Take a fresh look at your lifestyle.

అక్షరాల పూదోటలో తొలికిరణాలు

నూట యాభై ఎనిమిది పేజీలు గల
తొలి కిరణాలు పుస్తకం వెల. 250 రూపాయలు.

ప్రతులకు..
కె. బ్రహ్మయ్య ఆచారి, చరవాణి. 9581357107

మెట్రో ఉదయం జాతీయ దినపత్రిక సౌజన్యంతో ఉదయ సాహితీ వేదిక తీసుకొచ్చిన తొలికిరణాలు జాతీయ కవన సంకలనం వర్తమాన తెలుగుకవుల హృదయ స్పందనలను ప్రతిబంబిస్తుంది. సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జాతీయ కవన సంకలనంలో తెలుగుభాషలో లబ్ద ప్రతిష్టులైన కవులతో పాటు నవకవులు కూడా తమ రచనలతో ఆకట్టుకున్నారు. మెట్రో ఉదయం సిఈవో కె. బ్రహ్మయ్య ఆచారి ఆధ్వర్యంలో బి.లక్ష్మీ నారాయణ సంపాదకత్వంలో తొలి కిరణాలు సంకలనం దీపావళి పర్వదినం సందర్భంగా రూపుదిద్దుకుంది. ఇందులో మొత్తం 158 మంది కవులు రాసిన 158 మంది కవితలు ప్రచురించారు. కవులు తమ హృదయాంతరంగంలోని భావాలను అద్బుతమగు రీతిలో అవిష్కరించారు. ప్రతి కవితలో కూడా వస్తువైవిధ్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది. తొలి కిరణాలు సంకలనానికి పలకరింపుగా తెలుగు సాహిత్యంలో ప్రముఖ సాహితీవేత్తలు అభినందనలు రాయడం గొప్ప విశేషం. ఈ పలుకులు పుస్తకానికి అదనపు ఆకర్షణ కలిగించడంతో పాటు నవ కవులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పవచ్చు.

దేశానికి వెన్నెముకైన రైతన్నల గురించి, మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల గురించి కవులు వర్ణించిన తీరు పాఠకుల హృదయాలను బరువెత్తిస్తుంది. మాతృభాషాభిమానంకు సంబంధించిన కవితలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కొందరు రచయితలు ఆడపిల్లలపై జరిగే అకృత్యాలను మన కళ్లముందుంచి ప్రశ్నలు సంధించారు. పల్లె నుండి పట్నందాక అక్షరం నుండి అనంతం వరకు అనేక అంశాలను కవులు స్పృశించారు. నేడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాపై ప్రజలను చైతన్యపరిచే విధంగా అనేక కవితలు రాసి కవులు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా చాలా మంది కవులు ఈ సంకలనంలో తమ అక్షర కాంతులతో దీపావళి వెలుగులను పంచారు. అద్భుతమైన అక్షరాల పూదోటలో తొలి కిరణాలను ప్రసరింపజేశారు రచయితలు.

మానవీయ సంబంధాలతో పెనవేసుకున్న కవితలు ఒకపక్క ప్రకృతి సోయగాలను వర్ణించిన కవితలు మరోపక్క మనకు దర్శనమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తొలికిరణాలు సంకలనం సామాజిక ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. సమకాలీన సామాజిక సమస్యలపై అనేక కవితలు ఇందులో ఉన్నాయి. మన కంటికి కనబడే ప్రత్యక్ష దైవాలైన అమ్మ నాన్నల గురించి రాసిన కవితలు అద్భుతంగా ఉన్నాయి. మహానీయులైన మహాత్మా గాంధీ, జ్యోతిబాపులే రాసిన కవితలతో పాటు మరికొన్ని కవితలు దేశభక్తిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. నిరుద్యోగ జీవితాన్ని చెప్పిన కవితలతో పాటు ఆత్మహత్యలు వద్దు ఆత్మవిశ్వాసం ముద్దు అని చెప్పిన కవితలు ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి కవిత దేనికది ప్రత్యేకమైనదే. ఆయా కవులు తమ సృజనాత్మక రచనలతో అత్యంత ప్రతిభను కనబరిచి ఆకట్టుకున్నారు.

మెట్రో ఉదయం పత్రిక ద్వారా సాహితీ కవనాలు శీర్షికతో ఎందరో కవులను ప్రోత్సహిస్తున్న బ్రహ్మయ్య ఆచారి సత్‌ ‌సంకల్పంతో తొలి ప్రయత్నంగా ‘‘తొలి కిరణాలు’’ సంకలనం తీసుకురావడం ఒక సంచలనమనే చెప్పవచ్చు. రచయితలకు ఈ మహా సంకలనంలో అవకాశం కల్పించిన సహా సంపాదకులు కొండా రవీందర్‌, ‌పొలయ్య కవి కూకట్లపల్లి, కోడిగూటి తిరుపతి, పోతుగంటి వీరాచారి , సలహాదారు కందాలై రాఘవాచార్య, ఎడిటర్‌ ‌లక్ష్మినారాయణ, బ్యూరో చీఫ్‌ ‌సాత్రి వరప్రసాద్‌ ‌రావు, నరసింహా చారి గార్లకు ప్రత్యేక అభినందనలు. తొలి కిరణాలు సంకలనంతో తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ప్రభంజనం సృష్టించిన బ్రహ్మయ్య ఆచారి భవిష్యత్తులో మెట్రో ఉదయం పత్రిక ద్వారా, ఉదయసాహితీ వేదిక ద్వారా మరెందరో కవులకు అవకాశం కల్పించి తెలుగు సాహిత్యానికి మరింత వన్నె తేవాలని, ఇలాంటి గొప్ప కవితా సంకలనాలు వారి ఆధ్వర్యంలో మరిన్ని రావాలని ఆశిద్దాం.
– కందుకూరి భాస్కర్‌.

Leave a Reply