Take a fresh look at your lifestyle.

ఈత గంప

ఎన్ని ఈతల తలచిక్కులను
ముంజేతి కత్తై ,..దువ్వి సింగారించిందో..?
ఎన్ని ఈతల బుట్టలకు సీకట్లను కోసి
పురుడోసిందో.?
మునివేళ్ళ ముద్దుకై
ఎన్ని గంపలు గదమ పట్టి బ్రతిమిలాడాయో.?కొప్పును తలపించే ఈతబుట్టలు
బతుకు సిగకు పెద్ద పువ్వై
సాటు మాటు కన్నీళ్లను
అద్దం ముందు ఆరబోసిన
ఆవేదనల వేడి నిట్టూర్పులను అగ్ని చక్షువై
అన్ని వేళలా పరికిస్తాను…

సేమట సుక్కలతో నానబెట్టిన ఆకులను
సూర్యునితో కాపిన కొమ్మలను
దు:ఖపు అగదాల అంచులో నిల్చుని
గంపలౌతూ మునివేళ్లతో ముచ్చటాడే
ముచ్చటగా వొదిగి పోయే సాపల ఆర్తిని
సముద్ర హోరుతో …మిళితమై వస్తున్న దృశ్యాలను
పరికించి చూస్తున్న
చూసి చలిస్తున్న….మంచు చక్షువును నేనే..

ఇప్పుడు
ఆకొప్పు చిక్కుముడై
రెండు ముఖాలుగా తారు రోడ్డుతో
రక్తపు మడుగును దాటకేక అల్లాడుతున్న
పరిస్థితికి సూర్యుడు ఖిన్నుడై వెయ్యి నేత్రాలతో
పరికిస్తున్నాడు…
రోడ్డుపక్కన కూలుతున్న చెట్లు శిలలై
గాలిని పీల్చుకొక కొనూపిరితో చూస్తున్న.
వాటి మూగ వేదనని వింటూ
ఉద్వేగంతో ఊపిరాడని వాడిని నేనే..

ఈత కండ్లవెనుక దాగిన విషాద ఛాయలు
అదృశ్య లోకంలో ఆర్తనాదాలై
అర్రులు చాస్తున్న దృశ్యాన్ని నేను చూస్తున్న..
అభివృద్ధి గొడ్డలి కాటుకు విషంకక్కుకు
చచ్చి మృత ఖలేభరాల శిర: కపాలంలోని
గుంత కండ్లలోని మహా నిశ్శబ్దాన్ని
వర్ణిస్తున్నా గాలి ముచ్చట్లు వింటున్న వాన్ని..

చెరువు గట్టును అధికార ఆకాశం నిండుగా కప్పేసింది..
వెంచర్‌ ‌లాంటి సుక్కలతో వెలిసి వెలిగిపోతుంది.
ఈతలు రోతలయ్యాయి
ఒక్క గంప కొని
సంసార దీపానికి వెలుగునవ్వాలని
ప్రకృతితో మొరపెట్టుకున్నా వాడిని.
నేనే…
– నాగరాజు మద్దెల
6301993211.

Leave a Reply