Take a fresh look at your lifestyle.

నేడు ఈదుల్ ఫితర్ ..!

  • దేశవ్యాప్తంగా మతపెద్దల ఏకాభిప్రాయం
  • కొనుగోళ్లతో కిటకిటలాడిన మార్కెట్లు
  • చార్మినార్‌ ‌ప్రాంతంలో జోరుగా రంజాన్‌ ‌‌షాపింగ్‌

రంజాన్‌  ‌పండగ నిర్ధారణకు హేతువైన నెలవంక దర్శన మివ్వడంతో ఈదుల్‌ ‌ఫితర్‌కు సిద్దం అయ్యారు.  శుక్రవారం పండుగ జరుగుతుందని  ఈ  మేరకు ఏర్పా ట్లు చేసుకున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి చంద్రవంకకు  సంబంధించి సమాచారం సేకరించారు. రంజాన్‌ ‌పండుగ మే 14న జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.

షవ్వాల్‌ ‌చంద్రుడు కనిపించినందున శుక్రవారం ముస్లింలు యథావిధిగా పంగడను జరుపుకోవాలని తెలిపారు. గల్ఫ్‌దేశాల్లో శుక్రవారం రంజాన్‌ ‌పండుగ జరుపుకోవాలని ఆ దేశాల్లో అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.ముస్లిం సోదరులు రంజాన్‌ ‌పర్వదినం శుక్రవారమే అవుతుందన్న భరోసాతో షాపింగ్‌ ‌చేపట్టడంతో హైదరాబాద్‌ ‌మార్కెట్లు కళకలలాయి. లాక్‌డౌన్‌ను సైతం లెక్క చేయకుండా ఉదయమే షాపింగ్‌ ‌చేపట్టారు. అన్ని పట్టణాల్లో ఇది కనిపించింది. ఉదయం 10 వరకే సమయం ఉన్నా మధ్యానహ్నం కూడా షాపింగ్‌ ‌చేశారు. పోలీసులు కూడా చూసీచూడనట్లుగా వదిలేశారు.

నగరంలో మార్కెట్లు జనంరద్దీతో కిటకిటలాడాయి. పండుగకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో చార్మినార్‌ ‌పరిసరాలలో బట్టలు, చెప్పులు ఇతర వస్తువులు చౌకగా లభిస్తుండడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో పాతబస్తీలోని మార్కెట్లన్నీ కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. రంజాన్‌ ‌కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవడంతో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్శించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రంజాన్‌ ‌పండుగ సందడితో ముస్లిం సోదరుల కొనుగోళ్ళతో చార్మినార్‌ ‌పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పాతబస్తీలోని ప్రతి బస్తీ, ప్రతి వాడలో ఇదే పరిస్థితి.  అఫ్జల్‌గంజ్‌ ‌నుంచి బార్కస్‌ ‌వరకు ప్రధాన రహదారులలో ఉండే దుకాణాలే కాకుండా గల్లీల్లో ఉండే చిన్నచిన్న దుకాణాలు కూడా రద్దీగానే మారాయి.

సహజంగా పాతబస్తీలో ప్రజల అలవాట్లు, సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. పెళ్ళిళ్లు, శుభకార్యాలు, షాపింగ్‌లు ఏవైనాసరే ఇక్కడ రాత్రిపూటే మొదలవుతాయి. ఇది తరతరాలుగా వస్తున్న పాతబస్తీ సంస్కృతి. పురుషులు పగటిపూట ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంటాయి. మహిళలు పగలు ఇంటి పనులు చూసుకొని సాయంత్రం ఇఫ్తార్‌ ‌ముగించుకుని తీరిగ్గా షాపింగ్‌కు బయలుదేరి తెల్లవారుజాము వరకు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. కానీ లాక్‌డౌన్‌తో అంతా ఉదయమే షాపింగ్‌కు రావాల్సి వచ్చింది. పండుగకు ధరించే వస్త్రాలతోపాటు, పాదరక్షలు, అత్తర్లు, పండుగ రోజు తయారు చేసే సేమియా, డైఫ్రూట్స్, ‌పండుగ పూట ఇంటికి వచ్చే అతిథుల మనసును గెల్చుకునేందుకు అందమైన గృహాలంకరణ వస్తువుల కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి. పాతబస్తీనుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి కొనుగోలుదారులు తరలివస్తుండడంతో చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాలన్నీ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి.

చార్మినార్‌, ‌లాడ్‌బజార్‌, ‌మదీన, గుల్జార్‌హౌజ్‌లలోని వందలాది షోరూమ్‌లలో అన్నిరకాల వస్తువులు లభ్యమవుతున్నాయి. దీంతో అన్నిరకాల దుకాణాలు కొనుగోలు దారులతో కిక్కిరిసి కనిపించాయి. చార్మినార్‌ ‌పరిసరాలలో అడుగడుగునా తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. మామూలు రోజుల్లో ఇతర వ్యాపారాలు చేసుకునేవారు కూడా రంజాన్‌ ‌మాసంలో రోడ్డు పక్కన రెండు టేబుళ్ళు వేసుకొని ఏదో ఒక వస్తువును అమ్ముతున్నారు.

Leave a Reply