Take a fresh look at your lifestyle.

ఆహారపు అలవాట్లే.. భయంకర రోగాలకు కారణం

“ప్రముఖ ‘నేచర్‌’ అనే సైన్స్ ‌పత్రికలో ఈ కరోనా వ్యాధి ‘పంగోలిన్‌’ అనే జంతువుల నుండి వచ్చింది కాదని, గబ్బిలాల నుండి మానవునికి సంక్రమింఛి ఉండవచ్చని జన్యు విశ్లేషణ అనంతరం తేల్చి చెప్పారు. అటువంటి జంతువులను ఆహారంగా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచ మహామ్మారిగా మారి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే అమెరికా, చైనా, భారత్‌ ‌మరియు ఇతర దేశాల్లోని పరిశోధనా సంస్థలు కరోనాకు వ్యాక్సిన్‌ ‌తయారీ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. కొత్తవాక్సిన్‌ ‌తయారీ మరియు వివిధ దశలను పూర్తి చేసుకొని మార్కెట్‌లోకి రావడానికి దాదాపు ఏడాది మరియు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. అప్పటి వరకు ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడుతారు.”

అనాదిగా మానవుడు మాంసాహారం తింటూ వస్తున్నాడు. నాగరికత అభివృద్ధి చెందని సమయంలో ఆహారం అంటేనే ‘జంతువుల మాంసం’ అనే నానుడి ఉండేది. క్రూరమృగాలను ఆది మానవుడు వేటాడి చంపి తన జీవనం కొనసాగించేవాడని చరిత్ర పుస్తకాల్లో కుడా చదివాము. కాని క్రమంగా నాగరికత అభివృద్ధి చెందుతూ, మనిషిలో విజ్ఞానం పెరుగుతూ వస్తున్న మధ్యయుగ కాలంలో ఆహారం అంటే ‘కేవలం జంతువుల మాంసం కాదు, అడవిలో దొరికే ఆకులు, అలములు, దుంపలు, ఇతరత్రా మొక్కలు అని తెలుసుకొన్నాడు. ఆ తర్వాత నవీన యుగంలో మాంసం తినడం తగ్గించి కేవలం ఉత్సవాల సమయంలో మాంసాహారం తింటూ శాఖాహారాలను పండించే వ్యవసాయాన్ని కనుగొన్నాడు.

ఇలా మెల్లమెల్లగా నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవునిలో ఆహారపు అలవాట్లలో చాలామార్పులు వచ్చాయి. పుట్టిన తర్వాత తల్లి పాలు తాగడం నేర్చుకొన్నాడు. ఆ తర్వాత తల్లికి పాలు రాకుంటే పశువుల పాలు త్రాగడం, దాని కోసం పశువుల పెంపకం, పోషణ నేర్చుకొన్నాడు. కాని ఇప్పుడు వచ్చిన నవీన విజ్ఞానం సహజత్వాన్ని మరిచిపోయింది. జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోక వికృత ఆహారపు అలవాట్లతో మానవ జనాభా ఇలా కభళిస్తుందని ఊహించలేకపోయాడు మానవుడు.

జంతువులను మచ్చిక చేసుకోవడం మనిషికి ప్రాచీన కాలం నుంచి ఉంది. జంతువులను తనకు అనుకూలంగా వినియోగించుకోవడం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. జీవనోపాధికి పశువుల పెంపకం, పందులు, గొర్రెలు, మేకల పెంపకం, కుక్కలు, ఒంటెలు, కోళ్ళ పెంపకం వంటి వాటిని కొన్ని తరాలుగా మానవ జాతి వృత్తులుగా కొనసాగిస్తూనే వున్నాడు. ఎప్పుడయితే ఈ జంతువుల పెంపకం వృత్తిలాగా మారిందో, క్రమక్రమంగా అది పారిశ్రామీకీకరణ, వాణిజ్యీకరణకు దారితీసింది. వాణిజ్యీకరణలో భాగంగా పోటీతత్వం పెరిగి మాంసం ఎగుమతులు, దిగుమతులు ప్రపంచ దేశాల్లో పెరుగుతూ వచ్చాయి. దాని కారణంగా మాంసాన్ని ప్రాసెస్‌ ‌చేయడం, నిలువ చేయడం ప్రారంభమయింది. జంతువులనుపెంచడం, పోషించడం, వాటి మాంసాన్ని నిలువ చేయడం, ప్రాసెస్‌చేయడం, ఆహారంగా తీసుకోవడం వలన ఆ జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల భయంకర వ్యాధులు వస్తున్నాయి. సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీస్‌ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌ప్రివెన్షన్‌, ‌యుఎస్‌ఎ. ‌నివేదిక మానవునికి వచ్చే వ్యాధులలో మొత్తం 45శాతం వ్యాధులు జంతువుల నుండి వచ్చేవే అని తేల్చి చెప్పింది. వాటిలో రేబిస్‌, ఆం‌త్రాక్స్, ‌ప్లేగు, మెదడువాపు, నిపా వైరస్‌, ‌బ్రుసేల్లోసిస్‌, ‌క్షయ వ్యాధి, హెర్పిస్‌ ‌బి వైరస్‌ ‌మొదలగునవి ప్రాణాంతకమయినవి. ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్‌ -19 ‌లేదా కరోనా వ్యాధి కూడా జంతువుల నుండే మానవునికి వచ్చిందని శాస్త్రవేత్తలు జన్యు విశ్లేషణ చేసి నిరూపించారు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హెల్త్, ‌యుఎస్‌ఏ ‌రూపొందించిన ఒక సర్వే లో 27 శాతం పశువులు జీర్ణాన్త్ర కోశ వ్యాధులకు కారణమయిన బాక్టీరియా, వైరస్‌లతో ఉంటాయని, 7 శాతం జంతువులు టిబి వ్యాధి గ్రస్త క్రిములతో ఉంటాయని, 25 శాతం జంతువులు ‘క్యు జ్వరం’ క్రిములతో ఉంటాయని తెలిపింది.75 శాతం గ్రామీణ ప్రజలు, 65 శాతం పట్టణ ప్రజలు ఆహారం కొరకు, ఆదాయం కొరకు జంతువులపైననే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ వ్యాధులన్ని మానవునికి రావడానికి ముఖ్యమయిన కారణం మన ఆహారపు అలవాట్లే అని తెలుసుకోకతప్పదు.

సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీస్‌ ‌కంట్రోల్‌ (‌సిడిసి) అండ్‌ ‌ప్రివెన్షన్‌, ‌యుఎస్‌ఎ ‌లెక్కల ప్రకారం1918 లో హెచ్‌1ఎన్‌1 ఇం‌ఫ్లియోన్జా వైరస్‌ ‌బారినపడి ఆరు లక్షల డెబ్బై అయిదు వేల (6,75,000) మంది అమెరికా లోనే చనిపోయారు. 14వ శతాబ్ద కాలంలో ప్లేగు వ్యాధి యూరప్‌ ‌నుండి ఈజిప్ట్‌కు, ఈజిప్ట్ ‌నుండి ఆసియాకు సంక్రమించి మొత్తం 17 మిలియన్ల జనాభాను పొట్టనపెట్టుకుంది. చివరకు ఎలుకలు, పిల్లులను కూడా మానవ జాతి బతుకనీయకుండా మార్కెట్లో అమ్ముతూ ఆహారంగా అలవాటు చేసుకోవడం ప్రమాదకరంగా మారింది అనే వాస్తవాన్ని మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వుంది. కెన్యాకు చెందిన అంతర్జాతీయ లైవ్‌ ‌స్టాక్‌ ‌పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త రాబిన్‌ ‌జరిపిన ఒక అధ్యయనంలో ప్రతి సంవత్సరానికి 2.2 మిల్లియన్‌ ‌మానవ జనాభా ఈ జంతువుల నుంచి మానవునికి సంక్రమించే వ్యాధుల వలన చనిపోతున్నారని వెల్లడి అయింది. 2008లోనే ప్రముఖ‘నేచర్‌’ ‌సైన్స్ ‌పత్రిక ఒక ముఖ్యమయిన విషయాన్ని గుర్తుచేసింది. ఉత్తర అమెరికా రాష్ట్రాలు, పశ్చిమ యూరప్‌, ‌బ్రెజిల్‌, ‌దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాలు అన్నీ కూడా ఇటువంటి భయంకర వ్యాధులకు గురయ్యే హాట్‌ ‌స్పాట్‌ ‌కేంద్రాలుగా మారతాయని తెలిపింది.

మానవ జాతికి దగ్గర సంబంధమున్న చింపాంజీ, గెరిల్లా, కోతులను కూడా మనిషి వదిలిపెట్టలేదు. వాటిని వేటాడే క్రమంలో గాయపడడం వల్లనో, వాటిని ఆహారంగా తీసుకోవడం వల్లనో ప్రాణాంతక వ్యాధులను కొనితెచ్చుకొంటున్నాడు. డబ్లుహెచ్‌ఓ ‌లెక్కల ప్రకారం 2018 వరకు హెచ్‌ఐవి వైరస్‌ ‌బాడిన పడి ప్రాణాలు వదిలిన వారు 7,70,000. ప్రస్తుతం 37.9 మిల్లియన్‌ ‌మానవ జాతి ఈ భయంకరమయిన ఎయిడ్స్ ‌వ్యాధితో భాదపడుతున్నదని నివేదించింది. ఎస్‌ఐవిగా జంతువులలో వున్న ఈ వైరస్‌ ‌మానవునిలో ప్రవేశించి హెచ్‌ఐవి గా మారి ఇప్పటివరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది. అయినా మానవ జాతికి పశుమాంసం పైన మక్కువ తీరలేదు. కోతులు, చింపాంజీలనే కాదు చీకట్లో, గుహల్లో నివసిస్తున్న గబ్బిలాలను సైతం బతుకనివ్వడం లేదు. దాని ఫలితంగా 1976లో మొట్ట మొదటి సారిగా ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలోని ఎబోలా నది పరివాహక ప్రాంతంలో ఎబోలా వైరస్‌ ‌మానవునికి సంక్రమించి 2264 మంది ప్రాణాలను బలిగొందని డబ్లుహెచ్‌ఓ ‌వెల్లడి చేసింది. గత 20 సంవత్సరాలకు ముందు భారత దేశం కాకుండా ఇతర ఆసియా దేశాల్లో అనేక మంది జంతువుల నుంచి వచ్చే వ్యాధుల బారిన పడిచనిపోయారు. ఇతర దేశాల వారితో పోల్చుకుంటే మన దేశంలో మాంసం తినే వారి శాతం తక్కువగా వుండడం వలన మరణాల సంఖ్య తక్కువ. కాని ఈ 20 సంవత్సరాల్లో మన దేశంలో కూడా ప్యాశ్చాత్యీకరణ వెకిలిచేష్టలు వేయడం వలన మాంసాహారుల సంఖ్య పెరగడం ప్రారంభమయింది.

- Advertisement -

ఇదే విషయాన్ని ఐసిఎంఆర్‌, ‌న్యూఢిల్లీ సంస్థ అధ్యయనం చేసి ‘ఎప్పుడయితే శాఖాహారం మాని మాంసాహారం వైపు ప్రజలు మళ్లుతారో వారి వ్యాధి నిరోధకత శక్తి తగ్గి అనేక వ్యాధుల బారిన పడుతారు’ అని హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి కూడా జంతువుల నుండే వచ్చిందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. చైనాలో గబ్బిలాల పై పరిశోధనలు నిర్వహిస్తున్న ఒక శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్నీ బలపరిచింది. ప్రముఖ ‘నేచర్‌’ అనే సైన్స్ ‌పత్రికలో ఈ కరోనా వ్యాధి ‘పంగోలిన్‌’ అనే జంతువుల నుండి వచ్చింది కాదని, గబ్బిలాల నుండి మానవునికి సంక్రమింఛి ఉండవచ్చని జన్యు విశ్లేషణ అనంతరం తేల్చి చెప్పారు. అటువంటి జంతువులను ఆహారంగా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచ మహామ్మారిగా మారి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే అమెరికా, చైనా, భారత్‌ ‌మరియు ఇతర దేశాల్లోని పరిశోధనా సంస్థలు కరోనాకు వ్యాక్సిన్‌ ‌తయారీ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. కొత్తవాక్సిన్‌ ‌తయారీ మరియు వివిధ దశలను పూర్తి చేసుకొని మార్కెట్‌లోకి రావడానికి దాదాపు ఏడాది మరియు అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. అప్పటి వరకు ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడుతారు. కరోనా వైరస్‌లో 100కి పైగా రకాలున్నాయి. ఒక రకం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ‌కాని మందు కాని తయారుచేసినప్పటికీ ఆ మందు మిగితా రకం కరోనా వైరస్‌లపై పని చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. మ్యుటేషన్‌ అనే పద్దతిలో వైరస్‌ ‌తన రూపాన్ని మార్చుకుంటూ అనేక రకాలను పెంపొందించుకుంటుంది. కాబట్టి ఇది కూడా హెచ్‌ఐవి లాగా మారే పరిస్థితి కనబడుతుంది.

‘‘ఐకరాజ్యసమితి అనుమబంధ అధ్యయన మండలి’’ వారు ప్రపంచానికి మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలని ఒక దిశా నిర్దేశం చేస్తున్నారు. ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’ ఇటీవల పొందిపరిచిన నివేదికలో ‘మాంసాహారం తినడాన్ని తగ్గించడం వలన భూమండల పరిరక్షణకు దోహదం చేయవచ్చని’ తెలిపింది. ఇదే నివేదికలో, ఆహారపు అలవాట్లకు, ఆరోగ్యానికి సంబంధం ఉందని కూడా వెలువరించింది. మాంసాహారం విచక్షణారహితంగా తినడం వల్ల ఆరోగ్యం క్రమంగా క్షీణించి పోతుందని, పశువులకు వ్యాధిని కలిగించలేని వైరస్‌లు, బాక్టీరియాలు మానవునికి చేరడం వలన అవి మానవునికి వ్యాధిని కలిగించే వాటిగా తాయారవవుతాయని తన నివేదికలో పొందుపరిచింది.

మన దేశ సంప్రదాయంలో ఏవో కొన్ని పండుగల సందర్భాల్లోనే మాంసాహారం తినే అలవాటు ఉండేది. కాని పాశ్చాత్య నాగరికత మన దేశంలోనూ విస్తరించిన కారణంగా నెలకోసారి, వారానికోసారి, ప్రతి రెండు మూడు రోజులకోసారి మాంసాహారం తినడం మొదలయింది. ఇలా మాంసాహారం తినడం ఒక ‘భోగం’ గా మారింది. అప్పుడప్పుడు ఈ భాగాన్ని అనుభవిస్తే పర్వాలేదు కాని ప్రతిరోజు ఈ భోగాన్ని అనుభవిస్తే అది‘రోగ’మై పోతుందని మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఈరోజు అమాయక జీవులను చంపి తినడం వలన వచ్చే ఫలితాన్ని ప్రపంచం చూస్తుంది. మధుమేహం, కాన్సర్‌, ‌హృదయ భారం వంటి వ్యాధులు విచాక్షణారహితమైన ఆహారపు అలవాట్ల వల్ల దాపురించిన జబ్బులే అని తెలుసుకోలేకపోతున్నది నేటి సైన్స్. ‌ప్రతి రోజు 50 గ్రాముల కంటే ఎక్కువ మాంసాహారం తినకూడదని డబ్లుహెచ్‌ఓ ‌సంస్థ నిర్దేశకాలు చెబుతున్నా, దీనిని అతిక్రమించడం వలన ప్రతి సంవత్సరం యాభై వేల మంది కాన్సర్‌ ‌మరియు ఇతర వ్యాధుల భారిన పడి చనిపోతున్నారని కూడా అదే నివేదికలో డబ్లుహెచ్‌ఓ ‌వెల్లడి చేసింది.

చికెన్‌(‌కోడిమాంసం), కోడి గుడ్లు తినడం వలన ఏ వ్యాధి రాదు అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కాని గడిచిన పది సంవత్సరాల్లో కోళ్ళ నుంచి మానవునికి వచ్చే వ్యాధుల వలన ఒక లక్షా ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారని ‘సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌’ ‌వెల్లడి చేసింది. చికెన్‌ ‌లోని మూలుగ పరిపక్వమయినది కాకపోవడం చేత అది తినడం వలన వ్యాధి నిరోధకత పెరగదు. మాంసం పెరగడానికి ఇచ్చే హార్మోనులు, రసాయనాలు ఆ మాంసం తిన్నవారికి చేరడం వలన శరీరంలో హార్మోనుల అసమతుల్యత ఏర్పడి వ్యాధి నిరోధకత తగ్గుతుందని ప్రముఖ ‘సైన్స్’ ‌పత్రిక వెల్లడించింది. గుడ్డులో ప్రొటీన్ల వలన వాటిని ఆశ్రయించడానికి బాక్టీరియాలు, వైరస్‌లు కూడా పోటీ పడుతుంటాయి.

ప్రస్తుతం నగరాల్లో ప్రతిరోజూ మనం తాగే పాలు ఎంత కలుషితమవుతున్నాయో అందరికీ తెలిసిందే. మనం తాగే పాలు ఏ1 రకానికి చెందినవి. దేశీయ ఆవులు, గేదెల నుండి వచ్చిన ఏ2 పాలు శ్రేయస్కరమని ఆయుష్‌ ‌సంస్థ చెబుతున్నది. ఈ ఏ1 పాల వలన మానవుని శరీరంలో హార్మోనుల అసమతుల్యం ఏర్పడి చిన్న వయస్సులోనే మహిళలు బహిష్టు కావడం, ఆడవారికి మీసాలు కనబడడం వంటి విలక్షణాలు మనం చూస్తూనే వున్నాం. క్రమ క్రమంగా వీటి ప్రభావం వలన రోగనిరోధక శక్తి తగ్గి అనేక రకాల సాంక్రమిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తున్నారు. అందువల్లనే ‘న మాంస భక్షణే దోష:’ అంటే మాంసం తినడం తప్పుకాదు అని చెప్పిన భారతీయ ధర్మ శాస్త్రాలు ‘ప్రవృత్తిరేవ భూతాని’ అంటే ‘మాంసం తినటం మానవ ప్రవృత్తి’ అనే విషయాన్ని కూడా అంగీకరించాయి. కాని ‘నివృత్యాస్తూ మహా ఫలా:’ అంటే ‘మాంసం తినడం మానుకోవడం వలన గొప్ప ఫలితాలు లభిస్తాయి’ అని చెప్పిన విషయాన్ని •మరిచిపోయాము.
మాంసాహారం కోసం ఆవులను, ఇతర పశువులను, వన్య మృగాలను, పక్షులను, జలచరాలను బహిరంగంగా వేధించడం వల్ల ప్రకృతి, పరిసరాలలోని నీరు, గాలి కలుషితమై మానవునికి అనేక వ్యాధులు రావడం మరో వైపరిత్యానికి దారి తీస్తోంది. సముద్ర వనరులను దోచుకుంటే ‘సునామీ’ రూపంలో, భూ వనరులను దోచుకుంటే ‘భూకంపం’ రూపంలో, వృక్ష జాతిని దోచుకుంటే కరువు కాటకాలు, వరదల రూపంలో, జంతు జాతిని చంపి తింటే ‘కరోనా’ లాంటిభయంకర వ్యాధుల రూపంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. కాబట్టి సహజ వనరులను, వృక్ష, జంతు, పశు, పక్ష్యాదులను కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపైన ఉంది.
గడిచిన కాలం నేర్పిన గుణపాఠాన్ని విస్మరించక తక్షణమే వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమయిన మార్గం. కాబట్టి మనతో పాటు జంతువులను బతుకనిద్దాం, పశు సంపదను కాపాడుతూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిద్దాం, పర్యావరణ సమతుల్యతను కాపాడుదాం, మాంసాహార భక్షణ తగ్గించి జంతువుల సంరక్షణతో పాటు, పరిసరాల పరిరక్షణ, వ్యవసాయ భూముల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిద్దాం…..

– డా..మామిడాలఇస్తారి
అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌,
‌జంతుశాస్త్ర విభాగం, కెయు
సెల్‌ : 9848309231

 

Leave a Reply