ఛత్తీస్‌గఢ్, ఫిబ్రవరి 20 : ఛత్తీస్‌గఢ్ బొగ్గు అక్రమ మైనింగ్ కుంభకోణం కేసు లో ఈడీ మరోసారి కొరడా ఝులిపించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు సోమవారం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతల నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రాజధాని రాయ్‌పుర్ లో ఫిబ్రవరి 24-26 వరకు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ముందు ఈ దాడులు జరగడం గమనార్హం. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్, రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ సుశీల్ సన్నీ అగర్వాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ నివాసాలతోసహా 10కి పైగా ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
మరికొంతమంది అధికార పార్టీ నేతలు ఇందులో ఉన్నారు.మరోవైపు.. తాజా సోదాలను కాంగ్రెస్ ఖండించింది. ఈ దాడులకు నిరసనగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. పార్టీ సమావేశాల నేపథ్యంలోనే దాడులు జరుగుతున్నాయని, అయితే.. ఇవేమీ తమను అడ్డుకోలేవని ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ భాజపాపై విరుచుకుపడ్డారు. ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతం కావడం, అదానీ నిజానిజాలు బయటకు రావడంతో భాజపా నిరాశకు గురవుతోందని, వాటిపైనుంచి దృష్టి మళ్లించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు.
తమ పార్టీ ప్లీనరీ సమావేశాలకు భాజపా భయపడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర కమ్యూనికేషన్ విభాగం అధినేత సుశీల్ ఆనంద్ శుక్లా అన్నారు. సహజ వనరులు అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో గడిచిన రెండేళ్లలో రూ.450 కోట్ల మేరకు భారీ దోపిడీ కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ మేరకు దర్యాప్తు చేపడుతోంది. ఈ కుంభకోణంలో బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ వైష్ణోయ్, సూర్యకాంత్ తివారీ, బొగ్గు వ్యాపారవేత్త సునీల్ అగర్వాల్‌సహా తొమ్మిది మందిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. వారి ఆస్తులనూ అటాచ్ చేసింది.