Take a fresh look at your lifestyle.

సృజనాత్మకతతో కూడిన విద్య అవసరం

  • అత్యుత్తమ అంశాల అన్వేషణ సాగాలి
  • వివేకానందుడి ఆలోచనలకు అనుగుణంగా నూతన విద్యావిధానం
  • రామకృష్ణమఠ్‌ ‌కార్యక్రమంలో సందేశం ఇచ్చిన వెంకయ్య

సృజనాత్మకతతో కొత్త విషయాలకోసం నిరంతరం అన్వేషించేలా ప్రోత్సహించే విద్యావ్యవస్థ అత్యంత ఆవశ్యకమని తద్వారా భవిష్యత్‌ ‌భారతాన్ని మరింత వైభవోపేతంగా మలచుకునే వీలవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజ్ఞానాణెళ్వి షణ కేంద్రంగానే 21వ శతాబ్దపు పోటీ ప్రపంచం నడుస్తోందన్న ఆయన పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా విద్యాబోధన సాగాలని సూచించారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠ్‌ ఆధ్వర్యం లోని వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్ 21‌వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. క్రమశిక్షణ, చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం ద్వారా ఉన్నతమైన భావాలను పుణికిపుచ్చుకుని అత్యుత్తమమైన అంశాల అన్వేషణకు మార్గం సుగమం అవుతుంద న్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అత్యుత్తమ అంశాల అన్వేషణ ద్వారా ముందుకు వెళ్లడం అత్యంత ఆవశ్యకమన్నారు.

1893 సెప్టెంబర్‌ 11‌న చికాగోలో సర్వమత సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వివేకానందుడు ప్రసంగించిన వేదిక ద్వారా రెండేళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా.. ప్రాచీన భారత వైదిక తత్వం, వసుధైవ కుటుంబక భావన, శాంతి, సహనం మొదలై ప్రాచీన భారత విధానాలను ప్రపంచానికి పరిచయం చేసిన అప్పటి వివేకానందుడి ప్రసంగాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. నాటి వివేకానందుడి ప్రసంగాల్లోని అంశాలు.. నేటి అధునిక ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయని, అంతటి మహనీయమైన వ్యక్తి జీవితాన్ని, సందేశాలను యువత అధ్యయనం చేయడం ద్వారా తమ తమ జీవితాల్లో సానుకూల మార్పునకు బీజం వేసుకోవాలని ఆయన సూచించారు. వివేకానందుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆర్కే మఠ్‌, ఆర్కే మిషన్‌ ‌వంటి మరిన్ని సంస్థల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తన కళాశాల, విశ్వవిద్యాలయ రోజుల నుంచి స్వామి వివేకానందుడి పుస్తకాలను చదువుతున్నానన్న ఉపరాష్ట్రపతి.. మతం, ఆధ్యాత్మికత, జాతీయవాదం, విద్య, తత్వం, సామాజిక సంస్కరణలు, పేదరిక నిర్మూలన, ప్రజాసాధికారత వంటి అంశాల్లో స్వామిజీ బోధనలు తననెంతగానో ప్రభావితం చేశాయన్నారు. స్వామి వివేకానంద భారతీయ ఆత్మను, సంస్క•తిని అవగతం చేసుకున్నారని.. సనాతన ధర్మం ఆధ్యాత్మిక పునాదులలో పొందుపరచిన గొప్ప ఆదర్శాలపై భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ’మతపరమైన, ఆధ్యాత్మిక మార్పులు, సామాజిక పునరుత్పత్తి ద్వారా దేశంలో పరివర్తన తీసుకొచ్చేందుకు వారు అవిశ్రాంతంగా శ్రమించారు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

విద్యార్థిని శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, నైతికత, సహిష్ణుత, సానుభూతి, ఆధ్యాత్మిక బలం కలిగిన పరిపూర్ణ వ్యక్తిగా మార్చేదే విద్య అని, జ్ఞానజ్యోతిని వెలిగించడంతోపాటు సాధికారత కల్పించేలా విద్యావ్యవస్థ ఉండాలని ఉపరాష్ట్రపతి అన్నారు. 21వ శతాబ్దపు డిమాండ్లకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని పున:సక్షించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా నూతన జాతీయ విద్యావిధానం రూపంలో తీసుకొచ్చిన మార్పులు దేశాన్ని మరోసారి విశ్వగురువుగా మార్చే దిశగా మార్గదర్శనం చేసేలా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. పాశ్చాత్య విజ్ఞానానికి, అమూల్యమైన భారతీయ వేదాంతాన్ని జోడించడం ద్వారా దేశం అత్యున్నత శిఖరాలను చేరుకునేందుకు అవకాశం ఉందన్నారు.

భారతదేశానికి అదనపు బలమైన యువశక్తి ఈ దిశగా దృష్టిపెట్టి నైపుణ్యాన్ని పెంచుకుని, సృజనాత్మకతతో వినూత్న ఆవిష్కరణలతో దూసుకుపోవాలని సూచించారు. ఆవిష్కరణలు, పరిశోధనల ఏకైక లక్ష్యం మానవాళికి మేలు చేయడమే కావాలని కూడా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠ్‌, ‌రామకృష్ణ మిషన్‌ ‌బేలూర్‌ ‌మఠ్‌ ఉపాధ్యక్షుడు స్వా గౌతమానంద మహారాజ్‌, ‌రామకృష్ణ మఠ్‌ ‌హైదరాబాద్‌ అధ్యక్షుడు స్వా జ్ఞానానంద మహారాజ్‌, ‌వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హ్యూమన్‌ ఎక్సలెన్స్ ‌డైరెక్టర్‌ ‌స్వామి బోధమయానందతోపాటు జస్టిస్‌ ‌చల్లా కోదండరాం, అధ్యాపకులు, విద్యార్థులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Leave a Reply