖ్యలు బాగా ఆలస్యమయ్యాయి. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. న్యాయం ఆలస్యం జరిగితే న్యాయాన్ని కాదన్నట్టే అన్న న్యాయశాస్త్ర సామెత రుజువైంది. అయితే, రాజ్యాంగ బద్దమైన సంస్థ కఠినమైన ప్రశ్నలకోసం గొంతెత్తడం జనానికి ఊరట కలిగించింది. ఈసీ మీద పార్టీల నాయకులూ,అభ్యర్ధులూ తరచూ విమర్శలు చేయడం సహజమే కానీ, రాజ్యాంగ బద్దమైన సంస్థ నుంచి ఇంత పెద్ద మొత్తంలో విమర్శలు రావడం ఇదే ప్రథమం.

ఇటీవల కాలంలో ఏ కోర్టు,ఏ న్యాయమూర్తి ఈ మధ్య ఇంత తీవ్ర మైన పదజాలాన్ని వినియోగించలేదు.ఎన్నికల నిర్వహణకు చొరవ తీసుకున్నది ఈసీయేనా లేక ప్రభుత్వమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.. కోవిడ్‌ ‌వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని సూమోటోగా పరిగణించి గౌరవనీయమైన రాష్ట్ర హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఎన్నికల సంఘంపై ఇది తీవ్రమైన అభిశంసన. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు గడిచిన నెలరోజులుగా వివిధ దశల్లో సుదీర్ఘ కాలం జరిగాయి. అయితే,బెంగాల్‌ ‌బీజేపీ మాత్రం కోర్టు వ్యాఖ్యలను తప్పు పట్టింది.ఇది పెద్దకుట్ర అనీ, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్‌ ‌చేసింది. అయితే, ఎవరి ప్రయోజనాలను పణంగా పెట్టి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయంలో ఈసీ బాధ్యత స్వల్పమే. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియను సాగదీయడం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల కోసం  చేసిందేనని జనానికి అర్ధం అయింది. కోర్టులు జోక్యం చేసుకునే వరకూ ఆగకుండా ఈసీ మధ్యలో జోక్యం చేసుకుని తన జవాబుదారీ తనాన్ని నిరూపించుకుని ఉండాల్సింది. ఎన్నికలను నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దమైన బాధ్యత అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ, కోవిడ్‌ ‌రెండవ దశ తీవ్రత ఎక్కువగా న్నప్పుడు అటువంటి సుదీర్ఘ కార్యాచరణను ఎన్నికల సంఘం తలపెట్టి ఉండాల్సింది కాదు రాజకీయ నాయకులు కూడా కోవిడ్‌ ‌నిబంధనలను ఉల్లంఘించి జనబాహుళ్యం ఎక్కువగా ఉన్న సభల్లో ప్రసంగించారు.

మార్గదర్శకాలను తుంగలోకి తొక్కారు. ఎన్నికల సంఘం చేసిందేమీ లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన తర్వాతే ఈసీ స్పందించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిమతానికి వ్యతిరేకంగా పని చేయడానికి ఈసీ విముఖంగా ఉందనే అభిప్రాయం జనంలో ఉంది. ఈ నేపధ్యంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆలస్యమనిపించినా ఎవరో ఒకరు గళమెత్తినందుకు సంతోషించాల్సిందే. కొరోనాని అరికట్టడంలో రాష్ట్రాల వైఫల్యాలు ఒక్కొక్కటీ బయటపడిన తర్వాత హైకోర్టు తన బాధ్యతగా గళమెత్తింది.ఎన్నికల కమిషనే స్వయంగా ఈ పని చేసి ఉంటే ఇలాంటి అభిప్రాయం కలిగి ఉండేది కాదు. జనంలో అసంతృప్తి పెరిగి ఉండేది కాదు.

Leave a Reply