Take a fresh look at your lifestyle.

‌ప్రపంచ మానవాళి ముంగిట ‘ఎల్‌ ‌నినో’ విపత్తు..!

‘‘ప్రపంచ వాతావరణ సంస్థ’’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా

ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ ‌మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, ‌డబ్ల్యూయంఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరలో ‘ఎల్‌ ‌నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ ‌నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఈయన్‌యస్‌ఓ)’ ‌వలయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వాతావరణ మార్పులకు లోనవుతాయని విర్ణించబడింది. గత మూడేళ్లుగా కొనసాగుతున్న ‘లా నినా’ ప్రభావం క్రమంగా తగ్గుతూ రానున్న రోజుల్లో ‘ఎల్‌ ‌నినో’ చక్రం పునరావృతం కావచ్చని తెలుస్తున్నది. గత 8 ఏండ్లలో ప్రపంచం అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసిందని, ‘లా నినా’ ప్రభావంతో గత 3-ఏండ్లలో కొంత వరకు ఉష్ణోగ్రతలు తగ్గడం, అధిక వర్షపాతం నమోదు కావడం గమనించారు. 2016లో ‘ఎల్‌ ‌నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూశాం. రానున్న ఏండ్లలో ‘ఎల్‌ ‌నినో’ ప్రభావం పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా వేడి గాలులు, ప్రతికూల వాతావరణ మార్పులు, కరువు కాటకాలు, కొన్ని ప్రాంతాల్లో అకాల వర్ష భీభత్సాలు ఎదురు కావచ్చని హెచ్చరిస్తున్నారు.

 ‘ఎల్‌ ‌నినో’, ‘లా నినా’ అంటే…!
‘ఎల్‌ ‌నినో’ అనబడే స్పానిష్‌ ‌పదానికి ‘లిటిల్‌ ‌బాయ్‌’ అని, ‘లా నినా’ పదానికి ‘లిటిల్‌ ‌గర్ల్’ అని అర్థాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా కేంద్ర తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ ‌మహా సముద్ర ఉపరితలం అధిక తాపాన్ని లేదా వేడిని పొందడాన్ని ‘ఎల్‌ ‌నినో’గా అర్థం చేసుకోవాలి. సగటున ప్రతి 2 నుండి 7 ఏండ్లలో ఒకసారి ఏర్పడే ‘ఎల్‌ ‌నినో’ ప్రభావంతో దక్షిణ ఆసియా/ఆస్ట్రేలియా/ఇండోనేషియా ప్రాంతాలు తీవ్ర కరువును ఎదుర్కొంటాయని, మరో వైపు దక్షిణ అమెరికా/ఆఫ్రికా/సెంట్రల్‌ ఏసియా ప్రాంతాల్లో అతివృష్టి రావచ్చని తెలుస్తున్నది. ‘ఎల్‌ ‌నినో’ ప్రభావంతో సముద్ర ఉపరితల జలాలు వేడెక్కి పసిఫిక్‌ ‌మహాసముద్ర ప్రాంతంలో హరికేన్లు కూడా రావచ్చని తెలుస్తున్నది. ‘ఎల్‌ ‌నినో/లా నినా సదరన్‌ ఆసిలేషన్‌’ ‌వలయాల మూలంగా వేడి తగ్గుతూ చల్లదనం అనుభవంలోకి రావడాన్ని ‘లా నినా’ అని అర్థం చేసుకోవాలి. ‘లా నినా’ ప్రభావంతో సముద్ర ఉపరితలం చల్లబడి అధిక వర్షాలతో పాటు భూతాపం కూడా తగ్గడం గమనించవచ్చు.

ఇండియాపై ‘ఎల్‌ ‌నినో’, ‘లా నినా’ల ప్రభావం :
‘ఎల్‌ ‌నినో’ ఏర్పడితే నైరుతీ రుతుపవనాలు బలహీనపడి, భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదు కాబడి వ్యవసాయం దెబ్బతిని, కరువులు సంభవిస్తాయని నిర్థారణకు వచ్చారు. మార్చి మ్నెదటి వారం నుంచి ఇండియాలోని 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అతిగా వేడెక్కడం గమనించారు. మూడేళ్ల తరువాత మార్చి 2023లో ‘లా నినా’ ముగిసి రానున్న రోజుల్లో ‘ఎల్‌ ‌నినో’ ప్రభావం ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఎల్‌ ‌నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఈయన్‌యస్‌ఓ)‘ ‌వలయాల ప్రభావంతో మే/జూన్‌ 2023‌లో తటస్థ స్థితి నుంచి ‘ఎల్‌ ‌నినో’ బలపడుతూ సెప్టెంబర్‌ ‌నాటికి 80 శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. 2023 జూలైలో ‘ఎల్‌ ‌నినో’ బలపడి ఏడాది వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ ‌హౌజ్‌ ‌వాయువుల ఉద్గారాలతో భూతాపం పెరగడం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకోవడంతో ప్రపంచ మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం తప్పనిసరి అవుతున్నది. 2022, 2026ల మధ్య ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌ ‌పెరగవచ్చని, దీని వల్ల జరిగే వాతావరణ ప్రతికూల మార్పులతో పరిస్థితులు మరింత విషమించవచ్చని అంచనా వేస్తున్నారు.

‘ఎల్‌ ‌నినో’ ఏర్పడిన ప్రతిసారి వర్షపాతం తగ్గుతుందనే నియమం కూడా ఏమీ లేదు. 1951 నుంచి నేటి వరకు ఏర్పడిన 15 ‘ఎల్‌ ‌నినో’ సందర్భాల్లో 6 ‘ఎల్‌ ‌నినో’ల కాలంలో సాధారణ లేదా అంత కన్న ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనించారు. ‘ఎల్‌ ‌నినో’ ప్రభావంతో ప్రతికూల వాతావరణం, కరువులు, తక్కువ వర్షపాతం, ఉష్ణోగ్రతలు పెరగడం లాంటి కారణాలతో ప్రపంచ మానవాళి ఆహార భద్రతపై తీవ్ర విఘాతం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రపంచ దేశాలు చేయి చేయి కలిపి వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించేలా సకాలంలో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు పౌర సమాజం కోరుకొంటున్నది.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply