ఉన్నత విద్యామండలి ముట్టడికి విద్యార్థుల యత్నం
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉన్నత విద్యా మండలి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్లో ర్యాంకుల అవకతవకలను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది జరిగిన తప్పులనే ఈ ఏడాది కూడా విద్యామండలి కొనసాగించిందని మండిపడ్డారు. అధికారులు చేసిన తప్పులకు విద్యార్థులు బలైపోతున్నారు. జరిగిన తప్పులపై ఉన్నత విద్యామండలి అధికారులపై విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసారు.
ముఖ్యంగా ఎంసెట్ రాసిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సెకండియర్ హాల్ టికెట్కు బదులుగా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు. క్రాస్ వెరిఫై చేయకుండానే అధికారులు ఫలితాలు విడుదల చేశారు. సెకండియర్ హాల్ టికెట్ నెంబర్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఫస్టియర్ నెంబర్ వేశామని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. గురువారం నాడు ఇంటర్ విద్యార్థులు జేఎన్టీయూకు క్యూ కట్టారు. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలతో నెలకొన్న గందరగోళానికి.. ఇంటర్ విద్యార్థుల ఆందోళనకు విద్యాశాఖ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.