- ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు
- ప్రతి రూపాయి ప్రభుత్వమే చెల్లిస్తుంది
- టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు వెల్లడి
కొరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దృష్ట్యా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించిందని జిల్లా అధికారిక వర్గాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాదులోని మంత్రి నివాసం నుంచి శుక్రవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజాంబీల్ ఖాన్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్ కుమార్, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్స్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో చేపట్టాల్సినచర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ మేరకు జిల్లాలో వరి ధాన్యం కోతలు చేసేందు కోసం కావాల్సిన హార్వెస్టర్లన్నీ సిద్ధంగా ఉన్నాయని, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా హార్వెస్టర్లన్నీ సంసిద్ధం చేసినట్లు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై టెలి కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ వివరించారు.
కాగా రైతులకు ప్రత్యేక టోకెన్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడిస్తూ.. టోకెన్లను గ్రామంలోని గ్రామ సర్పంచ్, కార్యదర్శి, రైతులు, వ్యవసాయ అధికారుల సమక్షంలో ఎవరైతే ముందు పంట వేశారో.., వారి పంటలను ముందుగా కోతలు నిర్వహించేలా వారి సమావేశంలో నిర్ణయించిన ప్రకారం టోకెన్ నంబర్లు కేటాయింపు చేస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా కొనుగోళ్లకు కావాల్సిన సామగ్రిని సైతం సిద్ధం చేశామని పేర్కొంటూ., ప్రతి ఒక్క రైతుకు ప్రత్యేక టోకెన్లు కేటాయించి ధాన్యం కోతలు, కొనుగోళ్లు జరపనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 345 కొనుగోళ్ల కేంద్రాలకు గానూ 345 మంది ప్రత్యేక అధికారులను నియమించి గ్రామస్థాయిలో క్షేత్రస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని, ఆ సమావేశంలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, 30 మంది రైతులు, ఏఈఓలు-వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొని టోకెన్ నెంబర్లను పంపిణీ చేస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి, డివిజన్ కేంద్రంలో డివిజన్ స్థాయిలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ జిల్లాలో కొనుగోళ్లు చేసిన పంట వివరాలు, రైతుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పూర్తి సంక్షిప్త సమాచారాన్ని తెలుసుకునేలా ఈ కంట్రోల్ రూమ్ లు ఉంటాయని తెలుపుతూ.. మరో 3 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం అవుతాయని మంత్రి వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా 345 కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.జిల్లా స్థాయిలో ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసి, కమిటీలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, వ్యవసాయ శాఖ అధికారులు, డీఆర్డీఏ పీడీ, డీపీఓ, ఆర్టీఏ, ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ ప్రతినిధులు సభ్యులుగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్ స్థాయిలో కూడా కమిటీలు ఉంటాయని, గ్రామ స్థాయిలో ప్రతి రోజూ కొనుగోళ్లు ఎన్ని జరిగాయి.? ఎంత మంది రైతుల నుంచి కొనుగోళ్లు చేశామని, వారికి చెల్లించాల్సిన రూపాయలు ధర ఎంత ? అనే పూర్తిస్థాయి రోజూ వారీ నివేదికను డివిజన్ కంట్రోల్ రూమ్ కు పంపాలని, డివిజన్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కంట్రోల్ రూమ్ కు పంపాలని అధికారిక వర్గాలను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ వారీగా 3 కంట్రోల్ రూమ్స్, జిల్లా స్థాయిలో జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోళ్ల కేంద్రాల్లో వెయింగ్ మిషనరీ, టార్ఫ్ లీన్ కవర్లు, ప్యాడీ క్లినర్లు, తేమను కొలిచే సాధనాలు, టోకెన్లు అందుబాటులో పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.రైతు వారీగా ఏ రైతు ముందుగా నాట్లు వేశారనే.. ప్రకారంగా వారికి టోకెన్ నంబర్లు కేటాయించాలి.
గతంలోనే ఏఏ కొనుగోలు కేంద్రాలలోఎన్ని హార్వెస్టర్ లు పనిచేశాయో.. వాటి నివేదిక ఆధారంగా చేసుకుని హార్వెస్టర్ల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి పంట కోతకు వాటిని వినియోగమయ్యేలా చర్యలు చేపట్టాలి. రోజు వారీగా ఎంత ధాన్యం కొనుగోళ్లు చేశామో.., ఎన్ని రోజుల వరకు కొనుగోలు చేశారో.. ఆ వివరాలను దృష్టిలో పెట్టుకుని రోజు వారీగా ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తామో.. అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలో నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రవణ్ , డిఆర్డీఏ పిడి గోపాల్ ను మంత్రి ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ముందుకెళ్లాలా చర్యలు చేపట్టాలి. ప్రతి 50 కేంద్రాలకు ఒక సిస్టమ్ ఆపరేటర్ ను కేటాయించాలి. ప్రతి కొనుగోళ్ల కేంద్రంలో వెయింగ్ మిషనరీ, టార్పలిన్ కవర్లు, తేమను కొలిచే సాధనాలు, గన్నీ బ్యాగులు, షామీయానా లేదా పందిర్లు, ఫోటో లోకేషన్లు, కుర్చీలు , సబందిత రిజిస్టర్లు, టోకెన్ రిజిస్టర్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.