Take a fresh look at your lifestyle.

కొరోనా సమయంలో ప్రతీ ఇల్లు వైద్యాలయం…మంత్రి ఈటల వ్యాఖ్య

వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు
వైద్య విధాన పరిషత్‌లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
వైద్యారోగ్య శాఖపై సుదీర్ఘ సమీక్ష

‌వైద్య, ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రాచీన వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శనివారం ఇక్కడి వెంగళరావునగర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌ఫ్యామిలీ వెల్ఫేర్‌ ‌కార్యాలయంలో ఆయన ఆ శాఖకు సంబంధించిన అన్ని విభాగాధిపతులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొరోనా సమయంలో ప్రతీ ఇల్లు ఒక వైద్యాలయంలా మారిందని వ్యాఖ్యానించారు. అల్లోపతి మాదిరిగానే ఆయుష్‌ ‌విద్యార్థులు కూడా ఐదేళ్లు చదువుతున్నప్పుడు వారికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆయుర్వేద, యునానీ, హోమియో, నాచురోపతి, యోగా విభాగాలలో ఖాళీగా ఉన్న అన్ని టీచింగ్‌ ‌పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. తక్కువ రోగులు వస్తున్న ఆయుష్‌ ‌కేంద్రాలను పీహెచ్‌సిలకు తరలించాలని సూచించారు. వైద్య విధాన పరిషత్‌ ‌పరిధిలోని హాస్పిటల్స్‌లో పని చేయని వైద్యులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్పిటల్‌కు అంబులెన్స్, ‌సిటి స్కాన్‌, ‌పూర్తి స్థాయి ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలనీ, అవసరం ఉన్న అన్ని చోట్ల వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వైద్యం అందించడం ఎంత ముఖ్యమో రోగులను ఆప్యాయంగా చూడటం కూడా అంతే ముఖ్యమనీ, ఏ చికిత్స అందిస్తున్నామనో రోగులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అలాగే, ప్రజారోగ్య శాఖ పరిధిలో పీహెచ్‌సి నుంచి అన్ని ఖాళీల వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఇన్‌సర్వీస్‌ ‌పిజి చేసిన తరువాత వారి సేవలు వైద్య విధాన పరిషత్‌, ‌డీఎంఈ హాస్పిటల్స్‌లో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, వైద్య, మౌలిక సదుపాయాల కల్పన విభాగంపై సమీక్షలో భాగంగా మందుల నాణ్యతలో ఎట్టి పరిస్తితుల్లోనూ రాజీ పడొద్దని ఆదేశించారు. క్వాలిటీ టెస్ట్ ‌చేయడానికి అవసరమైన ల్యాబ్‌లు, సిబ్బందిని వినియోగించాలన్నారు. మార్కెట్‌ ‌ధరలకు అనుగుణంగా మందుల ధరలు ఉండాలనీ, వీటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండేలా చూడాలనీ ప్రతీ టాబ్లెట్‌కు లెక్క ఉండాలని స్పష్టం చేశారు. 90 శాతం మంది పేషెంట్లకు జిల్లా హాస్పిటల్స్‌లోనే వైద్య సేవలు అందేలా చూడాలనీ, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా చిన్న వయసులో బాలికల వివాహాలను అరికట్టగలిగామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ 24 గంటలు పని చేయాల్సిన శాఖ అనీ, అందువల్ల ప్రతీ నెలా సిబ్బందికి సకాలంలో జీతాలు అందేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply