Take a fresh look at your lifestyle.

1 ‌నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

కొరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : రాష్ట్రంలో విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థలలో కొరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు మంత్రి సబిత శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కొరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలనీ, ఈ మేరకు యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో కొరోనా కేసులు క్రమంగా పెరగడంతో వైద్య శాఖ సూచనల మేరకు ఈనెల 31 వరకు సెలవులను పొడిగించింది. తాజాగా, రాష్ట్రంలో క్రమంగా కొరోనా కేసులు తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు కూడా స్వల్పంగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలను పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్‌ ‌పక్రియను మరింత వేగవంతం చేయాలని వైద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఈనెల 31తో విద్యా సంస్థలకు సెలువులు ముగుస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలలు తిరిగి తెరవాలని ప్రభుత్వంపై వొత్తిడి తీసుకొచ్చారు. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్‌ ‌క్లాసుల వల్ల విద్యార్తులకు పెద్దగా ఫలితం ఉండటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడంతో తాజాగా ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలన్నింటినీ పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply