Take a fresh look at your lifestyle.

దసరా -బతుకమ్మ ప్రాశస్త్యము

‘‘సర్వాధీష్ఠాన రూపాయై – కూట స్థాపయై నమో నమః
అర్ధ మాత్రార్ధ భూతాయై – హృల్లేఖాయై  నమోనమః ’’

సర్వాధీష్ఠాన స్వరూప అయిన ఆ మహా మాత అయిన దుర్గా దేవి కి వినయాంజలులు సమర్పిస్తున్నాను.
‘‘నమో దేవి మహా విద్యే – నమామి చరణౌ తవ – సదా జ్ఞాన ప్రకాశయే దేహి సర్వార్ధ దేశివే’’

మహా విద్యా శివ స్వరూప సర్వార్ధ ప్రదాయిని – దేవాది దేవి! నీ పద కమలముల మీద మా తలలుంచెదము. ఈ దసరా నవ రాత్రులలో నీ విజ్ఞానమును మాకు ప్రసాదించి మాకు వెలుగు బాటను చూపుము. మము బ్రోచు భారము నీదే తల్లి. ఓ జగజ్జనని ! ముజ్జగాలను రక్షించే చల్లని చూపుల తల్లీ – సరోజ వదన – ప్రకృతి స్వరూపిణి – శుభంకరి! సర్వ భూతాలకు ఆధారమయిన మూల ప్రకృతివి, సర్వ ప్రాణులకు నీవే ప్రాణం, బుద్ధి, శరీరం నీవే, గౌరీ దేవివి నీవే! గాయత్రీ మాతవు నీవే. ఈ దసరా నవరాత్రులలో మమ్ములను రక్షించే దుర్గా దేవివి నీవే
దసరా నవరాత్రులలో తెలంగాణాలో జరుపబడే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య మొదలుకొని ఆశ్వయుజ అష్టమి వరకు జరుపబడుతుంది. దీనినే సద్దుల బతుకమ్మ అంటారు. ఓరుగల్లు నగరం బతుకమ్మ పండుగకు ప్రాశస్త్యం చెందినది.
తెలంగాణాలోని వరంగల్‌ ‌పట్టణములో బతుకమ్మ సంబురాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. దుర్గాష్టమి రోజు గౌరీ దేవి మహిషాసురుణ్ణి వధించిన కారణంగా, ప్రజలు గౌరీ దేవిని ఈ తొమ్మిది రోజులు పూజించగా, విజయదశమి రోజు గౌరీ దేవి వారిని కరుణించునని చెపుతారు. ఈ తొమ్మిది రోజులు ఎన్నో బతుకమ్మ పాటలు పాడుతారు . ఈ బతుకమ్మ పండుగ చోళుల కాలం లో ప్రారంభమైనది. ఒక పళ్లెంలో తంగేడు పూలు, గునుగు పూలు, సీతజడలు, గుమ్మడిపూలు ఇంకా అనేక రకాల పూలతో బతుకమ్మను పేర్చి పైన గౌరీ దేవిని పసుపుతో చేసి ప్రతిష్టించి స్త్రీలు ఈ తొమ్మిది రోజులు వివిధ రకాల బతుకమ్మ పాటలతో బతుకమ్మను కొలుస్తారు.
ఈ పండుగ ఒక్క తెలంగాణలోనే కాక ఆంధ్రా మరియు మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకుంటారు. ‘‘బతుకునిచ్చే అమ్మ  బతుకమ్మ అని తలచి బతుకమ్మను ప్రజలు ఎన్నో ఆటలతో, పాటలతో రక్షించమని ఈ దసరా నవరాత్రులలో వేడుకుంటారు.
– భండారు ధవళేశ్వరం రావు, ప్రొఫెసర్‌
‌వాగ్దేవి ఇంజినీరింగ్‌ ‌కళాశాల, బొల్లికుంట  

Leave a Reply