ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వీర్యం
ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : తెలంగాణ వొచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్ హర గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండి పడ్డారు. 50 ఏండ్ల తర్వాత తెలంగాణ చరిత్ర చూస్తే…విద్యా రంగానికి తీవ్ర ఆన్యాయం చేసిన పార్టీగా టీఆర్ఎస్ పేరు నిలిచిపోతుందన్నారు. దిల్లీ వెళ్లిన ముఖ్య మంత్రి కేసీఆర్ అక్కడి స్కూల్స్‌ని చూసి వొచ్చారే తప్ప ఇక్కడ చేసింది ఏవి• లేదన్నారు.
యాదగిరిగుట్టకు కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందిస్తే దేశ జిడిపి కూడ పెరుగుతుందన్నారు. విద్యను వ్యాపారంగా చేసిన పాలకులు ఏం సాధించారని హరగోపాల్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల మహాధర్నాలో హరగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యారంగం పట్ల నిర్లక్ష వైఖరిని ఖండించారు. డిఎస్సీలు నిర్వహించకుండా చేస్తున్న తీరును తప్పుపట్టారు.