- రాష్ట్ర ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ గెలవాలి
- కాంగ్రెస్ ఎంఎల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించి బుద్ధి చెప్పాలని, మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే దుబ్బాక ప్రజలు ఆలోచించి వోటు వేయాలని కోరారు. ప్రశ్నించే గొంతును శాసన సభకు పంపితే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ ఉప ఎన్నిక కోసం నాలుగుకోట్ల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. దుబ్బాక వోటర్లు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పడానికి ఒక మంచి అవకాశం వొచ్చిందన్నారు.
ముత్యంరెడ్డి ఆశయాలను కొనసాగించాలంటే చెరుకు శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దుబ్బాక అభివృద్ధి చెందకుండా ఇక్కడి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతున్నదని గ్రహించిన టీఆర్ఎస్ తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది కార్యకర్తలను గ్రామాల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతుందని, ప్రజలు గ్రహిస్తున్నారని, టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోని హరీష్ రావు ఇప్పుడు మాత్రం ఉపఎన్నికలో కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా దుబ్బాక ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. హరీష్ రావు అనుచర గణం దుబ్బాకలోని నాయకత్వాన్నీ అజమాయిషీ చేయడం చూస్తే, చీము నెత్తురు ఉన్న దుబ్బాక నాయకత్వం తిరగబడాలన్నారు. దుబ్బాక వోటర్లు ఈ ఎన్నికలో టీఆర్ఎస్ చెంపచెళ్లుమనేలా తీర్పునివ్వాలని జీవన్ రెడ్డి కోరారు.