Take a fresh look at your lifestyle.

పాఠశాలలకు ముందస్తు సెలవులు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రంలో రోజురోజుకు కోవిద్‌, ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతున్నది. డెల్టా కేసా ఒమిక్రాన్‌ ‌కేసా అని నిర్థారణ చేసుకోవడంతోనే సరిపోతున్నది. కాస్తా అటు ఇటుగా రెండు కూడా డేంజరస్‌ ‌కేసులేనని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌ప్రవేశపెట్టడమే శ్రేయస్కరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత ఇబ్బందులను చవిచూసిన నేపథ్యంలో కేంద్రం మాత్రం ఆయా రాష్ట్రాల ఇష్టానికే వొదిలివేసింది. కాని కేసుల విజృంభణను మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించ•లేక •పోతున్నాయి. దేశంలోని ఇరవై మూడు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు ప్రభుత్వాల వద్ద నమోదు అయిన ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య దాదాపుగా రెండు వేలకు దరిదాపుకు చేరుకోవడంతో ప్రభుత్వాలు అప్రమత్త మవుతున్నాయి. నమోదు అయిన వాటిల్లో ఎక్కువగా మహారాష్ట్ర, దిల్లీలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 570 కి చేరుకోగా దిల్ల్లీలో ఒమిక్రాన్‌ ‌బాధితుల సంఖ్య 382కు పైమాటే.

కాగా కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152, తమిళనాడులో 121 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం నాడు చెప్పిన లెక్కలివి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో మరికొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదు అయిన కొరోనా కేసుల సంఖ్య 37 వేలకు పైగానే ఉన్నాయి. వీటితో ఇప్పటి వరకు దేశంలోని మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 49 లక్షల 60 వేల 261 అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కాగా మన రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజున్నే 482 పాజిటివ్‌ ‌కేసులను గుర్తించినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దేశాలనుంచి వొస్తున్న వారి మూలంగా ఈ కేసుల సంఖ్క పెరుగుతున్నదంటున్నారు. ఇటీవల కాలంలో శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి చేరుకున్న 423 మందిని పరీక్షించగా 23 మందికి కోవిద్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగిందంటే విదేశాలనుంచి వొస్తున్న వారి పట్ల జాగ్రత్త ఎంతో అవసరమన్నది స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సభలు, తాజాగా జరిగిన క్రిష్టియన్‌ ‌వేడుకలు, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మరికొన్ని కేసులు పెరిగినట్లుగా భావిస్తున్నారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ అరెస్టు వెనుక ఇదే కారణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఒక వైపు వైరస్‌ ‌విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంజయ్‌ ‌జాగరణ దీక్ష చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది .అయినా ఆయన పార్టీ కార్యాలయంలో లోపల తాళాలు వేసుకుని దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్దంగా ఆయన చర్యను ఖండిస్తూ అరెస్టుచేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. కోర్టుకూడా కోవిద్‌ ‌నిబంధనలను పరిగణలోకి తీసుకుని సంజయ్‌కు పద్నాలుగు రోజుల జుడిషియల్‌ ‌కట్టడి విధించింది. అలాగే తాజాగా ప్రారంభించిన ఎగ్జిబిషన్‌ ‌విషయంలోకూడా రాష్ట్ర ప్రథాన న్యాయస్థానం కామెంట్‌ ‌చేసిన విషయం తెలిసిందే. ఒక పక్క కొరోనా, ఒమిక్రాన్‌కు భయపడి ప్రజలు బయటికి రావడానికే ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఎగ్జిబిషన్‌ ‌నిర్వహణ అంత అవసరమా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయినా దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వానికే వొదిలేసింది.. దీనికి ముందే ప్రభుత్వం ఈ నెల పదవ తేదీవరకు ఎగ్జిబిషన్‌ ‌నిర్వహణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం గమనార్హం.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, సంస్థలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ముఖ్యంగా విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిశ్చయించింది. అందుకే ఈసారి మూడు రోజుల ముందుగానే సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా ప్రభుత్వం జనవరి 11 నుండి సంక్రాంతి సెలవులను ఇవ్వడం సహజంగా జరుగుతున్న ప్రక్రియ. కాని పెరుగుతున్న కోవిద్‌, ఒమిక్రాన్‌ ‌కేసుల దృష్ట్యా ప్రభుత్వం మూడు రోజుల ముందునుండే సెలవులు ప్రకటించింది. ఈనెల పదిహేడున పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అయితే ఆనాటి కోవిద్‌ ‌పరిస్థితులనుబట్టి సెలవులు పెంచడమా, లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని తాజాగా ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌ ‌హైకోర్టుకు అందజేసిన నివేదికలో తెలిపారు. అందుకు వైరస్‌ ‌బాధితులకు ఎక్కడికక్కడ చికిత్స అందించేందుకు బస్తీ దవాఖాలను సిద్దంచేస్తున్నారు కూడా. మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలుపుతూ, ఈ ఉపద్రవాన్ని అధిగమించేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని తప్పక పాటించడం ద్వారా వైరస్‌నుండి కొంతవరకైనా రక్షణ పొందే అవకాశాన్ని సంబంధిత• అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నదాన్ని పాటించాల్సిఉంది.

Leave a Reply