Take a fresh look at your lifestyle.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పనితీరు మరియు- విశ్లేషణ

కేంద్రప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలు  ఇటీవల  దేశవ్యాప్తంగా  ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నం వేదికగా ఉన్నఉక్కు కర్మాగారం పైనా నిర్ణయం తీసేసుకుంది. దానిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు తెలియడంతో లక్షలమంది ఆశలు తాముపడ్డ కష్టానికి న్యాయం ఏదని ప్రశ్నిస్తున్నాయి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబ్  వరంగల్, విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో జరిగిన ప్రాణాత్యాగాలు ప్రస్తుత  నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నాయి.

విశాఖ ఉక్కు ఆంధ్రుల  హక్కుఅంటూ పోరుబాటపట్టి  ఏకంగా 32 మంది ప్రాణ త్యాగం చేసి సంపాదించుకున్నవిశాఖ ఉక్కు,దీని స్థాపనకు అప్పటి ప్రభుత్వం  66 గ్రామాలనుంచి 22వేల ఎకరాలు సేకరించింది, ఇప్పటివరకు చాలామందికి భూమిని ఇచ్చిన ప్రతిఫలం దక్కలేదు ,అలాంటిది ఇప్పుడు పూర్తిగా ప్రైవేటీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు ఎక్కువవుతున్నాయి  ఇప్పుడు 18 వేలమంది పర్మినెంట్ ఎంప్లాయీస్,20 వేలమంది ఒప్పంద ఉద్యోగులతో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా వెలుగొందుతోంది. శంకుస్థాపన  జరిగి 2021కి 50 ఏళ్లు పూర్తి కాగా ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగమవుతున్నాయి. ప్రైవేటీకరణ యత్నాలపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. అయితే ,విశాఖ పరిశ్రమ ఆర్థిక స్థితి నిజంగానే ప్రైవేట్ పరం చేసేలా ఉందా లేదా అని తెలియ జేయడానికి ఈ వ్యాసంలో ప్రయత్నించడం జరిగింది.

గత 5  సంవత్సరాలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితిని చూసినట్లయితే 2014 -15  ఆర్థిక సంవత్సరం లో పన్ను తర్వాత లాభం 62  కోట్లు ఉండగా, ప్లాంట్ సాధించిన టర్నోవర్ 11 ,675 కోట్లు . ఇదే సంవత్సరంలో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ ప్రభావం  వల్ల  ప్లాంట్ కు విద్యుత్ అంతరాయం ఏర్పడగా, ప్లాంట్ ఉత్పాదకత సాధారణ స్థాయికి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టిందని సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఆ సంవత్సరంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న నాసిరకం ముడిసరుకు ద్వారా ఉత్పత్తిలో నాణ్యత లోపించి దాని ప్రభావం అమ్మకాలపై పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ సంస్థ ఆధిక్యపు మరియు ఈక్విటీ వాటాల పై అంతర్గత డివిడెండ్ రూపం లో వరుసగా 14  మరియు 11 .35 కోట్లు చెల్లించడం జరిగింది.

2015 -16 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల టర్నోవర్ 12 ,270 కోట్లుండగా, వృద్ధి రేటు 5% కి పరిమితమైంది. అయితే, అదేసంవత్సరంలో ప్రతికూల మార్కెట్ పరిస్థితులు మరియు నాసిరకం   ముడిసరుకు  దిగుమతులతో  కంపెనీకి  1421 కోట్ల  నికర నష్టం ఏర్పడింది. 2016-17 సంవత్సరంలో కంపెనీ  అమ్మకపు టర్నోవర్ 12706 .31  కోట్లు ఉండగా నికర నష్టం 1263 .16 కోట్లు (గత సంవత్సరం కంటే తక్కువ ) గ నమోదయ్యింది.  2017 -18  లో సంస్థ అమ్మకపు టర్నోవర్ 16 ,618 కోట్లు ఉండగా, టర్నోవర్ లో 31 %  వృద్ధి (గత సంవత్సరం కంటే ఎక్కువ) సాధించింది. తద్వారా పన్ను , వడ్డీ మరియు తరుగుదలకు ముందు లాభం 346 .19 కోట్లు గడించింది, కానీ ఆ సంవత్సరం లో గ్రాట్యుటీ చట్టం 1972  ప్రకారం 541 .05 కోట్లు  ప్రొవిజన్ లకు కేటాయించడంతో నికర నష్టం 1369 .01  ఏర్పడింది.  2018 -19 ఆర్థిక సంవత్సరంలో అమ్మకపు టర్నోవర్ 20 ,844 కోట్లు సాధించగా 96 .71 కోట్లు నికర లాభం సాధించింది.

ఇక సంస్థ ద్రవ్యత్వ స్థితిని పరిశీలిస్తే గత 5  సంవత్సరాలలో వరుసగా 0.6,0.6,0.5,0.5 మరియు 0.6  గ ఉంది. అంటే సంస్థ ప్రతి ఒక రూపాయి స్వల్పకాలిక అప్పులకు సగటున ౦.4 పైసల ఆస్తులను కల్గి ఉంటుంది. దీనిని బట్టి సంస్థ తన పెట్టుబడులను ప్రధానంగా స్థిర మరియు దీర్ఘకాలిక ఆస్తులలో ఉంచడం జరుగుతుంది.  అదేవిధంగా, సంస్థ ఆర్జన రేటును పరిశీలిస్తే వరుసగా 0.09  , -3 .52 , 2.62 , 2.93, మరియు 0.11 గ ఉంది.

సంస్థ ముడిసరుకు కన్వర్షన్ నిష్పత్తిని పరిశీలిస్తే మొదటి మూడు సంవత్సరాలలో సగటున 40  %  ఉండగా , చివరి రెండు సంవత్సరాలలో 16 .5 % నమోదు అయ్యింది. చివరి రెండు సంవత్సరాలలో ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకును చైనా నుంచి దిగుమతి చేసుకోవడం అది నాసిరకంగా ఉండడం, నిర్వహణ విధానం లోపం వల్ల కన్వర్షన్ రేటు తగ్గినప్పటికీ దాని ప్రభావం సంస్థ లాభదాయకత పైన పెద్దగా లేదనే చెప్పాలి. సంస్థ టర్నోవర్ మాత్రం గడిచిన ఐదు సంవత్సరాలలో పెరుగుదలను చూసింది.

స్థూల ఆదాయ వనరుల పట్టిక

Table of gross revenue sources

- Advertisement -

స్థూల ఆదాయ పంపిణి పట్టిక

Gross income distribution table

సంస్థ ఆదాయ వనరులను పరిశీలిస్తే ఉప ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం గత 5 సంవత్సరాలలో పెరుగుతూ వచ్చింది. ( 428 కోట్ల నుండి 825 కోట్లకు ), ఇతర ఆదాయాలైన (వర్తకపు వసూళ్లు , ఉద్యోగుల రుణాలు , ఆస్తుల అమ్మకాలు , లీజులు , మరియు విరమించబడిన ప్రొవిజన్స్ ) కూడా ఇటీవలి కాలంలో పెరుగుతూనే ఉన్నాయి . ఇక ప్రధాన ఉత్పత్తులైన ఐరన్ మరియు ఉక్కు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గత 5 సంవత్సరాలలో పెరుగుతూ వచ్చింది. 2014-15 లో 9972 కోట్ల ఆదాయం ఉండగా ,క్రమంగా పెరుగుతూ 2018 -19 లో 19,513 కొట్లు గ ఉంది.

ఇంకోవైపు సంస్థ ఆదాయ పంపిణి/ ఖర్చులను గమనిస్తే సగానికి పైగా ఆదాయం, ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకును కొనుగోలు కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది. గత ఐదు సంవత్సరాల్లో ముడిసరుకు వ్యయం పెరుగుతూ వచ్చింది. దానికి అదనంగా ఉద్యోగుల గ్రాట్వీటీ , పవర్ మరియు ఇంధనం , ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను , తరుగుదల ఏర్పాట్లు , విదేశీ కరెన్సీ వడ్డీ, బ్యాంకు రుణాల భారం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

అయితే , విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయడం ద్వారా పై ఖర్చులనుంచి మినహాయింపు ఉండకపోవచ్చు. ప్రయివేటీకరణ కు ప్రత్యామ్నాయంగా విశాఖ పరిశ్రమకు సొంతంగా ముడిసరుకు పరిశ్రమను ఏర్పాటు చేయడం (మేక్ ఆర్ బై నిర్ణయం) వల్ల ముడిసరుకును సొంతంగా ఉత్పత్తి చేస్తే సంస్థ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అప్పుడు , చైనా లాంటి దేశాలనుంచి నాసిరకం ముడిసరుకును కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

అదేవిధంగా, ప్రభుత్వం కొంతకాలం ప్రభుత్వం విధించే పన్నులను తగ్గించడం లేదా పన్ను విరామం ప్రకటించడం ద్వారా కూడా సంస్థ భరణి తగ్గించి సంస్థ లాభాలను తిరిగి సంస్థ మనుగడకు వినియోగించవచ్చు. అయితే సంస్థ అమ్మకాలు ,మరియు టర్నోవర్ , స్థూల లాభం ఆశాజనకంగా ఉండటం వల్ల సంస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతులలో పెట్టి అటు ఉద్యోగుల భవిష్యత్తు, కేంద్ర ఆదాయ వనరును ప్రస్నార్ధకం చేసుకోవాలిసిన ఆవశ్యకత లేదనే చెప్పాలి. మరియు సంస్థ ను ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కార్యాచరణ, విధానాలు చెప్పటకుండానే నేరుగా ప్రైవేటీకరణ కు వెళ్లడం సరైనది కాదని చెప్పవచ్చు.

md khaza
డాక్టర్ ఎండి ఖ్వాజా మొయినొద్దీన్
ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
యంగ్ సైంటిస్ట్ అవార్డ్ గ్రహిత
బెస్ట్ రిసెర్చర్ అవార్డ్ గ్రహిత
9492791387

Leave a Reply