Take a fresh look at your lifestyle.

ప్రగతి భవన్‌లో అధికారం కోసం నాలుగు స్థంభాలాట

  • తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయ్‌
  • ‌పార్టీ కోసం రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
  • డిసెంబర్‌ 17 ‌నుంచి మళ్లీ పాదయాత్ర
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్‌
  • ‌బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌తో ఈటల ప్రత్యేక భేటీ

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో బీజేపీ అధికారంలోకి వొస్తుందనీ, డిసెంబర్‌ 17 ‌నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ‌రైతుల పేరుతో ఢిల్లీకి వెళ్లి బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. ఇక్కడి పాతబస్తీలోని బండ్లగూడ మహావీర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం సంజయ్‌ ‌పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రగతి భవన్‌లో అధికారం కోసం నాలుగు స్థంభాలాట మొదలైందనీ, తమను సీఎం చేయాలని కుమారుడు, కూతురు, అల్లుడు కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ఉన్నన్ని రోజులు సీఎంగా తానే ఉండాలని కేసీఆర్‌ ‌కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో బీజేపీ విజయంతో టీఆర్‌ఎస్‌ ‌పతనం ప్రారంభమైందనీ, వొచ్చే ఎన్నికలలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌లో నియంతృత్వ పోకడలు సాగుతున్నాయనీ, సీఎం కేసీఆర్‌ అ‌ప్రజాస్వామిక పాలనను ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటికి పంపిస్తున్నారనీ, ఇందుకు ఈటల రాజేందర్‌ ‌వ్యవహారమే నిదర్శనమని తెలిపారు. ఉద్యమ కారులకు టీఆర్‌ఎస్‌లో స్థానం లేదనీ, రాజేందర్‌ ‌లాంటి మరెందరో ఆ పార్టీ నేతలు బయటికి రావడం ఖాయమని చెప్పారు. సీఎం పోకడలతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదనీ, ఎంబీసీ పేరుతో సీఎం బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందనీ, ప్రజల దృష్టిని మళ్లించడానికే ధాన్యం కొనుగోళ్ల పేరుతో సీఎం కేసీఆర్‌ ‌డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే పేరుతో ఆత్మగౌరవ నినాదం రాజేస్తున్నారనీ, అసలు ప్రధానిని కలవడానికి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ అడగనేలేదని పీఎంవో చెప్పడంతో కేసీఆర్‌ ‌కుట్ర ప్రజలకు అర్థమైందనీ, అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.

Eitala meets BJP national leader Sivaprakash

బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌తో ఈటల ప్రత్యేక భేటీ
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి శివప్రకాశ్‌తో హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈటల బయటికి వొచ్చి శివప్రకాశ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరీంనగర్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌రెబల్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న రవీంద్రసింగ్‌కు బీజేపీ మద్దతివ్వాలని ఈటల శివప్రకాశ్‌ను కోరినట్లు తెలిసింది. కరీంనగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీని గెలిపించే దిశగా తన వద్ద ఉన్న ప్రణాళికను ఈటల శివప్రకాశ్‌కు వివరించినట్లు సమాచారం. అలాగే, టీఆర్‌ఎస్‌ ‌నుంచి బీజేపీ చేరేందుకు భారీ సంఖ్యలో ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారనీ, టీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగంగా వారందరినీ బీజేపీలో చేర్చుకోవాలని ఈ సందర్భంగా ఈటల శివప్రకాశ్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Leave a Reply