Take a fresh look at your lifestyle.

ఎదురు చూస్తున్న రోజు రానే వొచ్చింది

రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజురాబాద్‌ ఉపఎన్నిక తేదీని ఎట్టకేలకు ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. అక్టోబర్‌ ‌ముప్పైన ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌లో వివరించింది. ఇందుకుగాను అక్టోబర్‌ ఒకటిన నోటిపికేషన్‌ ‌విడుదల చేయనుండగా, నామినేషన్లు దాఖలుకు ఆక్టోబర్‌ ఎనిమిది చివరి తేదీగా పేర్కొంది. అలాగే ఉప సంహరణకు అక్టోబర్‌ 13 ‌తేదీని ప్రకటించింది. తెలంగాణలో జరిగే ఈ ఎన్నికతోపాటు, ఏపిలోని బద్వెల్‌ ఉప ఎన్నికకు, దేశ వ్యాప్తంగా 3 లోక్‌ ‌సభ, 28 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ తేదీలనే ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 2‌న వెలువడనున్నాయి. ఈటల రాజేందర్‌ ‌తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే కడప జిల్లాలోని బద్వెల్‌ ‌శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న డాక్టర్‌ ‌జి. వెంకట సుబ్బయ్య గుండెనొప్పితో ఆకస్మికంగా మరణించడంతో అ స్థానంలో కూడా ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఆర్థోపెడిక్‌ ‌డాక్టర్‌ అయిన వెంకట సుబ్బయ్య బద్వెల్‌ ‌నియోజకవర్గంలో 2019లో ఎన్నికైనారు. కాగా ఈటల రాజేందర్‌ ‌హుజూరాబాద్‌ ‌నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచినప్పటికీ, ఆయనపైన వొచ్చిన అవినీతి, భూ అక్రమణ కేసుల రిత్యా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను మంత్రి వర్గంనుండి బహిష్కరించింది.

బహిష్కృతుడైన ఈటల రాజేందర్‌ ఆ ‌క్షణం నుండి హుజూరాబాద్‌ ‌నియోజకవర్గాన్ని కాలికి బలపం కట్టుకున్నట్లుగా చుట్టబెడుతూనే ఉన్నాడు. ఆయన తనకున్న స్వంత బలంతో పాటుగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీలో నిలవడం వల్ల ఇక్కడ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెగ ఉత్సాహ పడుతున్నాయి. కాగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా ఈ పోటీ కొనసాగునుంది. ఈ మూడు పార్టీలు ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. వాస్తవంగా పార్టీలో చాలా సీనియరే కాకుండా హుజూరాబాద్‌, ‌కమలాపూర్‌ ‌నియోజకవర్గాల నుండి ఇంతవరకు ఓటమి ఎరుగని వీరుడిలా దాదాపు ఆరు సార్లు గెలిచిన వ్యక్తి ఈటల రాజేందర్‌. ‌తెలంగాణ ప్రభుత్వంలో కెసిఆర్‌ ‌తర్వాత వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండింది. అయితే అంతర్గత రాజకీయాలకు అయన బలైనాడన్న వాదన ఒకటి ఉంది. ఆ కారణంగా మంత్రి పదవితోపాటు ఇతర పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అయినా ఈ స్థానం నుండి గెలిచి తన సత్తా చాటాలన్న ధృడ సంకల్పంతో ప్రచారంలో మునిగిపోయారు. ఈటల సుదీర్ఘకాలం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన కారణంగా తెరాస ఈ స్థానంలో పోటీ అభ్యర్థి కోసం కొంతకాలం వెతుకులాడక తప్పలేదు.

చివరకు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు జి. శ్రీనివాసయాదవ్‌ను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పేవిగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ప్రచారంలో తీవ్ర పోటీ కొనసాగుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలోనే బిజెపి రాష్ట్రంలో పాదయాత్రలు, ప్రజా చైతన్య యాత్రలను చేపట్టి కొనసాగిస్తున్నది. కాగా అవినీతి ఆరోపణలపై తాము బహిష్కరించిన వ్యక్తి ఇక్కడ గెలుపొందితే అది పాలనపైన తీవ్ర ప్రభావం చూపుతుందని అధికార పార్టీ భావిస్తుంది. అందుకు గాను ఎలాంటి క్లిష్టపరిస్థితిలో నైనా తమ అభ్యర్థిని గెలిపించే సత్తా ఉన్న, ప్రబుల్‌ ‌షూటర్‌గా పేరున్న మంత్రి హరీష్‌ ‌రావుకు శ్రీనివాస యాదవ్‌ను గెలిపించే బాధ్యతను అప్పగించింది టిఆర్‌ఎస్‌. ఉద్యమ కారుడిగా ఆయన తనకున్న అపార అనుభవంతో సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చేస్తూ స్థానిక కార్యకర్తలను, ప్రజలను ఉరుకులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇక్కడి నుండి పోటీ అభ్యర్థిని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్‌ ఇం‌కా ఏమీ తేల్చుకోలేకపోతున్నది. బలమైన టిఆర్‌ఎస్‌, ‌బిజెపి అభ్యర్థులను ఎదుర్కుని నిలబడగల సత్తా ఉన్న అభ్యర్ఠి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రానట్లుగానే కనిపిస్తున్నది. అయితే మాజీ మంత్రి కొండా సురేఖ పేరు మాత్రం ప్రచారంలో ఉంది. కొండా సురేఖ గతంలో ప్రాతినిధ్యం వహించిన శాయింపేట నియోజకవర్గానికి పక్కన హుజురాబాద్‌ ఉం‌డడంతో ఇక్కడ కూడా ఆమెకు అనుచర వర్గం ఉన్నదన్న అభిప్రాయముంది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆమెకు టికెట్‌ ఇస్తే నిజంగానే హుజూరాబాద్‌ ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో జరుగుతుందనడంలో అతిశయోక్తిలేదు. ఈటల రాజీనామ చేసినప్పటి నుండే ఇక్కడ ఎన్నికల వాతావరణం కొనసాగుతుండగా, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలవటంతో యుద్ధవాతావరణమే కనిపిస్తున్నది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందనుకుంటున్న ఈ ఎన్నికలో విజయం ఎవరి పక్షాన నిలుస్తుందో వేచి చూడాలి.

Leave a Reply