Take a fresh look at your lifestyle.

ఎంఎల్‌ఏ ‌పదవికి ఈటల రాజీనామా

  • అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేత
  • రాజీనామా ఆమోదం..ప్రకటించిన స్పీకర్‌ ‌కార్యాలయం

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌తన ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు. స్పీకర్‌ ‌ఫార్మాట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు. ఉదయం 11:30 గంటలకు ఈటల రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పీకర్‌ను కలిసి రాజీనామా ఇవ్వాలనుకున్నానని, కోవిడ్‌ను అద్దం పెట్టుకుని స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, వారం రోజులు ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్‌ ‌సాధ్యం కాలేదని, అనివార్యంగా ఈ రోజు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యులకు ఇచ్చానని తెలిపారు. అసెంబ్లీ గేట్ల వద్ద తన సహచరులు, అనుచరులను అడ్డుకున్నారని, గతంలో ఉన్న సంప్రదాయాలు తుంగలో తొక్కారని, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ ‌రెడ్డిని కూడా అనుమతించలేదరి, అసలు రాజ్యాంగం, ఎమ్మెల్యేలు ఎందుకు అనే భావనలో కేసీఆర్‌ ఉన్నారని, అందులో భాగమే తమకు జరిగిన అవమానమన్నారు. ప్రగతి భవన్‌ ‌వెకిలి చేష్టలు మానుకోకపోతే పరాభవం తప్పదన్నారు.

రాజీనామాకు స్పీకర్‌ ఆమోదం..ప్రకటించిన కార్యాలయం
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌శనివారం ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌ ‌కార్యాలయంలో సమర్పించారు. ఆ సమయంలో స్పీకర్‌ అక్కడ లేరు. అయితే రాజీనామా చేసిన తరవాత వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్టన్లు స్పీకర్‌ ‌కార్యాలయం ప్రకటించింది. రాజీనామా లేఖను ఆమోదిస్తూ స్పీకర్‌ ‌నిర్ణయం వెలువరించారు.ఈ క్రమంలో హుజూరాబాద్‌ ‌సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చారు. ఈటల రాజీనామాపై స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి వేగంగా స్పందించారు. శనివారం ఉదయం 11:30 గంటలకు అసంబ్లీ కార్యదర్శికి ఈటల రాజీనామా పత్రాన్ని ఇచ్చారు.

కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. హుజురాబాద్‌ ‌నియోజకవర్గం ఖాళీ చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ ‌విడుదల చేశారు. సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అసంబ్లీ కార్యదర్శి ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఏడేళ్లల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌గా నిలిచారు.

Leave a Reply