Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవా…!

రాష్ట్రంలోని పరిణామాలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్‌ ‌ప్రకారం 2023 చివరిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగాల్సి ఉన్నాయి. కాని, లోహం వేడిమీద ఉన్నప్పుడే సాగదీయడానికి అవకాశం ఉంటుందన్నట్లుగా, రాష్ట్రంలో తెరాసకు ఇప్పుడు మంచి పట్టులో ఉన్నప్పుడు ఎన్నికలు కానిస్తే అధికార పార్టీదే విజయం అన్న భావన ఉంది. స్థానిక సంస్థలు మొదలు రెండు చట్టసభల్లో ఆ పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉంది. దానికి తగినట్లు ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు పుంజుకునేందుకు ఇంకా చాలా సమయం పట్టేట్టు ఉంది. ఇంతవరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ స్థానాన్ని భారతీయ జనతాపార్టీ భర్తీకి తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే విషయంలో ఇంతవరకు టిఆర్‌ఎస్‌ ఎత్తుగడలు వేస్తూ రాగా, ఇప్పుడు ఆ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులకు బిజెపి గాలం వేస్తున్నది. ఈ సంది కాలంలో ఎన్నికలకు వెళితే లాభపడవచ్చన్న అభిప్రాయాంలో తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ ఘర్షణ వాతావరణానికి అదే కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పద్దతి ప్రకారం తెలుగుదేశం, కాంగ్రెస్‌ను ఎదగకుండా కెసిఆర్‌ ‌చేయగలిగారు.

అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేదనుకున్న బిజెపి ఇప్పుడు పక్కలో బల్లెంలా తయారవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్న తీరు, ఉద్యమకారుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ఉపాధి అవకాశాలు తదితర విషయాలను ఆయుధాలుగా మలుచుకుని బిజెపి టిఆర్‌ఎస్‌ ‌వెంట పడుతున్నది. ఇంతకాలంగా ఆ పార్టీని పెద్దగా పట్టించుకోని టిఆర్‌ఎస్‌కు ఇప్పటి నుండే దాన్ని కట్టడి చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కునటం కష్టమన్న ఆలోచనలో ఉంది. దానికి అదును కోసం కాచుకుకూర్చుంది. అందుకు రాష్ట్రంతోపాటు, దేశ వ్యాప్తంగా రైతాంగం చేస్తున్న ఆందోళనను అనుకూలంగా మలచుకుంది. వ్యవసాయ రంగంలో కేంద్రం రూపొందించిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సరానికి పైగా రైతాంగం డిల్లీ కేంద్రంగా చేసిన పోరాటం చివరి దశలో ప్రత్యక్ష పోరాటానికి టిఆర్‌ఎస్‌ ‌సిద్ధపడింది. అలాగే రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ముగ్గులోకి లాగి దాన్ని దోషిగా నిలబెట్టడంలో కొంత వరకు కెసిఆర్‌ ‌కృతకృత్యులైనారనే చెప్పవచ్చు. నేటికీ అధిక సంఖ్యాకులు అధారపడి ఉన్న వ్యవసాయరంగంపైన కేంద్రం నిర్లక్ష్య వైఖరి ఎలాంటిదన్న విషయాన్ని ప్రజలుకు ఇంకా వివరించడం ద్వారా బిజెపిని టార్గెట్‌ ‌చేసే ప్రయత్నంలోనే కేంద్రంపై పోరాటానికి ఇప్పుడు నడుముకట్టారు. అదే అంశాన్ని శుక్రవారం నాడు రాష్ట్ర రాజధాని కేంద్రంలో జరిగిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు ఆయన ఉద్బోధించారు కూడా.

ధాన్యం కొనుగోళ్ళు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, విభజన చట్టంలో పొందుపర్చిన వివిధ అంశాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి తదితర అంశాలపై ఇంతకు ముందుకన్నా మరింత గట్టిగా పోరాటం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదంతా ఒక అంశమైతే ఇక ముందు పార్టీ నాయకులెవరూ ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటానికి వీలులేదని, అలా ఎవరైనా ఉంటే పార్టీలో వారి భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించడం గమనార్హం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ కొంతకాలంగా వొస్తున్న ఆరోపణలకు ఇప్పటికైనా బ్రేక్‌ ‌వేయకపోతే ప్రజల్లో వొచ్చే అసంతృప్తి ముందస్తు ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆలోచనే ఈ వార్నింగ్‌ ఉద్దేశ్యమై ఉంటుందనుకుంటున్నారు. అలాగే ఇంత కాలంగా ఉద్యమకారుల విషయంలో వొస్తున్న ఆరోపణలకు కూడా కెసిఆర్‌ ‌చెక్‌ ‌పెట్టగలిగాడు. తాజాగా అయిదు కార్పొరేటర్‌ ‌పదవులను ఉద్యమ కాలం నుండి ఉన్నవారితో భర్తీ చేయడం ద్వారా ఇకముందు అలాంటి అపనిందకు తావులేకుండా చేసుకున్నారు. మరి కొన్ని కార్పొరేషన్‌ ‌పదవులను కూడా ఉద్యమకారులతోనే భర్తీ చేయనున్నట్లు కూడా పేర్కొనడం గమనార్హం. దీనితోపాటు ప్రగతి భవన్‌కు, ఫామ్‌ ‌హౌజ్‌కే పరిమితమవుతున్నాడంటూ చాలాకాలంగా కెసిఆర్‌పైన ఉన్న విమర్శను కూడా తిప్పికొట్టేందుకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నాడు. వాస్తవంగా ఈ నెల 19న వనపర్తి నుండే ఈ జిల్లా పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. దానికన్నా ముందు వరి ధాన్యం కొనుగోలు, ప్రత్యమ్నాయ పంటలు, దళిత బంధు లాంటి అంశాలపైన జిల్లా కలెక్టర్లతో చర్చించే ఆలోచనతో ఈ పర్యటనను మరుసటి రోజుకు వాయిదా వేశారు. వీటితోపాటు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇన్ని కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతుండడం ముందస్తు ఎన్నికలను ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకోవడానికేనన్న ఆలోచనకు తావిస్తుంది.

Leave a Reply