Take a fresh look at your lifestyle.

ఏక్‌ ‌దర్ద్ ‌భరీ కహానీ .. ధారావి..!

“35 ‌వేల కుటుంబాలు ఒంటరి గదుల్లో నిర్మించిన అటకలపైనే కాపురం ఉంటున్నారు. ఇక్కడి పరిశ్రమల్లో దాదాపు 90 శాతం అనధికారికమైనవే. ఇందులో కాలుష్యాన్ని వ్యాపింపచేసేవే అత్యధికంగా ఉన్నాయి. ముఖ్యంగా తోళ్ళ శుద్ధి కార్మాగారాలు ఇక్కడ ఎక్కువ. దీంతో ధారావిలోని మురికి కాలువలు కూడా దుర్వాసన వేస్తుంటాయి. మురికి నీటితో నిండిన డ్రైనేజీలు ఒవర్‌ఫ్లో అయి ఇరుకు వీధులన్నీ చీదర కలిగిస్తాయి. పెట్రోలియం పదార్థాల రీసైక్లింగ్‌ ‌ధారావి ఆదాయంలో ప్రముఖ భూమిక పోషిస్తోంది, ఆయిల్‌ ఇం‌డస్ట్రీజ్‌ ‌వల్ల కూడా ఇక్కడి వాతావరణం మలినమవుతోంది. మహారాష్ట్రలోనే ప్రసిద్ధి చెందిన కుండల తయారీ ఇక్కడే జరుగుతోంది.”

దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు…అయ్యాం..! చప్పట్లు కొట్టమన్నారు.. కొట్టాం..! దీపాలు వెలిగించమన్నారు… వెలిగించాం..! దవాఖానాల మీద ఆర్మీ పూల వర్షం కురిపించింది.. సంతోషించాం..! ఇవన్నీ భావోద్వేగాలకో, కృతజ్ఞతాభావానికో సంబంధించిన అంశాలు. ఉత్తమ పౌరులుగా మనమంతా కర్తవ్య పరాయణతో వీటిని నిర్వహించాం..మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? టీవీల్లో, సోషల్‌ ‌మీడియాలో ప్రకటిస్తున్న అంకెల్లో సత్యమెంతుంది..? కరోనా కట్టడి విషయంలో వివిధ ప్రభుత్వాలు చేపట్టిన చర్యల్లో నిజం ఎంతుంది..? కొన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, నిష్టతో కరోనాను అరికట్టేందుకు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ యుద్ధంలో పాల్గొనేందుకు ప్రజల్ని కూడా ఉత్తేజపరుస్తున్నారు. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వస్తే చెప్పుకునేందుకు గొప్పగా ఏమీ లేదనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు. దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన ముంబయి మహానగరంలో కరోనా వ్యాధి విజృంభిస్తోంది. కరోనా రోగుల సంఖ్య పది వేల వరకు చేరుకుంది. దేశంలోని అన్ని నగరాలకంటే ముంబైలో ఎక్కువ రోగులు నమోదయ్యారు. దాదాపు పది వార్డుల్లో రెండు వందలకు మించి కరోనా రోగం బారిన పడ్డారు. ముంబయిలో ప్రాంతాల వారిగా చెప్పుకుంటే మొదటి సాశీవనంలో ఉంది.. ధారావి..! ముంబయిని రెండుగా విభజించే పశ్చిమ, మధ్య రైల్వేల మధ్య నలిగిపోతున్న ప్రాంతం ధారావి.. మాహిమ్‌, ‌సయాన్‌ల మధ్య ఉంది. ఒకవైపు మాహీమ్‌ ‌క్రీక్‌ ‌మరోవైపు మురికినీటి మీఠీనది.. ధారావిని ఆక్రమించుకొని ఉన్నాయి. ధారావిలో అడుగుపెట్టగానే ముక్కుపుటాలు అదిరిపోయే అదోరకమైన వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విపరీతమైన జనసాంద్రత అడుగు ముందుకు వేయనీయదు. ఓపెన్‌ ‌డ్రైనేజీ వ్యవస్థ వల్ల దోమలు, పందులు, పురుగులు కళ్ళ పొరల్ని పొడుచుకుతింటాయి. అక్కడ జీవితం తప్పనిసరి పోరాటం..!

ధారావి చరిత్ర
18వ శతాబ్దాం వరకు ధారావి ఒక ప్రత్యేక దీవి. 1909లో ధారావి, ఆరు ప్రసిద్ధి చెందిన కోలివాడల్లో ఒకటిగా పేరుగాంచింది. విడివిడిగా ఉన్న ఏడు ద్వీపాలను కలిపి ముంబయిని నిర్మించే క్రమంలో ధారావి తన ప్రత్యేకతను కోల్పోయి నగరంలో అంతర్భాగం అయింది. 427 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధారావి మురికివాడలు అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందాయి. ముంబయిని సందర్శించే విదేశీ పర్యాటకులు తప్పనిసరిగా చేరుకునే ప్రాంతం ధారావి. విశ్వనగరమైన ముంబయి నగరం నడిబొడ్డున ఉన్న ఈ అనాథ దీవి, ఇక్కడ నడుస్తున్న ఓట్లను చూసి, ఫోటోలు తీసి, విశ్వవిపణిలో అమ్ముకొని డాలర్లు కుప్పేసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. వికృత రాజకీయ వ్యవస్థకు క్షణంక్షణం బలవుతున్న ఈ జీవులు అంతర్జాతీయ వినోద ప్రదర్శనలో స్థానం తప్పని అసహాయ మౌన శిల్పాలుగా మారిపోతున్నారు. ఒక్క ఎకరం విస్తీర్ణంలో దాదాపు 18 వేల మంది నివసించే ఈ ధారావిలో, 300 చదరపు అడుగుల గదిలో యావరేజ్‌గా15 మంది నివసిస్తున్నారు. వారితో పాటు నివసించే ఎలుకలు లెక్కకు రాకపోవడం విశేషమే కాదు విషాదం కూడా. ముంబయిలో కేవలం రెండు వందల రూపాయల నెలసరి అద్దెకు గదులు లభించే ఏకైక ప్రాంతం ధారావి యే.. వాటిని గదులు అనుకుంటే మాత్రమే..!

ధారావిలో పరిశ్రమలు
ఇక్కడ జీవితం నిత్యం నిప్పుల మార్గం..బతికేందుకు ఎన్ని దారులు కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనుషులు, వారి జీవన విధానాలు, వారి సంఘర్షణ, వారి ఉక్రోశం, వారి అక్రోశం, వారి మొండితనం, చివరకు వారు చేసే వ్యాపారం కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ధారావిలోని ఇరుకు గదుల్లో వేలాది కుటీర పరిశ్రమలు ఉన్నాయి. కేవలం గజం సందు మాత్రమే ఉండి, అటూ ఇటూ వరుసగా ఉన్న సుదీర్ఘమై మురికివాడల్లో మనుషులు ఉండే గది ఏదో, పరిశ్రమలున్న గది ఏదో గుర్తుపట్టడం కూడా కష్టమే..! దాదాపు ఇక్కడ 50 వేల పరిశ్రమలు ఉన్నాయని అంచనా. అందులో 15 వేల వరకు సింగిల్‌ ‌రూమ్‌ ‌పరిశ్రమలే కావడం కూడా విశేషం..! ధారావి ఉత్పత్తుల విలువ దాదాపు సంవత్సరానికి 3 వేల కోట్లకు చేరుకుంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఇక్కడి టర్నొవర్‌ 5 ‌వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇందులో ఎగుమతులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలేవీ పనిచేయవు. నీటి గూండాలు, కరెంటు గూండాలతో పాటు రక్షక గూండాలు కూడా ఉంటారు. వీరందరికీ నెలసరి మామూలు ఠంచన్‌గా అందాల్సిందే. నీటి కనెక్షన్‌ ‌కావాలన్నా, కరెంట్‌ ‌కనెక్షన్‌ ‌కావాలన్నా ఇక్కడ ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఏమీ ఉండదు. అంతా స్థానిక నాయకులుగా చెలామణి అయ్యే గూండాలే చూసుకుంటారు. ఇక్కడ జరిగే తగాదాలను పరిష్కరించేందుకు పోలీసులు తక్కువ, స్థానిక గూండా నాయకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. జనం కూడా వీరిని పోషించడమే బెటర్‌ అనుకోవడం పోలీసు వ్యవస్థ పట్ల ఉన్న చిన్నచూపుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి.
ధారావిలో అతి పెద్ద సమస్య పారిశుధ్యం..మరుగుదొడ్ల కొరత విపరీతంగా ఉండడంతో జనం, పిల్లలు డ్రేనేజీ కాలువల ఒడ్డునే కూర్చుంటారు. దీంతో ఆరోగ్య పరమైన సమస్యలు జత గూడుతాయి. 2006 లెక్కల ప్రకారం 1449 మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉండేది. ఇప్పటికీ ఆ పరిస్థితిలో పెద్దగా మార్పేం లేదు. తాగునీటి సమస్య కూడా జనం ఓపికకు పరీక్షగా మారుతోంది. కలుషిత నీటి బారిన పడిన పిల్లలు నిత్యం ప్రభుత్వ దవాఖానాల వెంట తిరుగుతూనే ఉంటారు. 35 వేల కుటుంబాలు ఒంటరి గదుల్లో నిర్మించిన అటకలపైనే కాపురం ఉంటున్నారు. ఇక్కడి పరిశ్రమల్లో దాదాపు 90 శాతం అనధికారికమైనవే. ఇందులో కాలుష్యాన్ని వ్యాపింపచేసేవే అత్యధికంగా ఉన్నాయి. ముఖ్యంగా తోళ్ళ శుద్ధి కార్మాగారాలు ఇక్కడ ఎక్కువ. దీంతో ధారావిలోని మురికి కాలువలు కూడా దుర్వాసన వేస్తుంటాయి. మురికి నీటితో నిండిన డ్రైనేజీలు ఒవర్‌ఫ్లో అయి ఇరుకు వీధులన్నీ చీదర కలిగిస్తాయి.

పెట్రోలియం పదార్థాల రీసైక్లింగ్‌ ‌ధారావి ఆదాయంలో ప్రముఖ భూమిక పోషిస్తోంది, ఆయిల్‌ ఇం‌డస్ట్రీజ్‌ ‌వల్ల కూడా ఇక్కడి వాతావరణం మలినమవుతోంది. మహారాష్ట్రలోనే ప్రసిద్ధి చెందిన కుండల తయారీ ఇక్కడే జరుగుతోంది. తరతరాలుగా గుజరాత్‌కు చెందిన కుంభార్‌ ‌జాతీయులు ఈ కుండల నిర్మాణంలో ఉన్నారు.
సాంస్కృతిక పరంగా చూస్తే ధారావి ఒక మినీ ఇండియాలాంటిది. ముందుగా ఈ ప్రాంతానికి గుజరాతీ కుంభార్‌లు వచ్చినప్పటికీ, ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఉత్తర భారతీయులు చేరుకున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఇక్కడికి తమిళుల ఆగమనం జరిగింది. దాంతో ఈ ప్రాంతం తమిళుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ తమిళుల ప్రాభవం ఎక్కువే. మరాఠీయులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. అతి పెద్ద రీసైక్లింగ్‌ ఏరియాగా కూడా ధారావి రూపుదిద్దుకుంటోంది. పాత కంప్యూటర్లు, టీవీ సెట్‌లు విదేశాల్నుండి కూడా దిగుమతి అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఇ-వేస్ట్ ‌కేంద్రంగా ధారావి పేరుపొందుతోంది. ప్లాస్టిక్‌ ‌రీసైక్లింగ్‌ ‌ఫ్యాక్టరీలు కూడా ఎక్కువే. ఈ పరిశ్రమల్లో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పరిశ్రమలన్నీ పద్ధతీ పాడు లేకుండా ఒకదానిపై ఒకటి ఉండి నానా కంగాళీగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా చిత్తడిచిత్తడిగా ఉంటుంది. వానాకాలం వచ్చిదంటే రోడ్లపై ఆయిల్‌ ‌మిశ్రితమైన ద్రవం జారుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి గాలికి బదులు, వీటి ధూళి వెళ్ళి ఇదో అతి పెద్ద ఔట్‌ ‌పేషెంట్‌ ‌వార్డులా తయారవుతుంది.

ధారావిలో ప్రస్తుతం దళితుల సంఖ్య అధికంగా ఉంది. వీరితో పాటు గిరిజన తెగలకు చెందిన వారు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు కూడా చెప్పకోతగ్గ సంఖ్యలో ఉన్నారు. తెలుగు వారు కూడా తక్కువేం లేరు. కమాటిపురా తర్వాత తామున్న ప్రదేశం పేరు చెప్పుకోవడానికి మొహమాటపడే ప్రాంతం పేరే ధారావి.ధారావిలో ఒక చిత్రమైన సాంస్కృతిక వాతావరణం కనిపిస్తుంది. అన్ని రకాల భాషలు, సంస్కృతులు, వేష ధారణలతో అంతా కలగాపులగంగా ఉంటుంది. మనుషులు.. నుషులు…ఎక్కడ చూసినా మనుషులే..! మనుషులు ఎక్కువగా ఉండడమే ఇక్కడి ప్రధాన సమస్య.

ఇక్కడ రోగాలు కొత్తేం కాదు..!
ఎక్కడైతే జనసాంద్రత, అవిద్య, అజ్ఞానం, అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ శాంతి భధ్రతలు తక్కువుంటాయి. అనారోగ్యాలు ఎక్కువుంటాయి. ధారావి అందుకు మచ్చు తునక. దేశంలో మహమ్మారీలు ఎప్పుడు ప్రవేశించినా ధారావిని అవి తమ అడ్డాగా చేసుకున్నాయి. 1896లో ప్లేగు వ్యాధి ముదిరిపోయినప్పుడు దాదాపు సగం జనాభా చనిపోయారు. 1986లో కలరా వ్యాపించినప్పుడు కూడా ధారావిలో లక్షల మంది అసువులు బాసారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు కావడం శోచనీయం..! ధారావిలో పిల్లల బాల్యం ఇరుకు వీధులకు బలైపోతోంది. పౌష్టికాహార లోపాలు, సరైన పెంపకం లేకపోవడం, నిరక్షరాస్యత ఇక్కడ పిల్లలకు శాపంగా పరిణమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ రోగుల సంఖ్య ఎక్కువే..మరణాల సంఖ్య కూడా ఎక్కువే..!

విరుచుకుపడుతున్న కరోనా..!
ధారావిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక్కడ ఎప్రిల్‌ 21 ‌నాడు మొదటి కరోనా మరణం సంభవించింది. ప్రస్తుతం ముంబయి నగరంలో కరోనా రోగుల సంఖ్య దాదాపు పదివేలకు చేరుకుంటోంది. కేవలం 427 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ధారావిలో కరోనా రోగుల సంఖ్య 600 దాటింది. ఇది రోజు రోజుకీ విపరీతమైన వేగంతో పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. ధారావి గురించి తెలిసిన వారికి ఈ అంకెలపై ఏ మాత్రం నమ్మకం కుదరదు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ధారావిలో కరోనా విజృంభించడానికి కారణాలు… విపరీతమైన జనాభా, ఇరుకిరుకు సందులు, విపరీతమైన కాలుష్యం అయితే, అన్నింటికంటే ప్రమాదకరమైన కారణం ‘కామన్‌ ‌టాయ్‌లెట్స్. ‌ప్రస్తుతం ముంబైలో ఈ కామన్‌ ‌టాయ్‌లెట్స్ ‌కరోనాకు వసతి గృహాలుగా మారాయి. ధారావిలో కరోనా తిష్టవేయడానికి ప్రధాన కారణం ఈ కామన్‌ ‌టాయ్‌లెట్సే.. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రభుత్వ అధికారులకు తోచడం లేదు. ఆ మధ్య ధారావి నుండి కొందరు జనాల్ని ఇత స్థానాలకు తరలించాలనీ కూడా ప్రభుత్వం యోచించింది. కానీ, అమలులో ఏ ఇబ్బందులు ఏర్పడ్డాయో ఆ యోచనను పాత బస్తాల్లో పాతరేశారు. చప్పట్లు, దీపాలు, పూల వర్షాలను కాసేపు పక్కన బెడితే ముంబయిలో ప్రభుత్వ విభాగాల మధ్య ఎలాంటి సమన్వయం లేదనీ, ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ అసలే లేదని అర్థమవుతోంది. ప్రభుత్వ దవాఖానాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్ ‌రోగుల్నుండి ముక్కుపిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు తమాషా చూస్తూ ఉన్నారు. రోగులను వెంటనే దవాఖానాకు తరలించకుండా ఇళ్ళకే పరిమితం చేస్తున్నారు. అయిదారుగురు ఉండే సింగిల్‌ ‌రూంలో ఒక వ్యక్తికి పాజిటివ్‌ ‌వస్తే, మిగతా వారిని వెంటనే క్వారంటైన్‌ ‌చేయకుండా జాప్యం చేస్తున్నారు. దాంతో కరోనా మరింతా విస్తరిస్తోంది. దేశంలోని ఒక అగ్ర రాష్ట్రం నేడు కరోనా తాకిడికి హాహాకారాలు చేస్తోంది. ఇది ఎవరి తప్పో ప్రజలు, మేధావులు ఆలోచించాలి..!

Leave a Reply