Take a fresh look at your lifestyle.

‌పండుగ కళ లేని దసరా

  • కొరోనా, భారీ వర్షాలతో ప్రజలు ఆగమాగం
  • దిక్కుతోచని స్థితిలో సామాన్య జనం
  • వ్యాపారులదీ అదే పరిస్థితి

‌తెలంగాణలో అతి ముఖ్యమైన దసరా పండుగ కళ తప్పింది. గతంలో దసరా పండుగ వస్తున్నదంటే వారం రోజుల ముందు నుంచే ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొని ఉండేది. పల్లెలు మొదలు పట్టణాల వరకు కొనుగోళ్లతో వ్యాపార సముదాయాలు కళకళలాడేవి. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. గత మార్చి నుంచి కొరోనా కలకలంతో చిన్నాభిన్నమైన ప్రజా జీవితం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో భారీ వర్షాల రూపంలో ప్రజలు, వ్యాపారుల నెత్తిన మరో పిడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పల్లెలు మొదలు నగరాల వరకు నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఏడాది మొత్తంలో ఏ వ్యాపారం నడచినా నడవకపోయినా దసరా పండుగకు వారం రోజుల ముందు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతీ దుకాణం కొనుగోలుదారులతో సందడిగా మారేది., ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు జోరుగా నడిచేవి. ప్రజలు కూడా దసరా పండుగకు వారం రోజుల ముందు నుంచే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం ప్రారంభించే వారు.

ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ముఖ్యమైన  వ్యాపార సముదాయాలు ఉండే కోఠి, ఆబిడ్స్, ‌చార్మినార్‌, ‌మదీనా, సికింద్రాబాద్‌, ‌బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, ‌ప్రాంతాలు ప్రజల కొనుగోళ్లతో రోజంతా రద్దీగా ఉండేవి. సామాన్య ప్రజలు మొదలుకుని సంపన్నుల వరకు ఈ ప్రాంతాలలోనే షాపింగ్‌లు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో అసలు పండుగ వాతావరణం మచ్చుకైనా కనిపించడం లేదు. దసరా పండుగ ఇంకా మూడు రోజులే ఉన్నప్పటికీ మునుపడి హదావుడి ఎక్కడా కనిపించడం లేదు. మరో వైపు, భారీ వర్షాలకు చిరువ్యాపారులు కుదేలైపోయారు. అప్పోసప్పో తెచ్చి పండుగ సమయంలోనైనా వ్యాపారం నడిపిద్దామనుకున్న వారి ఆశలు భారీ వర్షాలతో ఆవిరయ్యాయి.  కొరోనా కలకలం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కాస్త మెరుగవుతున్నాయని సంతోషపడ్డ వారికి బారీ వర్షాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి సైతం అలాగే ఉంది.

ఏటా ఎంతో ఆర్భాటంగా జరుపుకునే దసరా పండుగను జరుపుకోలేక పోతున్నామనే దిగులుతో తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగైన దసరా సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో దసరా పండుగను కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు కలసి జరుపుకుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అసలు పండుగ జరుపుకునే పరిస్థితే కనిపించడం లేదు. ఇక దసరా పండుగ సమయంలో వ్యాపారం బాగా జరిగే వస్త్ర దుకాణాలతో పాటు విద్యుద్దీపాలు, దేవతా విగ్రహాలు, ఇంటి అలంకరణ సామాగ్రిని విక్రయించే దుకాణాలు సైతం బోసిపోయాయి. వీటికి సంబంధించిన వ్యాపారులు ఎక్కువగా దసరా పండుగపైనే ఆశలు ఎక్కువగా పెట్టుకుంటారు. దసరా పండుగ సమయం రావడంతో గత ఆరు నెలలుగా వచ్చిన నష్టంలో కొంతయినా పూడ్చుకోవచ్చన్న ఆశతో ఉన్న ఈ వ్యాపారుల ఆశాలు కూడా భారీ వర్సాల కారణంగా అడియాశలయ్యాయి.

Leave a Reply