కోవిడ్19 అంశంపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా వలస కార్మికుల డేటాను తయారు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మహమ్మారి అనంతరం ఆర్థికసంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్రాలకు 8000 కోట్లు కేంద్రం ఇవ్వాలని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. గతంలోనూ మహమ్మారులను ఎదుర్కొన్నామని, కానీ ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.
లాక్డౌన్ ప్రకటించిన మూడు రోజుల తర్వాత సీఎంలతో ప్రధాని మాట్లాడారని ఎంపీ కేశవరావు తెలిపారు. వలస కార్మికుల విషయం సిగ్గుచేటు అని తెలిపారు. లాక్డౌన్ వేళ వేలాది సంఖ్యలో వలస కార్మికులు వారివారి స్వంత రాష్టాల కు వెళ్లారని, ఆ సమయంలో కొందరు వలస కార్మికులు మృతిచెందారని, వారికి సంబంధించిన డేటా లేకపోవడం శోచనీయమన్నారు. కొరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ ముందు ఉందనన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తమ ప్రభుత్వం రెండు వేల మంచాలతో కోవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు కేశవరావు తెలిపారు. లాక్డౌన్ వల్ల నిరుద్యోగం పెరిగిందని, రాబోయే రోజుల్లో పరిస్థితి కోవిడ్ కన్నా దారుణంగా ఉంటుందన్నారు.